Bangladesh Fire Accident: బంగ్లాదేశ్ రాజధాని ధాకాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఏడంతస్తుల భవనంలో ఉన్నట్టుండి రాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రి సమంతా లాల్‌సేన్ వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. ధాకా మెడికల్ కాలేజ్‌లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కనీసం 40 మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఫిబ్రవరి 29వ తేదీన ధాకాలోని బైలే రోడ్‌లో ఉన్న ఏడంతస్తుల బిల్డింగ్‌లో ఓ బిర్యానీ రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడి నుంచి మంటలు మిగతా అంతస్తులకూ వ్యాపించాయి. అప్పటికే చాలా మంది ఆ మంటల్లో చిక్కుకున్నారు. కొందరు ఎలాగోలా బయటపడినప్పటికీ...మిగతా వాళ్లు ఆ మంటల్లోని కాలిపోయారు. వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. 75 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బైలే రోడ్‌లో ఎక్కువగా రెస్టారెంట్‌లతో పాటు మొబైల్ ఫోన్ షాప్‌లు, క్లాత్‌స్టోర్స్ ఉన్నాయి. ఆ మంటలు పక్క బిల్డింగ్‌లకీ వ్యాపించి ఉంటే నష్టం ఇంకా తీవ్రంగా ఉండేది.
"మేం ఆరో అంతస్తులో ఉన్నప్పుడు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పొగ కమ్ముకుంది. వెంటనే మేం మెట్ల మార్గం ద్వారా బయటపడాలని చూశాం. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాం. అది మా వల్ల కాలేదు. ఎలాగోలా బిల్డింగ్ పై నుంచి దూకేశాం. మాలో కొంత మంది గాయపడ్డారు"
- బాధితుడు
బంగ్లాదేశ్‌లో ఇలా అగ్నిప్రమాదాలు జరగడం కొత్తేమీ కాదు. సేఫ్‌టీ రూల్స్ పాటించకపోవడం వల్ల తరచూ అక్కడ ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 2021లో జులైలో ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. అంతకు ముందు 2019లో ధాకాలోనే అపార్ట్‌మెంట్‌లో ప్రమాదం జరగ్గా...70 మంది బలి అయ్యారు.