Bengal Assembly TMC Viral Video: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మైనారిటీ ఓట్ల చీలిక లక్ష్యంగా బీజేపీ భారీ కుట్రకు తెరలేపిందని ఆరోపిస్తూ అధికార తృణమూల్ కాంగ్రెస్  విడుదల చేసిన ఒక స్టింగ్ ఆపరేషన్ వీడియో ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోలో ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ  అధినేత, మాజీ టీఎంసీ నేత హుమాయున్ కబీర్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ కనిపించడం కలకలం రేపుతోంది.

Continues below advertisement

 రూ. 1000 కోట్ల ఒప్పందం? 

తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసిన ఈ వీడియోలో.. బీజేపీతో కలిసి మైనారిటీ ఓట్లను చీల్చేందుకు హుమాయున్ కబీర్ ఏకంగా రూ. 1000 కోట్ల భారీ ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు రూ. 200 కోట్లు ఇప్పటికే అడ్వాన్స్‌గా అందినట్లు, ఎన్నికల సమయంలో మైనారిటీ ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు ఒక్కో నియోజకవర్గంలో రూ. 3 నుండి 4 కోట్లు ఖర్చు చేయాలని ఆయన ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ కుట్రలో బీజేపీ అగ్రనేతలు సువేందు అధికారి, హిమంత బిశ్వ శర్మలతో పాటు పీఎంఓ  అధికారుల ప్రమేయం కూడా ఉందని టీఎంసీ నేతలు కునాల్ ఘోష్, ఫిర్హాద్ హకీమ్ ఆరోపిస్తున్నారు.   

Continues below advertisement

 ముస్లింల మనోభావాలతో ఆటలు

వైరల్ అవుతున్న వీడియోలో హుమాయున్ కబీర్ ముస్లిం ఓటర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.  ముస్లింలను మోసం చేయడం చాలా సులభం.. బాబ్రీ మసీదు అంశమే ఇందుకు పెద్ద ఉదాహరణ  అని ఆయన పేర్కొన్నట్లు టీఎంసీ ఆరోపించింది. ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదు తరహాలో మసీదు నిర్మిస్తానన్న తన పాత ప్రకటన కూడా కేవలం మైనారిటీల భావోద్వేగాలను వాడుకోవడానికేనని ఆయన ఒప్పుకున్నట్లు వీడియో సారాంశం. ఒకవేళ తన పార్టీ 70-80 సీట్లు గెలిస్తే, బీజేపీ మద్దతుతో ఉప ముఖ్యమంత్రి కావాలనేది తన అంతిమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 

 పొత్తు తెంచుకున్న ఎంఐఎం  

ఈ వీడియో బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. హుమాయున్ కబీర్ పార్టీ  తో ఉన్న పొత్తును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తక్షణమే రద్దు చేసుకున్నారు. మైనారిటీల సమగ్రతను, మనోభావాలను శంకించే వ్యక్తులతో కలిసి పనిచేయలేమని ఎంఐఎం స్పష్టం చేసింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని ఆ పార్టీ ప్రకటించింది. అయితే, తనపై వస్తున్న ఆరోపణలను హుమాయున్ కబీర్ తీవ్రంగా ఖండించారు. ఆ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  సాయంతో సృష్టించిన నకిలీ వీడియో అని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీఎంసీ ఆడుతున్న డ్రామా అని ఆయన వాదించారు.

 క్షేత్రస్థాయిలో గందరగోళం 

ప్రస్తుతానికి ముస్లిం ఓటర్లలో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీస్తోంది. కొన్ని ప్రాంతాల్లో హుమాయున్ కబీర్‌కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతుండగా, మరికొన్ని చోట్ల ముస్లింలు ఎంఐఎం వైపు మొగ్గు చూపుతున్నారు. ఎంఐఎంపై కూడా ఇలాంటి బీ-టీమ్  ఆరోపణలు గతంలో వచ్చినా, ఇప్పుడు హుమాయున్ కబీర్ వీడియో బయటపడటంతో ఒవైసీ పార్టీ త్వరగా స్పందించి పొత్తును వదులుకోవడం ఆ పార్టీకి కొంత సానుకూలతను తెచ్చిపెట్టింది.   ఎన్నికలకు కేవలం రెండు వారాల ముందు వెలుగుచూసిన ఈ  రూ. 1000 కోట్ల స్కామ్  వీడియో బెంగాల్ రాజకీయాల్లో ముస్లిం ఓటు బ్యాంకు ఏ దిశగా మళ్లుతుందోనన్న ఉత్కంఠను రేకెత్తిస్తోంది.