Kerala Elections Amit Shah Tour: కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా ఎర్నాకుళంలో జరిగిన భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. కేరళలో దశాబ్దాలుగా మారుతూ వస్తున్న ఎల్‌డీఎఫ్ (LDF), యూడీఎఫ్ (UDF) పాలనలకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని అమిత్ షా పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు కేరళ వెలుపల దోస్తీ చేస్తూ, రాష్ట్రంలో మాత్రం ప్రజలను మభ్యపెట్టడానికి కుస్తీ పడుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ రెండు కూటములు క్రమంగా క్షిణీస్తున్నాయని, కేరళ అభివృద్ధి కేవలం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయేతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
కేరళలోని సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తూ, శబరిమల అయ్యప్ప దేవాలయం విషయంలో కమ్యూనిస్టు ప్రభుత్వం అనుసరించిన తీరును అమిత్ షా తీవ్రంగా తప్పుబట్టారు. దేవాలయంలో జరిగిన బంగారు ఆభరణాల చోరీ వ్యవహారంలో నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని, భక్తుల మనోభావాలను ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం భక్తుల పక్షాన ఉంటుందని, దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు. అలాగే కేంద్ర పథకాలకు పేర్లు మార్చి తమవిగా ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీరును ఆయన ఎండగట్టారు.
ఈ సభలో అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత , జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. అమిత్ షాకు ఘనస్వాగతం పలికిన విష్ణువర్ధన్ రెడ్డి, హోంమంత్రితో వేదిక పంచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. కేరళలోని స్థానిక రాజకీయ పరిస్థితులు, ఎన్నికల ప్రచార సరళిపై అమిత్ షా ఆయనతో ప్రత్యేకంగా చర్చించారు. రాబోయే నాలుగు రోజులు ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని, ఇంటింటికీ వెళ్లి మోదీ ప్రభుత్వ విజయాలను వివరించాలని అమిత్ షా దిశానిర్దేశం చేసినట్లు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
ఈ బహిరంగ సభ ఎర్నాకుళం , పరిసర నియోజకవర్గాల్లో బీజే పీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా క్రైస్తవ, హిందూ ఓటర్లను ఆకట్టుకునేలా అమిత్ షా చేసిన ప్రసంగం వ్యూహాత్మకంగా ఉందని భావిస్తున్నారు. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ పాలనల వల్ల కేరళ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందని అమిత్ షా చేసిన వ్యాఖ్యానాలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ కింగ్ మేకర్ గా అవతరిస్తుందని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
