Lok Sabha Elections 2024: కాంగ్రెస్ భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు అసోం ముఖ్యమంత్రి (Himanta Biswa Sarma) హిమంత బిశ్వ శర్మ. త్వరలోనే ఆ పార్టీ జాతీయ హోదా కోల్పోతుందని జోస్యం చెప్పారు. అంతే కాదు. పలు రాష్ట్రాల్లో కేవలం ఓ స్థానిక పార్టీగా మిగిలిపోతుందని స్పష్టం చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో NDA 400 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఇక చరిత్రలోనే చదువుకోవాల్సి వస్తుందని సెటైర్లు వేశారు. ఆ పార్టీ పూర్తిగా పతనమైపోయిందని,జాతీయ నాయకత్వం అనేదే లేకుండా పార్టీని నడిపిస్తున్నారని విమర్శించారు. కార్యకర్తలకూ క్రమంగా విశ్వాసం సన్నగిల్లుతోందని స్పష్టం చేశారు. 2015 వరకూ కాంగ్రెస్‌లోనే హిమంత బిశ్వ శర్మ ఆ తరవాత బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయనకు పార్టీలో మంచి గౌరవమే దక్కుతోంది. అంతకు ముందు కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ... ఆ పార్టీపై విమర్శలు చేసే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు హిమంత శర్మ. 


"కాంగ్రెస్ కథ ముగిసిపోయింది. ఇక ఆ పార్టీ గురించి చరిత్రలో చదువుకోవాల్సిందే. ఆ పార్టీ ముక్కలైపోతుంది. స్థానిక పార్టీల్లో ఓ పార్టీగా మిగిలిపోతుంది. ఈ లోక్‌సభ ఎన్నికల తరవాత కాంగ్రెస్‌కి ఉన్న జాతీయ పార్టీ హోదా కోల్పోతుంది. NDA 400కి పైగా స్థానాల్లో కచ్చితంగా గెలిచి తీరుతుంది. బీజేపీకి మించిన మంచి ఆప్షన్‌ ప్రజలకు కనిపించడం లేదు. త్వరలోనే కాంగ్రెస్ కార్యకర్తలంతా విశ్వాసం కోల్పోతారు. ఇకపై ఆ పార్టీకి జాతీయ నాయకత్వం అనేదే కనిపించదు"


- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి


లోక్‌సభ ఎన్నికల్లో  Asom Gana Parishad (AGP)తో పాటు United People's Party Liberal (UPPL) తో కలిసి పోటీ చేయనున్నట్టు హిమంత ప్రకటించారు. మొత్తం 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో 11 చోట్ల బీజేపీ పోటీ చేస్తుందని, AGP రెండు చోట్ల, UPPL పార్టీ ఓ చోట బరిలోకి దిగుతుందని వెల్లడించారు. ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా గోస్వామి బీజేపీలో చేరడం సంచలనమైంది. మరో కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికే మద్దతునిచ్చారు. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నారు. 






అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) బాల్య వివాహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ బాల్య వివాహాలను జరగనివ్వనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌పైనా విరుచుకు పడ్డారు. Assam Muslim Marriages and Divorces Registration Act, 1935 ని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ సమయంలోనే AIUDFతో పాటు కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ బయటకు వెళ్లిపోయాయి. దీనిపై చర్చ జరగాలని పట్టుపట్టినా అందుకు స్పీకర్ అనుమతించలేదు. ఫలితంగా..ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.