Tahawwur Rana Extradition NIA: ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారుల్లో ఒకడు అయిన టెర్రరిస్టు తహవ్వూర్ రాణాను తీసుకు వచ్చిన తర్వాత ఎన్ఐఏ కీలక ప్రకటన చేసింది. 2008 ముంబై ఉగ్రవాద దాడుల బాధితులకు న్యాయం అందించే దిశగా ఒక ముఖ్యమైన మైలురాయిగా ఏజెన్సీ పేర్కొంది. తహవూర్ రాణాను తీసుకు రావడానికి జరిగిన ప్రయత్నాలు నిరంతరం జరిగాయని తెలిపారు. భారత-అమెరికా అప్పగింత ఒప్పందం ప్రకారం ప్రారంభించిన చర్యల ప్రకారం రాణాను అమెరికాలో జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారని.. రాణా ఈ చర్యను ఆపడానికి అన్ని చట్టపరమైన మార్గాలను వినియోగించుకున్నారని NIA తెలిపింది. అమెరికా సుప్రీంకోర్టులో కూడా ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత భారత్ కు అప్పగించారని తెలిపారు.
అమెరికాలో ఉగ్రవాది తహవూర్ రాణా తొమ్మిదవ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో అనేక వ్యాజ్యాలు దాఖలు చేశాడు. అన్నింటినీ తిరస్కరించారు. తరువాత అమెరికా సుప్రీంకోర్టులో రిట్ ఆఫ్ సర్టియోరారీ పిటిషన్, రెండు హెబియస్ పిటిషన్లు, అత్యవసర దరఖాస్తును దాఖలు చేశాడు, వాటిని కూడా తిరస్కరించారని NIA తెలిపింది. అమెరికా DoJ, US స్కై మార్షల్ సాయంతో NIA మొత్తం అప్పగింత ప్రక్రియ పూర్తి చేసింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ,యు హోం మంత్రిత్వ శాఖ అమెరికాలోని ఇతర సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని విజయవంతంగా ఉగ్రవాది రాణాను తీసుకు వచ్చేందుకు కృషి చేశాయని ఎన్‌ఐఏ తెలిపింది.
2008లో ముంబైలో విధ్వంసకర ఉగ్రవాద దాడులను నిర్వహించడానికి తహవూర్ హుస్సేన్ రాణా డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీ , ఉగ్రవాద గ్రూపుల కార్యకర్తలతో కలిసి లష్కరే తోయిబా , హర్కత్-ఉల్-జిహాదీ ఇస్లామి (HUJI) పాకిస్తాన్‌కు చెందిన ఇతర సహ-కుట్రదారులతో కలిసి కుట్ర పన్నాడని ఎన్‌ఐఏ తెలిపింది. ముంబై ఉగ్ర ఈ కుట్రలో రాణా కీలక పాత్ర పోషించినట్లు NIA స్పష్టం చేసింది. 2011లో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ ప్రకారం, రానా పాకిస్తాన్‌లోని లష్కర్-ఎ-తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాద సంస్థ ద్వారా జరిగిన ఈ దాడులను ప్రణాళికలను సిద్ధం చేయడంలో చురుకుగా పాల్గొన్నాడు. రానా తన సహ నిందితుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీకి తన ఇమ్మిగ్రేషన్ సంస్థ "ఫస్ట్ వరల్డ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్" ద్వారా ముంబై శాఖను 2006లో స్థాపింపచేశాడు. ఇది హెడ్లీకి ముంబైలోని లక్ష్యాలైన తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, నారిమన్ హౌస్ వంటి ప్రదేశాలను గుర్తించేందుకు ఉపయోగపడింది. వీటిపై ఎల్ఈటీ ఉగ్రవాదులు దాడి చేశారు. ముంబై ఉగ్ర దాడుల్లో 166 మంది మరణించారు. 300 మందికిపైగా గాయపడ్డారు. రానాను ఇప్పుడు ఎన్ఐఏ ప్రశ్నించనుంది. ముంబై దాడుల కుట్రలను పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ)తో సంబంధాలతో సహా ఈ కుట్ర గురించి మరిన్ని వివరాలను వెలికితీసే అవకాశం ఉంది. అమెరికా నుంచి ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరిన వెంటనే ఎన్ఐఏ అధికారికంగా అరెస్టు చేసింది. తీహార్ జైలులోని అత్యంత భద్రత కలిగిన వార్డులో ఉంచనున్నారు