Rajasthan New CM: రాజస్థాన్ ముఖ్యమంత్రిపై సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ (Rajasthan CM Bhajan Lal Sharma)ను ఎన్నుకున్నారు. రాజధాని జైపూర్‌లో జరిగిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో భజన్ లాల్ శర్మను బీజేపీ ఎల్పీగా ఎన్నుకున్నారు. మాజీ సీఎం వసుంధర రాజే.. భజన్ లాల్ పేరును ప్రతిపాదించగా బీజేపీ ఎమ్మెల్యేలు అంగీకారం తెలిపారు. దాంతో రాజస్థాన్ తదుపరి ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ త్వరలో ప్రమాణం స్వీకారం చేయనున్నారు.  రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన దాదాపు 9 రోజుల తర్వాత రాజస్థాన్ సీఎం పేరు ఖరారుచేశారు..








ఇద్దరు నేతలకు డిప్యూటీ సీఎంలుగా ప్రకటించారు. దియా సింగ్, డాక్టర్ ప్రేమ్ చంద్ బైర్వాలు రాజస్థాన్ డిప్యూటీ సీఎంలు అని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ నేత రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. వాసుదేవ్ దేవ్‌నానీ రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించనున్నారు.


భజన్ లాల్ శర్మ వయసు 56 ఏళ్లు కాగా, ఆయన జైపూర్‌లోని సంగనేర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్‌పై 48,081 ఓట్ల భారీ తేడాతో భజన్ లాల్ విజయం సాధించారు.


సోమవారం మధ్యప్రదేశ్ సీఎంగా ఎమ్మెల్యే మోహన్ యాదవ్ (58)ని పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. నాలుగుసార్లు సిఎంగా చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ ను కాదని ఉజ్జయిని సౌత్ నుంచి గెలిచిన మోహన్ యాదవ్ ను మధ్యప్రదేశ్ సీఎంగా అవకాశం ఇచ్చారు. మోహన్ యాదవ్ గతంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. వరుసగా మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 


ఆ మరుసటిరోజే రాజస్థాన్ ముఖ్యమంత్రి విషయంలో పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం వసుంధర రాజే, కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, గజేంద్ర సింగ్ షెకావత్ మరియు అశ్విని వైష్ణవ్ లను కాదని, బీజేపీ అధిష్టానం భజన్ లాల్ శర్మకు ఓటేసింది. దాంతో బీజేపీలో ఏమైనా జరగొచ్చు, ఎవరైనా సీఎం అవుతారని ఆ పార్టీ సంకేతాలు పంపింది. 


ఇటీవల జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ 115 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 69 స్థానాలకు పరిమితమైంది. సచిన్ పైలట్, గెహ్లాట్ అంతర్గత విభేదాలు, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, శాంతి భద్రతల్లో సమస్యలు లాంటి అంశాలు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని దెబ్బ తీశాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాజస్థాన్ ప్రజలు ఈ సారి బీజేపీకి ఛాన్స్ ఇచ్చారు.