Andhra Pradesh and Telangana Weather Updates: తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారిపోతున్నాయి. సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయనే సామెత నిజం అవుతోంది. చాలా ప్రాంతాల్లో రోళ్లు, రాళ్లు పలిగే ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తోంది. జనం విలవిలలాడిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వేసవి మొదలు కాక ముందు నుంచే ఎండు ఠారెత్తించాయి. గతానికి కంటే భిన్నంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు అవి మరింత తీవ్ర స్థాయికి వెళ్లాయి. దీంతో అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. 

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగురాళ్లలో ప్రళయం 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో ఎండలు అసాధారణంగా పెరిగాయి. బుధవారం నాటి గణాంకాల ప్రకారం పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో అత్యధికంగా 47. 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఈ వేసవిలో నమోదు అయిన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. ఒక్క పల్నాడు జిల్లా మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. 28 జిల్లాలకు గాను, 23 జిల్లాల్లో ఎండలు మండిపోయాయి. 233 మండలాల్లో 41 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 11 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటగా, 204 మండలాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు రిజిస్టర్ అయ్యాయి.  

పిడుగురాళ్ల తర్వాత నెల్లూరు జిల్లా గూడూరులో 44.9 డిగ్రీలు, కృష్ణా జిల్లా కంకిపాడులో 44.5 డిగ్రీలు, ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, మార్కాపురం జిల్లాల్లోని పెదచెర్లోపల్లిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 

Continues below advertisement

తెలంగాణలో అదిరిపోతున్న ఎండలు 

తెలంగాణలో కూడా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బుధవారం నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌్లో 46.5 డగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యింది. గత  పదేళ్ల రికార్డులను తుడిచి కొత్త రికార్డును నమోదు చేసింది. ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హనుమకొండలో 46.4, కరీంనగర్ జిల్లా చొప్పదండిలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 40.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

వడగాలులకు పోతున్న ప్రాణాలు 

తీవ్రమైన ఎండల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ బుధవారం ఒక్క రోజే వడదెబ్బకు పది మందికిపైగా మృతి చెందారు. మరణించిన వారిలో రైతులు, ఉపాధి కూలీలు, మున్సిపల్‌ కార్మికులు, దివ్యాంగులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు, కరీంనగర్‌, సూర్యాపేట, ములుగు, మహబూబాబాద్‌, జనగామ, రాజన్న సిరిసిల్ల ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. 

ఆంధ్రప్రదేశ్‌లో కూడా వడ దెబ్బ కారణంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో గీత కార్మికుడు చనిపోయాడు. కృష్ణా జిల్లా వణుకూరుకు చెందిన కౌలు రైతు చనిపోయాడు. మార్చి 1 నుంచి మే 19 వరకు 325 మంది వడదెబ్బకు ఏపీలో మృత్యువాత పడ్డారు. 

ప్రస్తుతం వాయవ్య భారతం నుంచి వేడిగాలులు కోస్తాంధ్ర, రాయలసీమవైపు వీస్తున్నాయి. దీనికి తోడు కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షి కోస్తాంధ్ర వరకు ఒక ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉండటంతో ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణం. సాధారణం కంటే 4.5 నుంచి 6.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి.