YS Sharmila Reddy Comments in Guntur: ఏపీలో ఉన్న అందరూ బీజేపీకి బానిసలే అని వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని.. అలాంటి మోసం చేసిన బీజేపీతో టీడీపీ, వైఎస్ఆర్ సీపీ, జనసేన పార్టీలు దోస్తీ కట్టాయని విమర్శించాయి. ముఖ్యంగా బీజేపీకి మూడు పార్టీలు బానిసలుగా మారాయని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ వైఎస్ఆర్ పాలన ఎక్కడా లేదని అన్నారు. వైఎస్ పాలన అంటే ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగాలు ఉండేవని అన్నారు. హామీలు ఇచ్చి మోసం చేయడం వైఎస్సార్ పాలన కాదని షర్మిల తేల్చి చెప్పారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి హాజరయ్యారు. 


‘‘జగనన్న జనవరి 1 న జాబ్ క్యాలెండర్ అన్నాడు. 5 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ లేదు, జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. గ్రూప్ 1 లేదు. గ్రూప్ 2 లేదు. అభివృద్ధి పూర్తిగా మరిచారు. ఇది గుంటూరు, కానీ గుంటలూరుగా మార్చారు. రోడ్లు వేసుకోవడానికి కనీసం నిధులు లేవు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా డబ్బులు లేవు. రైతులకు పంట నష్టపరిహారం లేదు...రైతును ఆదుకొనే వాళ్ళు లేవు. వ్యవసాయానికి ఉన్న సబ్సిడీ పథకాలు అన్ని బంద్ పెట్టారు. రైతుకు బరోసా లేకుండా పోయింది. YSR కొడుకు పాలన చేస్తున్నాడు.


కానీ వైఎస్సార్ కి జగన్ ఆన్నకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వైఎస్సార్ తన చివరి శ్వాస వరకు ప్రజల కోసమే బ్రతికాడు. ప్రజల కోసం వెళ్తూనే వెళ్ళిపోయారు. వైఎస్సార్ మరణం తర్వాత పాలకులు నియంతలా మారారు. చివరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు దిక్కు లేదు. వైఎస్సార్ ప్రజా దర్బార్ పెట్టే వాడు.. ఇప్పుడు జగన్ ఆన్న జనాలనే చూడడు. బీజేపీతో ఆయనకు ఉన్న పొత్తులు పైకి కనిపించవు. రెండు పార్టీలతో బీజేపీ పొత్తు ఎవరికి అర్థం కాదు. 


B - అంటే బాబు.. J అంటే జగన్.. P అంటే పవన్.. ముగ్గురు బీజేపీకి బానిసలు. బీజేపీ బిల్లు పెడితే ఒక్క మాట మాట్లాడకుండా ఓటు వేస్తారు. వైఎస్సార్ హయాంలో ముస్లీం లకు 4 శాతం రిజర్వేషన్ లు ఇవ్వాలని అనుకున్నారు. వైఎస్సార్ బ్రతికి ఉంటే 7 శాతం  రిజర్వేషన్లు పెరిగేవి. కేంద్రంలో బీజేపీ మతతత్వ పార్టీ. మణిపూర్ లో 2 వేల చర్చ్ లను ద్వంసం చేశారు. జగన్ ఆన్న ఒక క్రిస్టియన్...చర్చ్ లపై దాడులు చేస్తుంటే ..బీజేపీ పై ఒక్క మాట మాట్లాడలేదు. అందుకే రాష్ట్రంలో, దేశంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి. కాంగ్రెస్ కార్యకర్త ప్రతిఒక్కరూ సైనికుడు లా మారాలి. కాంగ్రెస్ కి ఓటేస్తే ప్రత్యేక హోదా వస్తుంది. కాంగ్రెస్ కి ఓటు వేస్తే పోలవరం పూర్తి అవుతుంది. కాంగ్రెస్ కి ఓటు వేస్తేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. గుంటలూరు గుంటూరు కావాలి అంటే కాంగ్రెస్ అధికారంలో రావాలి’’ అని వైఎస్ షర్మిల మాట్లాడారు.