APPSC Group 2 Jobs | అమరావతి: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మరొక శుభవార్త అందించింది. అక్టోబరు 13న గ్రూప్-2 విభాగంలో 686 పోస్టుల భర్తీకి ప్రాథమిక ప్రకటన విడుదల చేసిన కమిషన్, తాజాగా పోస్టుల సంఖ్యను 720కి పెంచింది. కొత్త నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ 2లో 34 పోస్టులు పెరిగాయి. ఈ మేరకు పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి డిసెంబరు 11 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
పోస్టుల వివరాలు, ప్రధాన ఉద్యోగాలు
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం భర్తీ చేయనున్న 720 పోస్టులలో 471 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 249 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ప్రాథమిక ప్రకటనతో పోలిస్తే డిప్యూటీ తహసీల్దారు (Deputy MRO) పోస్టులు మరికొన్ని పెరిగాయి. ప్రధానంగా డిప్యూటీ తహసీల్దారు-203, డిప్యూటీ ఎంపీడీఓ 176, ట్రెజరీ హెచ్‌ఓడీ విభాగంలో సీనియర్ ఎకౌంటెంట్ 90 పోస్టులు భర్తీ కానున్నాయి. వీటికి తోడు వివిధ శాఖల్లో 31 జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయని ఏపీపీఎస్సీ తాజా నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
స్క్రీనింగ్ పరీక్ష తేది, నిబంధనలు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించనున్నట్లు APPSC ప్రకటించింది. అభ్యర్థులు తదుపరి దశకు ఎంపిక కావాలంటే ఈ పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించాలి. అభ్యర్థులకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు వంటి ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 ప్రకారం 95% ఉద్యోగాలు స్థానిక కోటా కిందనే భర్తీ చేయనున్నారని తెలిసిందే. ఒకటో తరగతి నుంచి 7 తరగతి వరకు పూర్తి చేసిన స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగా అభ్యర్థుల స్థానికతను నిర్ధారిస్తారు.
