MK Meena: ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనాను కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీకి పిలిచింది. సీఈసీ పిలుపుతో ఆయన ఈరోజు ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలో భారీగా ఓట్లు గల్లంతు అయ్యాయని విపక్షాలు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయనను సీఈసీ ఢిల్లీకి పిలిచినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు, స్థానిక యంత్రాంగం ఇష్టారీతిన ఓట్లు రేచ్చడం, తొలగించడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి పలు పార్టీల నేతలు, స్వచ్చంధ సంస్థలు పిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు, పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల సీఈసీ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ముఖేశ్ కుమార్ మీనాను ఢిల్లీకి పిలవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వచ్చేటప్పుడు ఏపీ ఓటర్ల జాబితాతో పాటు ముఖ్యమైన ఫైళ్లను కూడా వెంట తీసుకు రావాలని కూడా చెప్పినట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరగనుందో.
'20 లక్షల దొంగ ఓట్లు గుర్తించాం'
ఓటరు ధ్రువీకరణ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో భారీగా దొంగ ఓట్లు గుర్తించినట్లు ఇటీవలే చంద్రబాబు తెలిపారు. ఇప్పటి వరకు 20 లక్షలకు పైగా ఫేక్ ఓట్లను గుర్తించామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇలాంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారిని కోరుతూ.. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను అందిజేశామని చంద్రబాబుకు నేతలు వివరించారు. చనిపోయిన వారి ఓట్లు తొలగించకపోవడం, దొంగ ఓట్లు నమోదు చేయించడం, టీడీపీ అనుకూలం అని భావించే వారి ఓట్లను తీసేయడం, ఒక బూత్ లోని ఓట్లను మరో బూత్ లోకి మార్చడం వంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని కోరినట్లు టీడీపీ నాయకులు చంద్రబాబుకు వివరించారు. వైసీపీ దొంగ ఓట్ల అక్రమాలకు పాల్పడటమే కాకుడా.. ఆ నిందను టీడీపీపై వేస్తోందని.. ఈ చర్యను పూర్తి స్థాయిలో అడ్డుకోవాలని చంద్రబాబు నేతలకు సూచించారు. పార్టీ కార్యక్రమాల్లో ఓటర్ వెరిఫికేషన్ ను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పారు. అలా వైసీపీ అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని అన్నారు. అర్హులు కాని వారికి ఓట్ల విషయంలో ఉద్దేశపూర్వకంగానే తప్పులు చేసే అధికారులు ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని చంద్రబాబు నేతలతో సమీక్ష సందర్భంగా హెచ్చరించారు.
ఒకే ఇంటి నంబర్ తో పదుల సంఖ్యలో ఓట్లు..
ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలకు తెరలేపుతున్నట్లు గుర్తించామని టీడీపీ నేత దామచర్ల జనార్దన్ ఆరోపించారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే ఇంటి నంబర్ తో పదుల సంఖ్యలో ఓట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇలా దొంగ ఓట్లు నమోదు చేసేందుకు కొంత మంది అధికారులు వైసీపీ పార్టీకి సహకరిస్తున్నారని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అన్నా క్యాంటీన్ల గురించి కూడా చంద్రబాబు మాట్లాడారు. రేపటి రోజుల్లో సీఎం జగన్ పదవి పోతే మనమే అన్నా క్యాంటీన్ ద్వారా ఇంత కూడు పెడదాం అంటూ కామెంట్లు చేశారు.