Ambati Rambabu Sankranthi Celebrations: ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు తన నియోజకవర్గం సత్తెనపల్లిలోనే సొంత పార్టీ నుంచే సహాయ నిరాకరణ ఎదుర్కొంటున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన భోగి  సందర్భంగా సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకలపై సొంత పార్టీ నేతలే తమ అసహనాన్ని వెళ్లగక్కారు. గతేడాది కూడా అంబటి రాంబాబు సంక్రాంతికి వేడుకలు జరిపి.. వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆయన వేసిన డాన్సులు విపరీతంగా వైరల్ అయ్యాయి. అలా ‘సంబరాల రాంబాబు’ అంటూ ప్రాచుర్యం పొందారు. ఏకంగా పవన్ కల్యాణ్ ‘బ్రో’ సినిమాలో కూడా అంబటి రాంబాబుకు చెందిన స్పూఫ్ పెట్టారు. 


ఆ ఎఫెక్ట్ తో ఈసారి మరింత భారీగా అంబటి రాంబాబు సంక్రాంతి వేడుకలు నిర్వహించి.. వివిధ పాటలకు బంజారా మహిళలతో కలిసి డాన్సులు చేశారు. తనను తాను సంబరాల రాంబాబు అంటూ పిలిపించుకున్నారు. ఈ వేడుకలపైనే సత్తెనపల్లిలో ఓ వైసీపీ నేత నిరసన వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు గెలుపు కోసం తాను 2019 ఎన్నికలకు ముందు భారీగా ఖర్చు చేశామని.. పార్టీ కోసం రూ.లక్షలు ఖర్చు చేసిన తమను అంబటి రాంబాబు మానసికంగా వేధిస్తున్నారని అన్నారు. అంబటి రాంబాబుకు ఇవే చివరి సంక్రాంతి సంబరాలు అంటూ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పెదమక్కెన వైసీపీ నాయకురాలు యాంపాటి విజయకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


భోగి వేడుకల సందర్భంగా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు డాన్సులతో సందడి చేయడంపై ఆమె స్పందించారు. దీన్ని ఉద్దేశించి సొంత పార్టీ నాయకురాలే అంబటి రాంబాబును తీవ్రస్థాయిలో విమర్శించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం రూ.40 లక్షల వరకు తాము ఖర్చు పెట్టామని గుర్తు చేశారు. ఈ విషయంపై అంబటి రాంబాబును ప్రశ్నిస్తే.. మీరు జగన్‌ కోసం ఖర్చు పెట్టుకున్నారు.. నా కోసం ఖర్చు పెట్టలేదు కదా అంటూ తమను తక్కువ చేసి అంబటి రాంబాబు మాట్లాడారని ఆమె ఆవేదన చెందారు.