Arvind Kejriwal Message From Jail: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్‌ జైల్ నుంచే పరిపాలిస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఎక్కడ ఉన్నా తన జీవితం దేశానికే అంకితం అని వెల్లడించారు. ఇప్పుడు ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్‌...కేజ్రీవాల్ ఇచ్చిన సందేశాన్ని చదివి వినిపించారు. జైల్‌లో అరవింద్ కేజ్రీవాల్‌ రాసిన లెటర్‌ని ఆమె చదివారు. ఆయన జీవితమంతా దేశానికి సేవ చేసేందుకే అంకితం చేశారని సునీత కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఎవరూ తనను ఇలా బంధించి ఉంచలేరని, త్వరలోనే ఆయన తిరిగి వచ్చేస్తారని వెల్లడించారు. కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతున్నందుకు ఆయన చాలా బాధ పడుతున్నారని చెప్పారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వీడియో విడుదల చేశారు. 


"నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఈ అరెస్ట్ నన్నేమీ ఆశ్చర్యపరచలేదు. నేను బయట ఉన్నా లోపల ఉన్నా నా జీవితం దేశానికే అంకితం. నా ప్రతి రక్తపు బొట్టూ దేశ సేవకే. నన్ను ఇలా బంధించి ఎంతో కాలం ఉంచలేరు. కచ్చితంగా త్వరలోనే బయటకు వచ్చేస్తాను. ఓ హామీ ఇచ్చి నెరవేర్చకుండా నేనెప్పుడూ లేను. కానీ అర్హులైన మహిళలకు నెలనెలా రూ.1000 ఇస్తామన్న హామీని ఈ అరెస్ట్ కారణంగా నెరవేర్చలేకపోతున్నాను. కొంత మంది కుట్ర చేసి మరీ భారత్‌ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. మనం అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. అలాంటి వాళ్లను గుర్తించి ఓడించాలి. నాపైన నమ్మకం ఉంచాలని ప్రతి మహిళనూ కోరుతున్నాను. త్వరలోనే బయటకు వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చుతాను"


- అరవింద్ కేజ్రీవాల్ (జైల్ నుంచి ఇచ్చిన సందేశం)




మహిళలంతా ఆలయాలకు వెళ్లి తాను త్వరగా విడుదలయ్యేలా భగవంతుడిని ప్రార్థించాలని కోరుకున్నారు అరవింద్ కేజ్రీవాల్. అంతకు ముందు సునీత కేజ్రీవాల్ మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాల్ని అణిచివేస్తున్నారంటూ మండి పడ్డారు. 


"మూడుసార్లు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తిని మోదీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఇది ఢిల్లీ ప్రజలకు వెన్నుపోటు లాంటిదే. మీ ముఖ్యమంత్రి ఎప్పుడూ మీకు అండగా నిలబడ్డారు. ప్రజలదే తుది తీర్పు. కేజ్రీవాల్ ఎలాంటి వ్యక్తో మీకు తెలుసు"


- సునీత కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ భార్య