MP Asaduddin house Attack :   ఢిల్లీలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై  కొందరు దుండగులు దాడి చేశారు. ఆగస్టు 13వ తేదీ సాయంత్రం  ఢిల్లీలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ -ఇత్తెహాదుల్ ముస్లిమీన్  చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అధికారిక బంగ్లాపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంటి తలుపుల అద్దాలను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో అసదుద్దీన్ ఓవైసీకి ఎలాంటి గాయాలు కాలేదు.పోలీసులకు అసదుద్దీన్ ఓవైసీ ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.                               

  


ఓవైసీ ఇంటి తలుపుల రెండు అద్దాలు పగలగొట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే పగిలిన అద్దాల చుట్టూ ఎలాంటి రాయి లేదా మరే వస్తువు కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో విచారణ జరుపుతున్నామని, విచారణ పూర్తయితే అసలు నిజాలు బయటకు వస్తాయని పోలీసులు  చెబుతున్నారు.  పోలీసులు ఆ ప్రాంతాన్ని తనిఖీ చేస్తున్నారని, దర్యాప్తు జరుగుతోందని అధికారి వెల్లడించారు.                                                              


ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఢిల్లీలో అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై దుండగులు దాడి చేశారు. 2014 తర్వాత తన ఇంటిపైదాడి చేయడం ఇది నాలుగోసారి అని అసదుద్దీన్ ఓవైసీ  ఆరోపించారు. ‘‘ కొన్నాళ్లుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. రాళ్లదాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశా. రాళ్ల దాడి గురించి నాకు భయం లేదు. ఎంపీ ఇంటిపైనే రాళ్లదాడి జరిగితే సామాన్యుడి సంగతేంటి? ఇలాంటి ఘటన బీజేపీ నేత ఇంటిపై జరిగితే పెద్ద గొడవ అయ్యేది. దేశానికి ఇలాంటి పరిస్థితి ఏమాత్రం మంచిది కాదు’’ అని ఓవైసీ మండిపడ్డారు.                                        


గత ఫిబ్రవరిలో రాజస్తాన్ లో ఎన్నికల ప్రచారంల ోఉన్న సమయంలో ఢిల్లీలోని ఇంటిపై దుండగులు రాళ్లు విసిరారు. అప్పటివరకు ఢిల్లీలో నాలుగుసార్లు దుండగులు ఇలాంటి దాడులకు పాల్పడ్డారు. అయితే, గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటిపై రాళ్లు విసిరారని అసదుద్దీన్ ఒవైసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  2022 ఫిబ్రవరిలో యూపీ ఎన్నికల సమయంలో యూపీలో ఎన్నికల ప్రచారం చేస్తున్న హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి. ఈ ఫైరింగ్‌లో ఆయనకెలాంటి ప్రమాదం జరగలేదు. ఒవైసీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ కారు మాత్రం పంక్చరైంది. ఇలా అసదుద్దీన్ పై వరుసగా దాడులు జరగడం సంచలనంగా మారింది.