Another police officer commits suicide in Haryana: హర్యానా పోలీస్ విభాగంలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సైబర్ క్రైమ్ విభాగంలో ASIగా పని చేస్తున్న సందీప్ లాథర్ అలియాస్ సందీప్ కుమార్ తన సర్వీస్ రివాల్వర్‌తో పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల సూసైడ్ చేసుకున్న సీనియర్ IPS అధికారి వై. పూరన్ కుమార్ (ADGP)పై అవినీతి ఆరోపణలు చేసిన సందీప్ మరణం పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సంచలనం సృష్టించింది. సూసైడ్ నోట్, వీడియోలో పూరన్ కుమార్‌ను 'కరప్ట్ అధికారి' అని ఆరోపించిన సందీప్, తన మరణానికి అతని కుటుంబం బాధ్యత వహించాలని పేర్కొన్నాడు. ఈ కేసులో అవినీతి, కాస్ట్-బేస్డ్ హరాస్‌మెంట్, రాజకీయ ఒత్తిళ్లు వంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోహ్ తక్ జిల్లాలోని పోలీస్ లైన్స్‌లో మంగళవారం ఉదయం సందీప్ లాథర్ తన సర్వీస్ రివాల్వర్‌తో తనను తాను కాల్చుకున్నాడు. స్పాట్‌లోనే మరణించిన అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. సందీప్ చివరి వీడియోను సహచరులకు పంపాడు. "నేను న్యాయం కోసం నా ప్రాణాలు త్యాగం చేస్తున్నాను. పూరన్ కుమార్ కరప్ట్ అధికారి, తన కులాన్ని ఉపయోగించి అవినీతి చేశాడు. అతని కుటుంబాన్ని వదలకూడదు" అని వీడియోలో పేర్కొన్నారు. సూసైడ్ నోట్‌లో కూడా ఇదే ఆరోపణలు ఉన్నాయి. సందీప్ సైబర్ క్రైమ్ విభాగంలో పని చేస్తూ, పూరన్ కుమార్ సూసైడ్ కేసులో అవినీతి ఆరోపణలను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు.
సందీప్ మరణం పూరన్ కుమార్ కేసుకు లింక్ అవడంతో పోలీస్ డిపార్ట్‌మెంట్ లో కలకలం రేగుతోంది. పూరన్ కుమార్ అక్టోబర్ 9, 2025 సూసైడ్ చేసుకున్నాడు, అతని సూసైడ్ నోట్‌లో 16 మంది సీనియర్ అధికారులపై వేధింపులు, కుల వివక్ష ఆరోపణలు చేశారు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న టీమ్‌లో సందీప్ లాథర్ ఉన్నాడు. సందీప్ తన వీడియోలో పూరన్ కుమార్‌ను కరప్ట్ అని, అతని సూసైడ్ అవినీతి బయటపడకుండా చేసుకున్నదని ఆరోపించాడు.
సందీప్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూరన్ కుమార్ సూసైడ్ కేసులో కీలక ఇన్వెస్టిగేటర్‌గా ఉన్న సందీప్ మరణం యాదృచ్ఛికమా? అవినీతి రాకెట్ బయటపడకుండా చంపేశారా? కాస్ట్ పాలిటిక్స్ ఉందా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. హర్యానా పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ మరణాన్ని సూసైడ్‌గా ప్రకటించింది. పూరన్ కుమార్ కుటుంబం సందీప్ ఆరోపణలను తోసిపుచ్చింది.