Drugs Seized in Gujarat: గుజరాత్‌లో భారీ ఎత్తున డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్ నేవీతో పాటు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) సాయంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) 3,300 కిలోల డ్రగ్స్‌ని తీసుకొస్తున్న పడవపై దాడి చేశారు. పాకిస్థాన్‌కి చెందిన ముఠా ఈ డ్రగ్స్‌ని సప్లై చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ డ్రగ్స్ విలువ రూ.2 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ బాక్స్‌లపై "Produce of Pakistan" అని రాసి ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వీటిలో 3,089 కిలోల కాన్నబిస్, 158 కిలోల methamphetamine,25 కిలోల మార్ఫైన్ ఉన్నాయి. నిఘా వర్గాల సమాచారం ప్రకారం...పహారా కాసి ఈ పడవని స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్ నేవీకి చెందిన ఓ షిప్ కూడా దీనిపై నిఘా పెట్టింది. దాదాపు రెండు రోజుల పాటు సముద్రంలోనే ఆగిపోయి ఉండడం వల్ల నిఘాని మరింత పెంచారు. భారత సముద్ర జలాల్లోకి వచ్చేందుకు ప్రయత్నించిన క్రమంలో అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అందులోని డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. అందులో 5గురు సిబ్బందినీ అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని పోరబందర్‌కి తరలించారు. దీనిపై మరింత సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. ఈ ఆపరేషన్‌పై కేంద్రహోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. డ్రగ్ ఫ్రీ భారత్ లక్ష్యంగా పని చేస్తున్నందుకు అధికారులను అభినందించారు. X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.