208 Naxalites surrender in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్ అలియాస్ సతీష్ అలియాస్ వికల్ప్ (59) సహా 208 మంది నక్సలైట్లు ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి . డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ఎదుట లొంగిపోయారు. ఇది రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సమూహ లొంగుబాటు ఘటనగా నిలిచింది. ఈ సంఘటనతో ఉత్తర బస్తర్ మరియు అబుజ్‌మడ్ ప్రాంతాలు నక్సల్ రహితంగా మారాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.
తక్కళ్లపల్లి వాసుదేవరావు తెలంగాణలోని ములుగు గ్రామానికి చెందినవారు. మావోయిస్టులలో 'బాంబ్ మేకర్'గా పేరుగాంచిన ఆయన, 2000లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుపై బాంబు దాడి రూపకర్తగా భావిస్తున్నారు. 1999లో మాజీ హోం మంత్రి ఎ. మాధవరెడ్డి, యువ IPS అధికారి ఉమేష్ చంద్ర హత్యల్లో కూడా పాలుపంచుకున్నట్లు సమాచారం. అబుజ్‌మడ్ ప్రాంతంలో ఆపరేట్ చేస్తున్న రూపేష్‌ను ఇటీవల మావోయిస్టు సెంట్రల్ కమిటీకి ఎంపిక చేశారు. కానీ అతను ఒక్క మీటింగ్‌కు కూడా హాజరు కాలేదు. రూపేష్‌తో పాటు డండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKZC) డివిజన్ ఇన్‌చార్జ్ రనీతా, సంతు వంటి కీలక నాయకులు కూడా లొంగిపోయారు. మొత్తం 20 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 30 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. మొత్తం 208 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో సెంట్రల్ కమిటీ సభ్యుడు రూపేష్ సహా ఇతర క్యాడర్ సభ్యులు ఉన్నారు. వారు 153 ఆయుధాలను అప్పగించారు. వీటిలో మెషిన్ గన్స్, గ్రనేడ్ లాంచర్లు వంటివి ఉన్నాయి.
ఈ లొంగుబాటుతో ఉత్తర బస్తర్ ప్రాంతం నక్సల్ రహితంగా మారింది. అబుజ్‌మడ్ ప్రాంతం నుంచి మావోయిస్టు ప్రభావం తొలగిపోయింది. ఇక దక్షిణ బస్తర్‌పై దృష్టి సారించనున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో 2,100 మంది మావోయిస్టులు లొంగిపోయారు, 1,785 మందిని అరెస్టు చేశారు, 477 మందిని ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. మార్చి 31, 2026 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.