గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ దేవ్ రాత్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి అమిత్ షా హాజరయ్యారు. అమిత్ షాతో పాటు కేంద్రమంత్రులు మన్ శుఖ్ మాండవీయ, నరేంద్ర సింగ్ తోమర్ కూడా ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చారు.
గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈరోజు కేవలం భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. కేబినెట్ సభ్యుల ప్రమాణం వాయిదా పడింది. విజయ్ రూపానీ రాజీనామా చేసిన రెండు రోజుల్లోనే భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేశారు.
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి మొదటిసారి ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్ ను ఎంపిక చేసింది భాజపా అధిష్ఠానం.
ఎవరీ భూపేంద్ర పటేల్..
- భూపేంద్ర యాదవ్ ప్రస్తుతం ఘట్లోడియా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు.
- ఆ నియోజకవర్గం నుంచి 2017 ఎన్నికల్లో భాజపా తరఫున పోటీ చేసి రికార్డ్ స్థాయిలో 1,17,000 తేడాతో గెలుపొందారు.
- ఆ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంలో ఇదే అత్యధిక మెజారిటీ.
- గుజరాత్ మాజీ సీఎం, యూపీ గవర్నర్ ఆనందీబెన్ కు భూపేంద్ర పటేల్ సన్నిహితుడు.
- గతంలో అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఛైర్మన్‌గానూ పటేల్ బాధ్యతలు నిర్వర్తించారు.
విజయ్ రూపానీ శనివారం ముఖ్యమంత్రి పదవికీ రాజీనామా చేశారు. రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు రూపానీ. ఈ అవకాశం ఇచ్చిన పార్టీకి, అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.