Delhi Metro News: ఎప్పుడూ ఏదో ఓ వైరల్ వీడియోతో వార్తల్లో నిలిచే ఢిల్లీ మెట్రో ఈ సారి మరో విధంగా వార్తల్లోకెక్కింది. ఓ 16 ఏళ్ల బాలుడు మెట్రో ట్రైన్‌లో లైంగిక వేధింపులకు గురైనట్టు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనమవుతోంది. ఈ నెల 3వ తేదీన రాత్రి రాజీవవ్ చౌక్ మెట్రో స్టేషన్‌లో ఈ ఘటన జరిగినట్టు చెప్పాడు బాధితుడు. ఆ సమయంలో రైల్‌లో తాను ఒక్కడినే ఉన్నానని, కొందరు తనను వేధించారని వెల్లడించాడు. రాత్రి 8.30 గంటల సమయానికి మెట్రో రైల్ ఎక్కినట్టు వివరించాడు. తన పక్కనే ఉన్న ఓ ప్యాసింజర్‌ తన ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసి అసభ్యంగా ప్రవర్తించాడని వాపోయాడు. 


"ట్రైన్‌ ఎక్కిన వెంటనే నాతో పాటు ఉన్న ఓ ప్యాసింజర్ నన్ను అసభ్యంగా తాకాడు. ముందు నేను పెద్దగా పట్టించుకోలేదు. బ్యాగ్ తగిలి ఉండొచ్చని అనుకున్నాను. కానీ ఆ తరవాతే నిజం తెలిసింది. కావాలనే తన చేతితో పదేపదే తాకుతున్నాడని గమనించాను. ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టింది. మూడుసార్లు ఇదే పని చేశాడు. ఆ తరవాత కూడా తాకాలని చూసినప్పుడు వెంటనే అతని జుట్టు పట్టుకుని లాగేశాను. ఫొటో తీశాను. చాలా భయం వేసింది. కానీ ఎలాగైనా ఫొటో తీయాలనుకుని కెమెరాలో క్లిక్ చేశాను. ఆ తరవాత కాసేపు నాతో వాదించాడు"


- బాధితుడు


నిందితుడి ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఆ బాలుడు. తాను ఓ స్టేషన్‌లో దిగిపోయి వెళ్తుంటే వెంటపడ్డాడని చెప్పాడు. ఎస్కలేటర్ వరకూ తనను వెంటాడి పట్టుకునేందుకు ప్రయత్నించాడని, కానీ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయానని వివరించాడు. ఇంటికి వెళ్లేంత వరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తానని చెప్పాడు. ఆ తరవాత రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్‌ సిబ్బందికి ఇదంతా చెప్పి కేసు నమోదు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. ఇదంతా చదివిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఢిల్లీ మెట్రోలో నిఘా లేకుండా పోయిందని మండి పడుతున్నారు.