Divorced IITian bride:  సోషల్ మీడియా యుగంలో పెళ్లి సంబంధాల కోసం పెట్టే వింత నిబంధనలు తరచూ చర్చనీయాంశమవుతుంటాయి.  తాజాగా ఒక 37 ఏళ్ల ఐఐటియన్  తన పెళ్లి కోసం కోరిన కోర్కెలు వింటే నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. తనకైతే విడాకులయ్యాయి కానీ, భార్య మాత్రం  కన్యా కుమారి  అయి ఉండాలన్న అతని వితండవాదంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

Continues below advertisement

మ్యాచ్ మేకర్ బయటపెట్టిన షాకింగ్ నిజాలు 

ప్రముఖ డేటింగ్ కోచ్, మ్యాచ్ మేకర్ ఓంద్రిలా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఒక వీడియో ఇప్పుడు మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో వైరల్‌గా మారింది. ఒక బిలియన్ డాలర్ల కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న 37 ఏళ్ల వ్యక్తి పెళ్లి సంబంధం కోసం ఆమెను సంప్రదించాడు. అతనికి గతంలో వివాహమై విడాకులు కూడా అయ్యాయి. కానీ, తనకు కాబోయే భార్య వయసు 30 ఏళ్ల లోపు ఉండాలని, ఆమె బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెంది ఉండాలని, అంతకంటే ముఖ్యంగా ఆమెకు ఎటువంటి గతం ఉండకూడదని వర్జిన్ అయి ఉండాలని  కండిషన్ పెట్టాడు. ఆశ్చర్యపోయిన మ్యాచ్ మేకర్

Continues below advertisement

అతని డిమాండ్లను చూసి ఆశ్చర్యపోయిన ఓంద్రిలా..  మీకు విడాకులయ్యాయి కదా, మరి అవతలి వ్యక్తికి గతం ఉండకూడదనడం ఏంటి అని ప్రశ్నించారు. దానికి ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం మరింత విడ్డూరంగా ఉంది. ఎక్కువ మందితో సంబంధాలు ఉన్న మహిళలు భవిష్యత్తులో మోసం చేసే అవకాశం ఉంటుందని ఏదో ఒక  రీసెర్చ్  చెబుతోందని అతను వాదించాడు. మరి ఇదే తర్కం నీకు వర్తించదా  అని ఆమె అడిగితే..  తాను మగవాడినని వర్తించదు.. ఇది సరైన పోలిక కాదు  అంటూ  వితండవాదం చేశాడు.

పితృస్వామ్య భావజాలంపై విమర్శలు: 

నువ్వు కోరుకుంటున్న నిబంధనలు పాటించే సాంప్రదాయ కుటుంబం, నీలాంటి విడాకులైన వ్యక్తికి తమ అమ్మాయిని ఇస్తుందని ఎలా అనుకుంటున్నావని మ్యాచ్ మేకర్ ఆ వ్యక్తిని నిలదీశారు.  ఇప్పటికే తనకు  షాదీ.కామ్ లో అలాంటి సంబంధాలు వస్తున్నాయని, కానీ వారు మోసం చేస్తున్నారేమోనని భయమేసి మ్యాచ్ మేకర్‌ను ఆశ్రయించినట్లు చెప్పాడు. దీనిపై ఆమె స్పందిస్తూ..  మోసం వారు చేయడం లేదు, నీ పాతకాలపు పితృస్వామ్య ఆలోచనలతో నువ్వే ఆ మహిళలను మోసం చేయబోతున్నావు అని ముఖం మీదే చెప్పి అతని అభ్యర్థనను తిరస్కరినట్లుగా చెప్పారు.    

ఇంకా ఇలాంటి వాళఅలు ఉన్నారు! 

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు ఐఐటియన్‌ను చెడుగుడు ఆడుకుంటున్నారు.  చదువు సంస్కారాన్ని ఇవ్వాలి కానీ ఇలాంటి అహంకారాన్ని కాదు  అని కొందరు,  నీకు విడాకులైనా పర్వాలేదు కానీ అమ్మాయికి మాత్రం గతం ఉండకూడదా? ఇదెక్కడి న్యాయం?" అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు  , ద్వంద్వ నీతికి   మధ్య చాలా తేడా ఉంటుందని, ఇతనిది కేవలం భాగస్వామిపై నియంత్రణ సాధించాలనే మనస్తత్వమేనని నెటిజన్లు మండిపడుతున్నారు.