Patanjali Ayurveda Misleading Ads: సుప్రీంకోర్టులో పతంజలి వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయుష్ వైద్యాన్ని ఎంపిక చేసుకోవాలా..? అలోపతి మెడిసిన్ వాడాలా అన్నది వ్యక్తిగత అభిప్రాయమని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టులో ఈ విషయం వెల్లడించింది. పతంజలి ఆయుర్వేద ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తోందని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పతంజలి ఆయుర్వేద ఫౌండర్స్ యోగా గురు రామ్ దేవ్ బాబాతో పాటు బాలకృష్ణపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానం పతంజలి సంస్థని మందలించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం సరికాదని మందలించింది. అంతే కాదు. దీనిపై ఇప్పటి వరకూ పతంజలి సంస్థ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపైనా మండి పడింది.ఈ క్రమంలోనే గత నెల పతంజలి సంస్థ క్షమాపణలు కోరుతూ అఫిడవిట్ వేసింది. కానీ...సుప్రీంకోర్టు దీన్ని తిరస్కరించింది. కొత్త అఫిడవిట్‌లు దాఖలు చేయాలని సూచించింది. ఈ మేరకు యోగా గురు రామ్‌దేవ్ బాబా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికీ పలు ప్రశ్నలు వేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఇంత వివాదం కొనసాగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసింది.
రెండేళ్లుగా వివాదం..
ఈ మేరకు కేంద్రం కోర్టుకి బదులిచ్చింది. "మూఢ నమ్మకాలు వ్యాప్తి చెందేలా ప్రకటనలు చేస్తే వాటిని ప్రభుత్వం కచ్చితంగా కట్టడి చేస్తుంది. ఈ విషయంలోనూ ప్రభుత్వం చట్ట ప్రకారమే నడుచుకుంది" అని వివరించింది. పతంజలి సంస్థ క్షమాపణలు చెప్పినప్పటికీ కోర్టు మాత్రం తీవ్రంగా స్పందించింది. "మేమేమీ గుడ్డి వాళ్లం కాదు" అంటూ తీవ్రంగా మండి పడింది. అంతే కాదు. కేంద్రం ఇచ్చిన సమాధానంపైనా కోర్టు సంతృప్తి వ్యక్తం చేయలేదు. కొవిడ్‌ని కట్టడి చేసే డ్రగ్‌ని తయారు చేశామంటూ పతంజలి సంస్థ చేసిన ప్రకటలనపైనా కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రకటనలు చేయొద్దని సంస్థని హెచ్చరించినట్టు కోర్టులో వెల్లడించింది ప్రభుత్వం. పతంజలి తయారు చేసిన Coronil Tablet కొవిడ్‌ని తగ్గిస్తుందనడాన్నీ తప్పుబట్టింది. Ayush కి సంబంధించిన ప్రకటల్ని వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు వివరించింది. ఏదేమైనా ఆయుర్వేదమా, అల్లోపతియా అన్నది వ్యక్తిగత అభిప్రాయం అని, అందుబాటులో ఉన్న అధికారిక వైద్యాల్లో ఏదో ఒకటి ఎంచుకునే స్వేచ్ఛ ప్రజలకు ఉంటుందని వెల్లడించింది. 2022లో Indian Medical Association (IMA) పతంజలి ప్రకటనల్ని వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అంతే కాదు. అలోపతి వైద్యాన్ని కించపరిచేలా యోగా గురు రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపైనా మండి పడింది. అయితే...పతంజలి సంస్థ కూడా ఈ పిటిషన్‌పై స్పందిస్తూ కోర్టులో మరో పిటిషన్ వేసింది. శాస్త్రీయంగానే తాము తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నామని అందులో వివరించింది. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.
Also Read: అస్థిపంజరాల నుంచి జాంబీ డ్రగ్ తయారీ, శ్మశానాల్లో ఎముకలు ఎత్తుకుపోతున్న ముఠాలు