Airlines Plane Crash: అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదంలో దాదాపు 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఎంబ్రేయర్ 190 అనే విమానం అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి బయలుదేరి ఉత్తర కాకసస్‌లోని రష్యా నగరమైన గ్రోజ్నీకి బయలుదేరింది. కజకిస్థాన్‌లోని అక్టౌ అనే నగరానికి కిలోమీటర్ల దూరంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి విమానాన్ని మళ్లించినప్పటికీ కూలిపోయిందని పలు నివేదికలు తెలిపాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో పలు కుట్రకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని కొందరు అనుమానిస్తున్నారు.
పక్షుల గుంపు తగలడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రష్యా ఏవియేషన్ తెలిపింది. అయితే ఈ ప్రమాద దృశ్యాలను చూసిన కొందరు నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దానికి కారణం రష్యా - ఉక్రెయిన్ మధ్య దాడులు జరగడమే. ఇక మరికొందరేమో విమానాల వెనుక ఫ్యూజ్‌లేజ్‌పై ఉన్న ష్రాప్‌నెల్ గుర్తులను ఎత్తిచూపారు. ఇది పక్షిని ఢీకొన్నట్టుగా అనిపించడం లేదన్నారు. విమానం బాడీపై బుల్లెట్ ఆనవాళ్లు కనిపించినట్టు మరికొన్ని వార్తా కథనాలు తెలిపాయి. ఈ అనుమానాలపై కజకిస్థాన్ డిప్యూటీ ప్రధాని కనట్ బొజుంబాయేవ్‌ని ప్రశ్నించగా.. "నేను ముందస్తు ప్రకటనలు చేసే ధైర్యం చేయను.. ఇలాంటి వార్తలపై తాను స్పందించలేను" అంటూ వ్యాఖ్యానించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
పశ్చిమ కజకిస్థాన్‌లో డిసెంబర్ 24న కుప్పకూలిన అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్ లోపల ఆక్సిజన్ ట్యాంక్ పేలిందని కజఖ్ మీడియావర్గాలు నివేదించాయి. ఫ్లైట్ క్రాష్ కావడానికి ముందే ప్రయాణికులు స్పృహ తప్పి పడిపోయారని కూడా వారు చెప్పారు. అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ J2-8243 తన షెడ్యూల్ రూట్ నుంచి వందల మైళ్ల దూరంలో కాస్పియన్ సముద్రం ఎదురుగా కూలిపోయిందని రష్యా ఏవియేషన్ వాచ్‌డాగ్ చెప్పిన తర్వాత, ఇది పక్షుల దాడి వల్ల సంభవించి ఉండవచ్చని ఒక నివేదిక తెలిపింది.
మరోవైపు, కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ నాయకుల అనధికారిక శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిన అజర్‌బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హామ్ అలియేవ్ రష్యా పర్యటనను విరమించుకున్నట్టు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దాంతో పాటు ఈ రోజును జాతీయ సంతాప దినంగా కూడా ఆయన ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిందన్నారు. పేలవమైన వాతావరణం కారణంగా విమానం గమనాన్ని మార్చిందని అలీయేవ్ చెప్పినప్పటికీ, విమానం కూలిపోవడానికి గల కారణాన్ని పూర్తిగా పరిశీలిస్తామని చెప్పారు. ఇకపోతే విమానంలో ఉన్నవారిలో 42 మంది అజర్‌బైజాన్ పౌరులు, 16 మంది రష్యన్ పౌరులు, ఆరుగురు కజక్‌లు, ముగ్గురు కిర్గిజ్‌స్థాన్ జాతీయులు ఉన్నారు.