AP CM Chandrababu Naidu Will Visit Sri City : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో సోమవారం పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు పరిశ్రమలను ఆయన ప్రారంభించనున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించి ముందుకు వెళుతున్నారు. ఒకవైపు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు విషయంలో కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన పరిశ్రమలు పురోగతి, పారిశ్రామికవేత్తలకు అందించాల్సిన సహాయ, సహకారాలు వంటి అంశాలపైనా దృష్టి సారించారు.


సోమవారం శ్రీ సిటీలో పర్యటించనున్న చంద్రబాబు నాయుడు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం 15 సంస్థల కార్యకలాపాలను ప్రారంభించడంతోపాటు మరో ఏడు సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. శ్రీ సిటీలో రూ.900 కోట్ల పెట్టుబడితో 2,740 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరో రూ.1213 కోట్లు పెట్టుబడలకు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. శ్రీసిటీ బిజినెస్‌ సెంటర్‌లో వివిధ కంపెనీలతో సీఈవోలతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. 


ఈ కంపెనీలు ప్రారంభం


శ్రీసిటీలో సీఎం చంద్రబాబు నాయుడు దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీకేమ్‌, ఇజ్రాయెల్‌కు చెందిన నియోలింక్‌, జపాన్‌కు చెంది నైడిక్‌, ఓజేఐ ఇండియా ప్యాకేజ్‌, జర్మనీకి చెందిన బెల్‌ పరిశ్రమలతోపాటు భారత్‌కు చెందిన అడ్మైర్‌, ఆటోడేటా, బాంబేకోటెడ్‌ స్పెషల్‌ స్టీల్స్‌, ఈప్యాక్‌, ఐఎస్‌ఎస్‌కేఏవై, ఎవర్‌ షైన్‌, జేజీఐ, త్రినాథ్‌, జెన్‌లెనిన్‌ను ప్రారంభించనున్నారు. చైనాకు చెందిన ఎన్‌జీసీ, బెల్జియంకు చెందిన వెర్మేరియన్‌, జపాన్‌ చెందిన ఏజీ అండ్‌ పీ పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్నారు. జపాన్‌కు చెందిన రెండు పరిశ్రమలు, యూఏఈ, సింగపూర్‌తోపాటు ఇండియాకు చెందిన ఒక్కో పరిశ్రమ ఏర్పాటుపై ఒప్పందాలు చేసుకోనున్నారు.