AAP Rajya Sabha members may join BJP: దేశ రాజధాని రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు కీలక రాజ్యసభ సభ్యులు రాఘవ్ చద్దా, సంజీవ్ పాఠక్, అశోక్ మిట్టల్—త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటం, కీలక నిర్ణయాల్లో వీరి పాత్ర తగ్గడం వంటి పరిణామాలు ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రాఘవ్ చద్దా ను ఇటీవల దూరం పెట్టారు.
ఆప్ సీనియర్ నేత రాఘవ్ చద్దా గత కొంతకాలంగా పార్టీ వేదికలపై పెద్దగా కనిపించడం లేదు. గతంలో పార్టీ విధానాలను బలంగా వినిపించే ఆయన, ఇటీవల ఢిల్లీ మద్యం కుంభకోణం, ఇతర వివాదాల సమయంలో వ్యూహాత్మక మౌనం పాటించడం చర్చనీయాంశమైంది. వ్యక్తిగత కారణాల వల్ల లేదా ఆరోగ్య రీత్యా ఆయన విదేశాల్లో ఉన్నారని పార్టీ చెబుతున్నప్పటికీ, లోలోపల బీజేపీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం ఢిల్లీ రాజకీయాల్లో గుసగుసలకు దారితీస్తోంది.ఈ కారణంగా ఆయనను పార్టీ తరపున రాజ్యసభలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని కేజ్రీవాల్ లేఖ కూడా రాశారు. పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన సందీప్ పాఠక్, విద్యావేత్త అశోక్ మిట్టల్ కూడా తమ దారి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ ఎన్నికల్లో ఆప్ విజయంలో కీలక పాత్ర పోషించిన సందీప్ పాఠక్, ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మరోవైపు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడైన అశోక్ మిట్టల్ కూడా అభివృద్ధి , జాతీయ రాజకీయాల దృష్ట్యా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే రాజ్యసభలో ఆప్ బలం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ]
ఈ వార్తలపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించనప్పటికీ, ఇదంతా బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని ఆప్ శ్రేణులు కొట్టిపారేస్తున్నాయి. పార్టీని బలహీనపరిచేందుకు ఇలాంటి పుకార్లను సృష్టిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే, గతంలో కూడా అనేక మంది నేతలు ఇలాగే వార్తలను ఖండించి, ఆ తర్వాత ప్రత్యర్థి పార్టీల్లో చేరిన సందర్భాలు ఉన్నాయి. ఈ ముగ్గురు నేతలు స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చే వరకు ఈ సస్పెన్స్ కొనసాగేలా కనిపిస్తోంది. ఈ ముగ్గురు ఎంపీలు బీజేపీలో చేరితే, అది ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బ అవుతుంది. పార్టీ కేడర్‌లో నైతిక స్థైర్యం తగ్గే ప్రమాదం ఉంది.
