PM Modi On Nation First: బీజేపీ ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించుకుని,  సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. ఇంతటి ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి .. "దేశమే ముందు" Nation First  అనే భావనే కారణమని ఆయన అన్నారు.  బీజేపీ పదేళ్ల పాలనలో అనేక వ్యవస్థలను సంస్కరించామని.. చాలా పెద్ద నిర్ణయాలు తీసుకోగలిగామన్నారు. ఎవరికో మేలు చేయాలనే ఓటుబ్యాంక్ రాజకీయాలు తాము చేయమని.. దేశం ముందు అందరూ ఒకటేనన్నారు. ABP Network నిర్వహించిన India@2047 సమ్మిట్‌లో ప్రధాని మాట్లాడారు. 

దేశమే ముందు.. 

వికసిత్ భారత్ పేరుతో అతిపెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ దిశగా ముందుకు వెళ్లగలుగుతున్నామంటే.. భారత్ సామర్థ్యాన్ని తాము విశ్వసించడమే కారణమన్నారు. దేశం ఉన్నత స్థితికి వెళ్లడానికి కావలసిన సామర్థ్యం, వనరులు మన దగ్గర ఉన్నా.. ఇన్నాళ్లుగా దానిని నిర్లక్ష్యం చేశారని ఆయన కిందటి కాంగ్రెస్ ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. జాతీయ భావన లేకుండా ఓటుబ్యాంక్ రాజకీయాలు చేయడం వల్ల దేశం వెనుకబడిందన్నారు. ఎవరికో మేలు చేయడం కోసం సంస్కరణలు ఆలస్యం చేయడం వల్ల భారత్ తీవ్రంగా నష్టపోయిందని మోదీ వ్యాఖ్యానించారు.

"స్వాతంత్రం తర్వాత దేశం కన్న అతిపెద్ద కల వికసిత్ భారత్.. అది సాధ్యమేనని ప్రధాని మోదీ అన్నారు. వందేళ్ల లక్ష్యాలను సాధించుకునే సామర్థ్యం, వనరులు భారత్‌కు ఉన్నాయని  మనం దానిని సాధిస్తామని ప్రధాని అన్నారు. పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి  భారీ లక్ష్యాలను సాధించడానికి జాతీయభావం, దేశం సామర్థ్యం మీద నమ్మకం ఉండాలి. కానీ దురదుష్టవశాత్తూ.. కొన్ని దశాబ్దాల పాటు దీనికి దూరంగా ఉండిపోయాం.  అప్పట్లో నిర్ణయాలన్నీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం తీసుకున్నారు. దీనివల్ల మన అధికారం స్థిరపడుతుందా.. మన ఓటు బ్యాంక్ పోతుందా..  అనే భయాలతో స్వార్థ పూరిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయాం అన్నారు.  సంస్కరణలు అమలు చేయడంలో ఆలస్యం వల్ల దేశం నష్టపోయింది. ఏ దేశం కూడా ఇలా అభివృద్ధి చెందదు. ఏ దేశం ముందుకెళ్లాలన్నా… “ దేశమే ముందు (Nation First)”  అనే భావన" ఉండాలి అన్నారు, 

 దేశంలోని చిన్న బ్యాంకులను విలీనం చేయడం ద్వారా బ్యాంకింగ్ సెక్టార్‌ను నష్టాల నుంచి కాపాడాం. గతంలో బ్యాంకుల నష్టాల ప్రస్తావన లేకుండా ఏ సదస్సులు ముగిసేవి కాదు. 2014కి ముందు బ్యాంకులు కుప్పకూలిపోయే స్థితిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులు రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయి. దానికి మా ప్రభుత్వ తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలే కారణం ఎయిర్‌ ఇండియాను నష్టాల నుంచి కాపాడాం. ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితి లేదు. Nation First  అనే విధానం వల్లనే మేం ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలిగాం.

ట్రిపుల్‌ తలాఖ్, వక్ఫ్ సవరణ 

ట్రిపుల్ తలాఖ్ వల్ల ఈ దేశంలోని ముస్లిం మహిళలు ఎన్నో ఏళ్లుగా వేదనను అనుభవిస్తున్నారు. ఇన్నాళ్లుగా ఉన్న ప్రభుత్వాలు  వాళ్ల కన్నీళ్లు చూడలేదు. మేం మానవత్వంతో స్పందించాం. ట్రిపుల్ తలాఖ్ చట్టం.. మహిళలకు స్వాతంత్రాన్నిచ్చింది. వక్ఫ్ చట్టంపై కూడా అపోహలు పెట్టుకున్నారు. మేం ఏ పని చేసినా సామాజిక బాధ్యతతోనే చేశాం. మనుషులను ఓటు బ్యాంకులుగా ఎప్పుడూ చూడలేదు

 ఈ దశాబ్దమే మన భవితను నిర్ణయిస్తుంది

ఈ దశాబ్దం భారత్‌కు అత్యంత కీలకమైంది. మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని ప్రధాని అన్నారు. “ ఈ దశాబ్దం అత్యంత ముఖ్యమైంది. దేశం కోసం కొత్త చరిత్రను లిఖించే సమయం ఇది. దేశ ప్రజలు, వ్యవస్థలన్నింటిలోనూ ఈ స్ఫూర్తి కనిపిస్తోంది” అని ప్రధాని మోదీ అన్నారు.

 ఏబీపీని అభినందిస్తున్నా..

వికసిత్ భారత్ స్ఫూర్తిని అందిపుచ్చుకుని ఏబీపీ ఈ సదస్సును నిర్వహించడాన్ని ప్రధాని అభినందించారు. ఉదయం నుంచి చూస్తున్నా.. భారత్ మండపంలో వైవిధ్యం కనిపిస్తోంది. డ్రోన్ దీదీలు, సోలార్ దీదీలు ఈ వేదికపై కనిపించారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సమ్మిట్ దేశ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోంది.