Bengaluru Techie Turns Thief: కొవిడ్ సంక్షోభంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పటికీ ఈ లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. బడా కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇలానే ఉద్యోగం పోగొట్టుకున్న ఓ ఐటీ ఉద్యోగి  డబ్బు కోసం చోరీలకు అలవాటు పడింది. బెంగళూరులోని పేయింగ్ గెస్ట్‌ల (PG) నుంచి రూ.10 లక్షల విలువైన ల్యాప్‌టాలు దొంగతనం చేసింది. చాలా రోజులుగా గాలిస్తున్న పోలీసులు చివరకు ఆ యువతిని అరెస్ట్ చేశారు. నోయిడాకి చెందిన జెస్సీ అగర్వాల్ ఉద్యోగం కోసం బెంగళూరుకి వచ్చింది. కొవిడ్ క్రైసిస్‌లో జాబ్ పోయింది. అప్పటి నుంచే సులువుగా డబ్బులు సంపాదించుకోడానికి అలవాటు పడింది. అలా దొంగతనాలు మొదలు పెట్టింది. పీజీల నుంచి ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లు చోరీ చేసి వాటిని బ్లాక్ మార్కెట్‌లో అమ్మింది. మొదట్లో అప్పుడప్పుడూ ఇలా చోరీ చేసిన జెస్సీ ఆ తరవాత పూర్తిగా అదే పనిగా పెట్టుకుంది. ఛార్జింగ్ పెట్టి ఉన్న ల్యాప్‌టాప్‌లను ఎవరికీ తెలియకుండా కొట్టేసి వాటిని నోయిడాలోని బ్లాక్‌మార్కెట్‌లో అమ్మేది. ఓ వ్యక్తి ఫిర్యాదుతో ఈ విషయమంతా బయటకు వచ్చింది. పీజీలో చాలా మంది ల్యాప్‌టాప్‌లు మిస్ అవుతున్నాయన్న కంప్లెయింట్ మేరకు పోలీసులు విచారణ చేశారు. జెస్సీ అగర్వాల్ ఈ చోరీలన్నీ చేసిందని తెలిసింది మార్చి 26వ తేదీన ఆమెని అరెస్ట్ చేసిన పోలీసులు మొత్తం రూ.10-15 లక్షల విలువైన 24 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. చాలా చోట్ల పీజీల నుంచి ల్యాప్‌టాప్‌లు చోరీ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. రంగంలోకి దిగిన క్రైమ్‌ బ్రాంచ్ అన్ని చోట్లా CC కెమెరా ఫుటేజ్‌ని పరిశీలిస్తోంది.