Balineni Srinivas Reddy News: కొంత కాలంగా సొంత నియోజకవర్గం ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అందుబాటులో లేని సంగతి తెలిసిందే. గత డిసెంబర్‌ 12న బాలినేని తన పుట్టిన రోజు వేడుకలను నియోజకవర్గంలోనే నిర్వహించారు. ఆ తర్వాతి రోజు నుంచి ఒంగోలులో అందుబాటులో ఉండడం లేదు. హైదరాబాద్ లో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోసం రెండు రోజుల పాటు విజయవాడలో ఉన్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. అపాయింట్ మెంట్ దొరకకపోవడంతో భంగపడి బాలినేని విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లిపోయినట్లుగా సమాచారం. నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జిలను నియమిస్తున్న వేళ.. సీఎం జగన్ తో భేటీ కావాలని బాలినేని ప్రయత్నించినట్లు తెలిసింది. ఏటా ప్రతి సంక్రాంతికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు నియోజకవర్గంలోనే ఉంటూ వేడుకలు జరుపుకునేవారు. ఈసారి మాత్రం దూరంగా ఉన్నారు.


ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని ప్రణీత్‌ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాతే ఎన్నికల్లో పోటీ చేస్తానని తన తండ్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారని ప్రణీత్ రెడ్డి అన్నారు. వాటి కోసమే ఆయన వేచి ఉన్నారని.. రెండు రోజుల్లో రూ.170 కోట్లు విడుదలవుతాయనే సమాచారం ఉందని ప్రణీత్ రెడ్డి అన్నారు. ఆ తర్వాత తన తండ్రి ఒంగోలు వచ్చేస్తారని ప్రణీత్ రెడ్డి మాట్లాడారు. ఒంగోలులో ఆదివారం (జనవరి 14) నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో బాలినేని ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.


నిజానికి తన సొంత నియోజకవర్గంలో ఇళ్లస్థలాలు ఇప్పించడంతో పాటుగా.. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో, కొత్త ఇంఛార్జిల నియామకాల్లో తన మాట చెల్లుబాటు అవ్వాలనేది  బాలినేని శ్రీనివాస్ రెడ్డి భావనగా ఉంది. ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికే మళ్లీ టికెట్ ఇవ్వాలని బాలినేని ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనూ తామిద్దరమే ఆ స్థానాల నుంచి పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. కానీ, జగన్ మాత్రం మాగుంటకు టికెట్ నిరాకరిస్తున్నట్లు చెప్పేశారు. మరోవైపు, శిద్దా రాఘవరావుకు టికెట్‌ కోసం కూడా బాలినేని ప్రయత్నాలు చేస్తున్నారు. శిద్దా రాఘవరావుకు దర్శి టికెట్ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉండగా.. దర్శి సమన్వయకర్త బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డికి ఇచ్చేశారు. ఒంగోలు ఎంపీగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరును తెర పైకి తెచ్చింది. 


ఇలాంటి పరిస్థితుల్లో ప్రణీత్‌ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇళ్ల స్థలాలకు నిధులొస్తే నాన్నొచ్చేస్తారు సరే.. ఆయన్నే నమ్ముకుని టికెట్లపై ఆశలు పెంచుకున్న వారి సంగతేంటనే చర్చ ఇప్పుడు మొదలైంది.