Aviation Minister Rammohan Naidu Warns Indigo: ఇండిగో సంస్థ అంతర్గత నిర్లక్ష్యం వల్లనే ఈ సంక్షోభం ఏర్పడిందని కఠిన చర్యలు తీసుకుంటామని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో ప్రకటించారు. పెద్ద ఎత్తున విమానాల రద్దు, మార్గదర్శక వ్యవస్థలో అసాధారణ లోపాలు, సిబ్బంది రొస్టర్ మేనేజ్‌మెంట్‌లో నిర్లక్ష్యం కారణంగా ఏర్పడిన ఈ సంక్షోభాన్ని నివారించదగిన వైఫల్యంగా అభివర్ణించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ ప్రశ్నకు రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు. ఈ పరిస్థితిని తేలికగా తీసుకోవట్లేదని దర్యాప్తు జరుగుతోందన్నారు. ఇది ఒక ఉదాహరణగా తీసుకుని చాలా చాలా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇండిగోలోని అంతర్గత సిబ్బంది రొస్టర్ వ్యవస్థలో లోపాలు, మేనేజ్‌మెంట్ లోపాలే కారణమన్నారు. ఈ సమస్యకు ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ టెక్నికల్ గ్లిచ్‌తో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇది రోజువారీ కార్యకలాపాలు - ఇండిగో తన సిబ్బంది, రొస్టర్‌ను రోజువారీంగా నిర్వహించాల్సిన విషయం. విమానయాన రంగంలో ఏ ఏసీఆర్ లేక సంస్థ ఏదైనా ఉల్లంఘన చేస్తే చాలా చాలా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇండిగోలో నవంబర్ 2025 చివరిలో పెద్ద ఎత్తున విమానాలను రద్దు చేయడం ప్రారంభించారు. ఇది ఏప్రిల్ 2025లో కోర్టు ఆదేశాలతో ప్రవేశపెట్టిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనల అమలు కారణంగా కొత్త పైలట్లను ఇండిగో నియమించుకోకపోవడంతో సమస్యలు వచ్చాయి. FDTLలో 22 మార్గదర్శకాలు ఉన్నాయి. ఇవి సిబ్బంది విశ్రాంతి, భద్రతను నిర్ధారించడానికి రూపొందించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఏర్‌లైన్‌లకు ఆపరేషనల్ అవసరాలు, భద్రతా మూల్యాంకనాల ఆధారంగా మినహాయింపులు ఇచ్చింది. డిసెంబర్ 1న విమానయాన శాఖ ఇండిగోతో FDTL సంబంధిత సందేహాలపై సమావేశమైంది, కానీ ఎయిర్‌లైన్ సంక్షోభానికి కారణమైన అంశాలు లేవని చెప్పలేదు.