Fact Check On Amaravati Cost: ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం, హెచ్ఓడీ భవనాల ఖర్చుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. చదరపు అడుగు నిర్మాణానికి ఏకంగా రూ.29,340 ఖర్చు చేస్తున్నారని జగన్‌ చేసిన విమర్శలపై కూటమి ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.17,339 మాత్రమే ఖర్చవుతోందని ఫ్యాక్ట్‌చెక్ ద్వారా వాస్తవాలను ప్రజల ముందుంచింది.

Continues below advertisement

వైఎస్ జగన్‌ ఆరోపణలు 

సీఎం చంద్రబాబును ఉద్దేశించి శనివారం ఎక్స్ వేదికగా మాజీ సీఎం జగన్‌ తీవ్ర విమర్శలు చేశారు. "మీ కలెక్షన్‌ రేటు, కరప్షన్‌ రేటు అదిరిందయ్యా" అంటూ పోస్ట్ పెట్టారు. అంచనాలను భారీగా పెంచేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. 2018లో కొత్త సచివాలయ నిర్మాణానికి వేసిన అంచనా వ్యయం రూ.2,271 కోట్లు మాత్రమేనని జగన్‌ గుర్తు చేశారు. ఇప్పుడు దాన్ని అమాంతం పెంచేసి 52.20 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలకు రూ.15,317 కోట్లు వెచ్చిస్తున్నారని విమర్శించారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో నగరాల్లో ఫైవ్‌స్టార్ సదుపాయాలతో నిర్మించే భవనాలకు కూడా చదరపు అడుగుకు రూ.5 వేలు మించడం లేదని, కానీ ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసే భవనాలకు ఇంత భారీగా ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు.

ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ కౌంటర్ 

వైఎస్ జగన్‌ చేసిన విమర్శలపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత మీడియా ద్వారా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతూ పూర్తి వివరాలను ప్రకటించింది.  అమరావతిలో ఐదు ఐకానిక్ టవర్లను మొత్తం 71.43 లక్షల చదరపు అడుగులలో నిర్మిస్తుంటే, వైఎస్ జగన్‌ ఆ విస్తీర్ణాన్ని కేవలం 52.20 లక్షల చదరపు అడుగులుగా తక్కువ చేసి చూపిస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. విస్తీర్ణాన్ని తగ్గించి, ఎస్‌ఎఫ్‌టీ ధరను పెంచి చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది.

Continues below advertisement

వాస్తవ విస్తీర్ణం ప్రకారం లెక్కగడితే అమరావతి భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.17,339 ఖర్చు మాత్రమే అని స్పష్టం చేసింది. జాతీయ, ప్రాంతీయ ప్రాజెక్టులతో పోల్చి చూసినా ఈ వ్యయం అత్యంత తక్కువని తెలిపింది. ఉదాహరణకు, నాలుగు అంతస్తులతో నిర్మించిన కొత్త పార్లమెంటు భవనానికి చదరపు అడుగుకు రూ.16,916 ఖర్చయిందని ప్రభుత్వం గుర్తు చేసింది. Also Read: ఎన్నికల సిబ్బందికి అవమానం.. టిఫిన్ అడిగితే బంగారు గాజులు అమ్ముకోండంటూ ఎంపీడీవో వెటకారం

రుషికొండ ప్యాలెస్‌ ఖర్చు 

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేసి నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌లోకి ప్రజలను  అనుమతించాలని ఇటీవల కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే వైఎస్ జగన్‌ అమరావతిపై తప్పుడు ప్రచారానికి తెరలేపారని ప్రభుత్వం విమర్శించింది. రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణానికి జగన్‌ చదరపు అడుగుకు రూ.30 వేలకు పైగా ఖర్చు చేశారని తెలిపింది. పైగా పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి రూ.200 కోట్ల జరిమానా చెల్లించి రాష్ట్ర ఖజానాకు భారీ చిల్లు పెట్టారని ప్రభుత్వం విమర్శించింది. మూడు నెలలకోసారి అమరావతి నిర్మాణ వ్యయంపై వైఎస్ జగన్‌ ఇలాగే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.  

Also Read: రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి 'మనమిత్ర'కు పంపండి.. వెంటనే మరమ్మతులు- ఏపీ ప్రభుత్వం