Year Ender 2025 Maoists:   2025 సంవత్సరం భారత అంతర్గత భద్రతా చరిత్రలో, ముఖ్యంగా మావోయిస్టు వ్యతిరేక పోరాటంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. దశాబ్దాలుగా ఎర్రజెండా నీడన సాగుతున్న సాయుధ పోరాటం ఈ ఏడాది కోలుకోలేని దెబ్బతిన్నది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న " మావోయిస్టు రహిత భారత్  లక్ష్యం దిశగా బలగాలు జరిపిన మెరుపు దాడులతో అడవి అట్టుడికిపోయింది.  

Continues below advertisement

2025 మావోయిస్టుల అడవి సామ్రాజ్యానికి అస్తమయం   2025 సంవత్సరం మావోయిస్టుల పాలిట మృత్యువు గా మారింది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా , ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు అప్రతిహత విజయాలను సాధించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఒక్క ఏడాదే 200 మందికి పైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మరణించడం ఈ ఏడాది ప్రత్యేకత. ముఖ్యంగా అబూజ్‌మడ్ వంటి అభేద్యమైన కోటల్లోకి చొచ్చుకెళ్లి మరీ భద్రతా బలగాలు మావోయిస్టు అగ్రనేతలను మట్టుబెట్టాయి. 

 ఆపరేషన్ కగార్  మెరుపు దాడులు

Continues below advertisement

కేంద్ర హోం శాఖ నేతృత్వంలో వ్యూహాత్మకంగా అమలు చేసిన  ఆపరేషన్  కగార్  2025లో తీవ్రంఅయింది.  డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ మ్యాపింగ్  , గ్రేహౌండ్స్ దళాల సమన్వయంతో అడవులను జల్లెడ పట్టారు. జూన్ , సెప్టెంబర్ నెలల్లో జరిగిన రెండు భారీ ఎన్‌కౌంటర్లలోనే దాదాపు 60 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇందులో అత్యధిక రివార్డులు ఉన్న సీనియర్ క్యాడర్ సభ్యులు ఉండటం మావోయిస్టు పార్టీని నాయకత్వ లేమితో కుంగదీసింది. దండకారణ్యంలో గతంలో మావోయిస్టులకు ఉన్న గెరిల్లా పట్టు ఈ ఏడాది దాదాపుగా సడలిపోయింది.

 అగ్రనేతల పతనం - కుప్పకూలిన మేధోమథనం

2025లో మావోయిస్టు సెంట్రల్ కమిటీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉంటూ పార్టీని నడిపిస్తున్న కీలక నేతలు అనారోగ్య కారణాల వల్ల కొందరు, ఎన్‌కౌంటర్లలో మరికొందరు మరణించారు. అగ్రనేతల మరణం లేదా లొంగుబాటుతో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. కొత్త రిక్రూట్‌మెంట్ దాదాపు శూన్యం కావడంతో, కేవలం పాత నేతలతోనే కాలం వెళ్లదీస్తున్న పార్టీకి 2025 సంవత్సరం ఒక డెడ్ ఎండ్ లా మారింది. వృద్ధనేతలు చనిపోయినా మాడ్వీ హిడ్మా లాంటి వాళ్లు పార్టీని కాపాడుతారని అనుకున్నా.. ఆయన కూడా ఎన్ కౌంటర్అయ్యారు. 

మారిన ఆదివాసీల మనస్తత్వం - అభివృద్ధి బాట

మావోయిస్టుల పతనానికి బలగాల దాడులు ఒక కారణమైతే, స్థానిక ఆదివాసీల మద్దతు తగ్గడం మరో ప్రధాన కారణం. 2025లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, సెల్ టవర్ల ఏర్పాటు , పాఠశాలల స్థాపనను వేగవంతం చేశాయి. "తుపాకీ పట్టడం వల్ల అడవికి ఒరిగేదేమీ లేదు  అనే అవగాహన ఆదివాసీ యువతలో పెరగడం వల్ల ఇన్ఫార్మర్ల వ్యవస్థ బలపడింది. ఇది మావోయిస్టుల కదలికలను ముందే పసిగట్టేందుకు బలగాలకు పెద్ద ఆయుధంగా మారింది.

 భారీగా లొంగుబాట్లు  హింస వదిలి జనజీవన స్రవంతిలోకి..

ఈ ఏడాది కేవలం ఎన్‌కౌంటర్లే కాకుండా, లొంగుబాట్లు కూడా రికార్డు స్థాయిలో జరిగాయి. ప్రభుత్వ పునరావాస ప్యాకేజీలు, అభివృద్ధి పట్ల ఆకర్షితులై వందలాది మంది దళ సభ్యులు తుపాకులను వదిలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ తమ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చిందని, కేవలం హింసకే ప్రాధాన్యత ఇస్తోందని లొంగిపోయిన నేతలు ఆరోపించారు.  

2025 ముగిసే సమయానికి మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఒకప్పుడు దేశంలో 100కు పైగా జిల్లాల్లో విస్తరించిన ఈ సమస్య, ఇప్పుడు కేవలం కొన్ని  చిన్న ప్రాంతాల కే పరిమితమైంది. మొత్తం మీద, 2025 మావోయిస్టులకు ఒక దురదృష్టకరమైన, పరాజయాల ఏడాదిగా మిగిలిపోయింది.