Minister Jogi Ramesh: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరుపై మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ను పార్టీ కార్యకర్తలు నమ్మితే నట్టేట మునగడం ఖాయమని అన్నారు. ఆయనకు తెలిసిందల్లా టీడీపీ అధినేత చంద్రబాబుకు చెంచాగిరి చేయడమేనంటూ సెటైర్లు వేశారు. మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్, చంద్రబాబులపై ధ్వజమెత్తారు. పవన్ విజిటింగ్ వీసా మీద వచ్చి ఏదో వాగిపోయాడని అన్నారు. 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము జనసేనకు ఉందా అని ప్రశ్నించారు. జెండా, అజెండా, సిద్ధాంతం లేని వ్యక్తి పవన్ అని... ఆయనను నమ్మడం అంత పిచ్చి పని మరొకటి ఉండదని చెప్పుకొచ్చారు. నోటికి వచ్చినట్లు మాట్లాడడం రెచ్చగొట్టడమే పవన్ కు తెలుసు అని, హింసను ప్రేరేపించే వ్యక్తే పవన్ కల్యాణ్ అని పేర్కొన్నారు. 


చంద్రబాబు, లోకేష్ జైలుకు వెళ్లడం ఖాయం..!


టీడీపీ అధినేత చంద్రబాబు చేసే వ్యాఖ్యలు ప్రజలను కాటు వేసేలా ఉన్నాయని ఏపీ మంత్రి జోగి రమేష్ అన్నారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏం చేశారో చెప్పుకుంటూ ప్రజలను ఓట్లు అడగడం సహజమని... కానీ ఆయన అలాంటిదేమీ లేకుండా ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నాడని అన్నారు. అలాగే ఆయన మాట్లాడే మాటలన్నీ ప్రజల్ని కాటు వేసేలా ఉన్నాయని అన్నారు. ఆయన కావాలనే సినిమా స్టైల్ లో ప్రజల ముందు నాటకాలు వేస్తున్నారని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. 86 నియోజక వర్గాల్లో టీడీపీకి దిక్కేలేదని సొంత సర్వేలోనే తేలిందని విమర్శించారు. గతంలో ఏవైనా మంచి పనులు చేస్తే జనం గుర్తు పెట్టుకునే వారని.. కానీ మంచి పనులు చేయనుందునే ఆయనను గద్దె దింపారని తెలిపారు. ప్రస్తుతం టీడీపీ 23 సీట్లకు పరిమితం అయిందని అన్నారు. 


82 వేల మంది బీసీలను లీడర్లుగా మార్చిన ఘనత జగన్ దే.. 


పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కోసం ఎన్ని డ్రామాలు అయినా చేస్తాడని మంత్రి జోగి రమేష్ అన్నారు. బీసీల్లో 82 వేల మందిని జగన్ లీడర్లుగా తయారు చేశారని చెప్పారు. జయహో బీసీ, జయహో జగనన్న అనే నినాదం రాష్ట్రం అంతా మార్మోగుతుందని అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయ అజ్ఞాని, అక్కుపక్షి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకే ఇష్టానుసారంగా ట్వీట్లు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి వచ్చినప్పుడు భద్రతలో భాగంగా కొన్ని ఏర్పాట్లు చేస్తే దాని మీద కూడా విమర్శలు చేయటం లోకేష్ కే చెల్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచమైన సంస్కృతికి చంద్రబాబు, లోకేష్ అలవాటు పడ్డారంటూ ఫైర్ అయ్యారు. బీసీల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు అంటూ జోగి రమేష్ ధ్వజమెత్తారు. స్కిల్ డెవలప్మెంట్ అక్రమాల కేసులో చంద్రబాబు, లోకేష్ పాత్ర కూడా ఉందని వివరించారు. వారికి కూడా నోటీసులు ఇవ్వాలన్నారు. అందరి తప్పులూ బయటకు వస్తాయని.. వారిద్దరు కూడా జైలుకి పోవటం ఖాయం అని కామెంట్లు చేశారు.