AP Cabinet Meeting: ఈనెల 29వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ కాబోతోంది. మరోవైపు వచ్చే నెల ఒకటో తేదీన ఉద్యోగ సంఘాలు భారీ ఆందోళనకు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలోనే కాంట్రాక్ట్ ఉద్యోగుల శ్రమ దోపిడీ వ్యవహరంపై ఏదో ఒకటి తేల్చాలని ఏపీ జేఏసీ అమరావతి డిమాండ్ చేస్తోంది. అయితే 29న జరగబోయే కేబినెట్ సమావేశంలోనైనా దీని గురించి చర్చించి.. కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్దీకరించాలని అమరావతి జేఏసీ నాయకులు బొప్పరాజు, వైవీరావు డిమాండ్ చేశారు. చట్టబద్దంగా నోటిఫికేషన్ ద్వారా, రోస్టర్ విధానంలో రాత పరీక్షలో నెగ్గిన సుమారు 30 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతున్నారు. గత 20 సంవత్సరాలుగా చాలీ చాలని జీతాలతో.. ఎలాంటి ఇతర సౌకర్యాలు పొందకుండా పని చేస్తున్నారని తెలిపారు.
నాడు హామీ ఇచ్చి నేడు మర్చిపోయారు..
అయితే గతంలో సీఎం జగన్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్దీకరిస్తాననీ హామీ ఇచ్చినప్పటికీ.. నేటికీ అమలు చేయకపోవడం సరికాది విమర్శించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి ఈ ప్రభుత్వం రాగానే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీని నియమించింది. సదరు మంత్రుల కమిటీనీ... ఏపీ జేఏసీ అమరావతి పక్షాన అనేక సార్లు కలిసినా ఎలాంటి లాభం లేకుండా పోయిందని జేఏసీ నాయకలు తెలిపారు. 2019 నవంబర్ 26వ తేదీన ఐఏఎస్ ఆఫీసర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన "వర్కింగ్ కమిటీని" ఏర్పాటు చేసిన నేటికి మూడేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరం అన్నారు. గత 20 ఏళ్లుగా పని చేస్తున్నా.. ప్రతీ ఏడు కాంట్రాక్ట్ రెన్యూవల్ చేయించుకోవల్సి రావడం దారుణం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్సీ, టీఏ, డీఏలు లాంటి ఎలాంటి ఆర్ధిక ప్రయోజనాలు వర్తించట్లేదని తెలిపారు.
ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించారు కానీ..
2020, 2021 సంవత్సరాలలో కరోనా తీవ్ర రూపం దాల్చినప్పుడు, ప్రైవేట్ ఆసుపత్రులన్ని మూసివేసినప్పటికి.. వైద్యశాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రం విధులు నిర్వహించారని తెలిపారు. వారి ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడిన విషయం భారతదేశం అంతా గుర్తించి.. వారిని భారత, రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా కొనియాడిన సంగతి అందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు. ఇటీవల ప్రధానంగా 11వ పీఆర్సీ విషయంలో ఉద్యోగ సంఘాలతో జరిగిన నిర్వహించిన చర్చల్లో (2022 జనవరి 16వ తేదీన) ముఖ్యమంత్రే స్వయంగా మాట ఇచ్చారని తెలిపారు. ఉద్యోగ సంఘాలతో టైం బౌండ్ పెట్టుకుని కాంట్రాక్ట్ ఉద్యోగులను అతి త్వరలో క్రమబద్ధీకరిస్థాననీ చెప్పిన విషయాన్ని మరోసారి సీఎం జగన్ కు ఏపీ జేఏసీ అమరావతి పక్షాన గుర్తు చేశారు.
ఇప్పటికైనా క్రమబద్ధీకరించండి..!
రెగ్యులర్ ఉద్యోగుల తరహాలోనే నియామకాలు పొందినప్పటికీ.. కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగులు అనే పేరు మీద నియామకాలు పొందడ వల్ల గత 20 సంవత్సరాలుగా ఎలాంటి కనీస ఆర్ధిక ప్రయోజనాలు కూడా పొందలేకపోతున్నారని జేఏసీ నాయకులు తెలిపారు. ఈ నెల 29వ తేదీన జరుగబోయే కేబినెట్ సమావేశంలోనైనా కాంట్రాక్టు ఉద్యోగుల గురించి చర్చించి.. వేయి కళ్లతో ఎదురు చూస్తున్న అర్హులైన వారందరినీ క్రమబద్దీకరించాలని కోరారు. గతంలో, పీఆర్సీ చర్చల సందర్భంగా సీఎం జగన్ ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి సర్కార్ కు అల్టిమేటం జారీ చేసింది.