Covid-19 JN.1 Variant Cases:


కొవిడ్ కొత్త వేరియంట్‌పై ఆందోళన పెరుగుతున్న క్రమంలోనే మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా 21 JN.1 వేరియంట్ కేసులు నమోదయ్యాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గోవాలో 19 మహారాష్ట్ర, కేరళలో ఒక్కో కేసు నమోదైంది. ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందనడానికి ఇదే ఉదాహరణ. అప్పుడే 21 కేసులు నమోదయ్యాయి. కొద్ది వారాలుగా ఈ వైరస్ టెన్షన్ పెడుతూనే ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్‌సుఖ్ మాండవియ కొవిడ్‌ కేసులపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అన్నింటికీ సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్ కొత్త స్ట్రెయిన్‌లపై నిఘా ఉంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కరోనా కట్టడి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. 


ఆరోగ్య శాఖ అప్రమత్తం..


కొవిడ్‌ పని అప్పుడే అయిపోలేదని, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలని స్పష్టం చేశారు. కొవిడ్ లక్షణాలపైనా నిఘా పెట్టాలని, శీతాకాలం కావడం వల్ల కేసులు పెరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే...ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసుల సంఖ్యని బట్టి చూస్తే భారత్‌లో పరిస్థితులు అంత ఆందోళనకరంగా ఏమీ లేవని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ...రెండు వారాల్లోనే ఉన్నట్టుండి కేసులు పెరగడంపై తాము దృష్టి పెట్టినట్టు వివరించారు. ఇప్పటి వరకూ కొత్త వేరియంట్ సోకిన వాళ్లలో 92.8% మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వాళ్లలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. హాస్పిటల్స్‌లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉంది. అప్పటికే వేరే ఏదో జబ్బుతో బాధపడుతున్న వాళ్లకు కరోనా సోకినప్పుడు మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చేంత ప్రమాదకరంగా మారుతోంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ , కేరళ, కర్ణాటకలో డెయిలీ పాజిటివిటీ రేటు పెరుగుతోంది. మూడు నెలలకోసారి హాస్పిటల్‌లోని వసతులను రివ్యూ చేసుకోవాలని సూచించింది కేంద్ర ఆరోగ్య శాఖ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలని తెలిపింది. ప్రస్తుతానికి JN.1 Variant ని ప్రపంచ దేశాలు పరిశీలిస్తున్నాయని, మరీ ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైతే కాదని నిపుణులు చెబుతున్నారు.