BCY party president Ramachandra Yadav participating in Bihar elections:  బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ బీహార్ ఎన్నికల్లో తన పార్టీని పోటీ చేయించేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ ఆయన పార్టీ శాఖను ప్రారంభించారు. ఇటీవల తరచూ బీహార్ లో పర్యటిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయన బీహార్ కు వెళ్లినప్పుడు అక్కడి ఎయిర్ పోర్టు నుండి పెద్ద ర్యాలీ జరుగుతోంది. కాన్వాయ్‌లతో పాటు.. పోలీసు రక్షణ కూడా ఇస్తున్నారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

Continues below advertisement


రామచంద్ర యాదవ్ పుంగనూరుకు చెందిన నేత. ఆయన గత ఎన్నికలకు ముందు భారత యువజన చైతన్య పార్టీ పార్టీ పెట్టారు. ఆ పార్టీ తరపున రెండు చోట్ల పోటీ చేశారు. అన్ని చోట్లా అభ్యర్థులను నిలబెట్టారు. తెలంగాణలోనూ అభ్యర్థులను నిలబెట్టారు. మంగళగిరిలో , పుంగనూరులో పోటీ చేశారు. మంగళగిరిలో మూడు వందల ఓట్లు, పుంగనూరులో నాలుగు వేల ఓట్లు వచ్చాయి. అయినా ఆ తర్వాత అయన తన రాజకీయాలను దేశ స్థాయిలో కొనసాగిస్తున్నారు. ఇప్పుడు బీహార్ లోనూ అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది.  






పుంగనూరులో రాజకీయాలు చేసినప్పుడు.. ఆయన ఇంటిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు చాలా సార్లు దాడులు చేశారు. ఆ సమయంలో ఆయన నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత షాను కలిసి..తనకు వై కేటగిరి భద్రత కల్పించుకున్నారు. దాంతో ఆయనకు దేశస్థాయిలో పలుకుబడి ఉందన్న ప్రచారం ప్రారంభమైంది. ఆర్థికపరమైన మద్దతు బాగా ఉండటంతో ఆయన రాజకీయాలు జోరుగా చేస్తున్నారు. గతంలో పుంగనూరులో ఆయన ఇంటిని నిర్మిస్తే.. ఆ గృహప్రవేశానికి..  బాబా రాందేవ్ కూడా వచ్చారు.                         


2014లో జనసేన తరపున పోటీ చేసిన రామచంద్రయాదవ్ ..తర్వాత సొంత రాజకీయాలు చేసుకుంటున్నారు. అయితే ఆయన తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసి..నోటాతో పాటు కూడా పోటీ పడలేకపోయిన ఆయన... బీహార్ లో ఏం చేస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆయనను అక్కడి రాజకీయవర్గాలు పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలోనూ పట్టించుకోలేదు. కానీ తెలుగు వారైన కొంత మంది సోషల్ మీడియా వాళ్లు మాత్రం వీడియోలు షేర్ చేస్తున్నారు. వారు బీసీవై పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలని చెబుతున్నారు. కేవలం డబ్బులు ఉన్నాయన్న హైప్ కోసమే ఆయన ఇలా చేస్తున్నారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.