Al Qaeda terror module busted in Gujarat: గుజరాత్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AQIS)తో సంబంధాలు ఉన్న నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసింది. ఈ ఉగ్రవాదులు నకిలీ కరెన్సీ రాకెట్ నడుపుతూ, అల్-ఖైదా ఉగ్రవాద భావజాలాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేస్తున్నట్లుగా గుర్తించారు. ఢిల్లీకి చెందిన మొహమ్మద్ ఫైక్ , అహ్మదాబాద్ కు చెందిన మొహమ్మద్ ఫర్దీన్, గుజరాత్ లోని అరవల్లి ప్రాంతానికి చెందిన సైఫుల్లా కురే, నోయిడాకు చెందిన జీషాన్ అలీలుగా ఈ నలుగుర్ని గుర్తించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అల్-ఖైదా భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, నకిలీ కరెన్సీ కార్యకలాపాలలో పాల్గొన్నారని ATS తెలిపింది.
గుజరాత్ ATS ఈ ఉగ్రవాదులను నిఘా ద్వారా గుర్తించింది, వారు రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలను చర్చిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు ఆటో-డిలీట్ యాప్‌లను ఉపయోగించి తమ కమ్యూనికేషన్ జాడలను తొలగించే ప్రయత్నం చేశారు, దీని వల్ల వారి కార్యకలాపాలను ట్రాక్ చేయడం కష్టమైంది. అయినప్పటికీ అత్యాధునిక టెక్నాలజీతో నిఘా పెట్టి అరెస్టు చేశారు. అరెస్టు అయిన ఉగ్రవాదులు అల్-ఖైదా భావజాలాన్ని వ్యాప్తి చేయడంతో పాటు, భారతదేశంలో ఒక పెద్ద ఉగ్రవాద దాడికి సన్నాహాలు చేస్తున్నట్లు ATS అధికారులు తెలిపారు. వారు సోషల్ మీడియా ద్వారా వ్యక్తులను గ్రూపులలో చేర్చడం, ఆయుధాలు , మందుగుండు సామగ్రిని సేకరించడం వంటి కార్యకలాపాలలో నిమగ్నమయయారు.
వీరు కొన్ని సున్నితమైన లొకేషన్‌లను టార్గెట్ చేయడానికి ఇతర దేశాల్లోని ఉగ్రవాదుల నుంచి సూచనలు పొందినట్లు దర్యాప్తులో తేలింది. - ATS వారి సోషల్ మీడియా హ్యాండిల్స్, చాట్‌లు, ఇతర డిజిటల్ కమ్యూనికేషన్‌లను విశ్లేషిస్తోంది. పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్ోతంది. గుజరాత్ ATS డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సునీల్ జోషి ఈ అరెస్టులను ధృవీకరించారు.
ఈ కేసులో అన్‌లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్ (UAPA) , భారతీయ న్యాయ సంహిత (BNS) కింద సంబంధిత సెక్షన్‌లతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితులను ప్రస్తుతం విచారణలో ఉంచారు. వారి నెట్‌వర్క్‌ను ఛేదించడానికి దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్ ATS గతంలో కూడా AQISతో సంబంధం ఉన్న ఉగ్రవాదులను అరెస్టు చేసిన చరిత్ర ఉంది. 2023లో, నలుగురు బంగ్లాదేశ్ పౌరులను ఇదే ఉగ్రవాద సంస్థతో సంబంధాల కారణంగా అరెస్టు చేసింది.