Nationalist Congress Party future:  మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన అజిత్ పవార్ అకాల మరణం తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) భవిష్యత్తు ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. అజిత్ పవార్ మరణం కేవలం ఒక వ్యక్తిగత నష్టం మాత్రమే కాదు, ఆయన నేతృత్వంలోని   ఎన్సీపీ ఉనికికే సవాలుగా మారింది.   నాయకత్వ శూన్యత , అజిత్ పవార్ వారసులు 

Continues below advertisement

అజిత్ పవార్ తన బలమైన పరిపాలనా దక్షతతో దాదాగా పార్టీపై పట్టు సాధించారు. ఆయన మరణం తర్వాత ఆయన కుమారులు పార్థ్ పవార్, జయ్ పవార్  ఆ స్థానాన్ని భర్తీ చేయగలరా అనేది ఇప్పుడు ప్రధాన చర్చ. పార్థ్ పవార్ గతంలో లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైనందున, ఆయనకు అజిత్ పవార్ స్థాయిలో మాస్ ఇమేజ్,  పార్టీని నడిపించే వ్యూహ చతురత ఉందా అనే సందేహాలు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి. అజిత్ పవార్ భార్య, రాజ్యసభ ఎంపీ సునేత్రా పవార్ ప్రస్తుతం కుటుంబానికి అండగా ఉన్నప్పటికీ, రాజకీయాల్లో ఆమె పాత్ర ఎంతవరకు ఉంటుందనేది వేచి చూడాలి.

విలీనం దిశగా అడుగులు? 

Continues below advertisement

అజిత్ పవార్ మరణానికి కొద్దిరోజుల ముందే, స్థానిక సంస్థల ఎన్నికల కోసం శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (శరద్ పవార్) , అజిత్ పవార్ ఎన్సీపీ చేతులు కలిపినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా పుణె, పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ ఎన్నికల కోసం ఇరు వర్గాలు పవార్ పరివార్ ఒక్కటేనని చాటాయి. ఇప్పుడు అజిత్ పవార్ లేకపోవడంతో, ఆయన వర్గంలోని ఎమ్మెల్యేలు, కీలక నాయకులు మళ్ళీ  శరద్ పవార్‌ ఛత్రం కిందకు వెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సుమారు 40 మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్‌తో వెళ్ళింది ఆయన వ్యక్తిగత ఇమేజ్ చూసే తప్ప బీజేపీతో పొత్తు కోసం కాదు. కాబట్టి, ఇప్పుడు ఆ నాయకులందరూ మళ్ళీ మాతృ సంస్థలో విలీనం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు. 

సుప్రియా సూలే నాయకత్వం  

శరద్ పవార్ వారసురాలిగా  సుప్రియా సూలే ఇప్పటికే జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందారు. అజిత్ పవార్ మరణంతో పార్టీ బాధ్యతలు పూర్తిగా ఆమె భుజస్కంధాలపై పడే అవకాశం ఉంది. అజిత్ పవార్ తరహాలో రాష్ట్ర రాజకీయాల్లో దూకుడుగా వెళ్లడం, పార్టీ క్యాడర్‌ను కలుపుకుని పోవడం ఆమె ముందున్న ప్రధాన సవాళ్లు. అయితే, అజిత్ పవార్ మరణం పట్ల ఆమె స్పందించిన తీరు, కుటుంబం పట్ల ఆమెకున్న అనుబంధం ఇరు వర్గాల కార్యకర్తల్లో సెంటిమెంట్‌ను పెంచింది. ఇది పార్టీని ఏకం చేయడానికి ఆమెకు సానుకూల అంశంగా మారవచ్చు.

తర్వాతి తరం నాయకుల పరిస్థితి 

ఎన్సీపీలో తర్వాతి తరం నాయకుల్లో  రోహిత్ పవార్ అత్యంత చురుకుగా ఉన్నారు. అజిత్ పవార్ ఉన్న సమయంలోనే రోహిత్ పవార్ పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అజిత్ పవార్ కుమారులు రాజకీయంగా ఇంకా నిలదొక్కుకోనందున, రోహిత్ పవార్ , సుప్రియా సూలే ద్వయం పార్టీని ముందుకు నడిపించే అవకాశం ఉంది. శరద్ పవార్ ఈ క్లిష్ట సమయంలో పార్టీని మళ్ళీ ఏకం చేసి, తన వారసులకు పగ్గాలు అప్పగించే దిశగా పావులు కదుపుతున్నారు.

 పార్టీ ఏకమౌతుందా? 

అజిత్ పవార్ మరణంతో ఆయన వర్గానికి బలమైన నాయకుడు కరువయ్యారు. బీజేపీతో పొత్తులో కొనసాగడం కంటే, పవార్ అనే బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకోవడమే ఆ వర్గం ఎమ్మెల్యేలకు ముఖ్యం. అందువల్ల, రాబోయే కొన్ని నెలల్లోనే రెండు పార్టీలు విలీనమై, మళ్ళీ ఒకే ఎన్సీపీగా అవతరించే అవకాశాలు 90 శాతం వరకు ఉన్నాయి.