దేశవ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. తమ పోరాటానికి ఏడాది గడుస్తోన్న నేపథ్యంలో రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్ ప్రభావం ఉత్తర భారతంలో ఎక్కువగా కనిపించింది. దిల్లీలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. దిల్లీ- గురుగ్రామ్ సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రైతులు రైల్వే ట్రాక్‌లపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. పంజాబ్-హరియాణా సరిహద్దు ప్రాంతంలో జాతీయ రహదారిని రైతులు దిగ్భందించారు. హరియాణా రోహ్‌తక్, కర్నాల్ ప్రాంతాల్లోనూ ట్రక్కు, ద్విచక్ర వాహనాలను నిలిపి రాకపోకలను రైతన్నలు అడ్డుకున్నారు.
దక్షిణ భారతంలో తమిళనాడు, కేరళలో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. కర్ణాటకలో మాత్రం బంద్ పాక్షికంగా సాగింది.
రైతుల సత్యాగ్రహం..
నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తోన్న భారత్ బంద్‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చారు.
తమ కార్యకర్తలు భారత్ బంద్‌లో పాల్గొనాలని ఇప్పటికే కాంగ్రెస్ పిలుపునిచ్చింది. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ ఉందని పేర్కొంది. ఈ బంద్‌కు విపక్షాలు మద్దతిచ్చాయి.
చర్చలకు పిలుపు..
రైతులు చేసిన ఆందోళనపై ప్రభుత్వం స్పందించింది. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. రైతులు ఆందోళనను వీడి చర్చలకు రావాలన్నారు. చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.