Anant Ambani Wedding Celebrations: అంబానీ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహానికి (Anant Ambani-Radhika Merchant Wedding) అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అంబానీ ఫ్యామిలీ ఏకంగా 14 ఆలయాలు నిర్మిస్తోంది. గుజరాత్‌లోని జామ్‌నగర్ టెంపుల్ కాంప్లెక్స్‌లో ఈ ఆలయాల్ని నిర్మిస్తున్నారు. భారత దేశ సంస్కృతి, ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా వీటిని రూపొందిస్తున్నారు. జులై 12న జరగనున్న పెళ్లికి ఇప్పటి నుంచి ఇలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మార్చి 1వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. మార్చి మూడో తేదీ వరకూ కొనసాగుతాయి. ఎంతో మంది నిపుణులైన శిల్పులు ఇక్కడి ఆలయాలన్ని అందంగా తీర్చి దిద్దారు. స్థానిక హస్త కళాకారులు ఇక్కడి విగ్రహాలను తయారు చేశారు. రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్, ఛైర్ పర్సన్ నీతా అంబానీ ఈ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించారు.






భారతీయత ఉట్టిపడేలా ఆలయాల నిర్మాణం చేపట్టాలని ముందుగానే సూచించారు. నిర్మాణం పూర్తైన తరవాత ఆ కాంప్లెక్స్‌ని సందర్శించారు. శిల్పుల కళా నైపుణ్యాన్ని ప్రశంసించారు. అందరి కృషి వల్లే ఇది సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు. మార్చి 1-3వ తేదీ మధ్యలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ గ్రాండ్‌గా జరగనున్నాయి. వినోదంతో పాటు కళలకీ ప్రాధాన్యం ఇచ్చేలా ఈ వేడుకలను ప్లాన్ చేస్తున్నారు. ముంబయి, ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఛార్టెడ్ ఫ్లైట్స్‌లో అతిథులను జామ్‌నగర్‌కి తీసుకురానున్నారు. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, డిస్నీ సీఈవో బాబ్ ఐగర్ ఈ వేడుకలకు హాజరయ్యే అవకాశముంది. వీళ్లతో పాటు భారత్‌లోని పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. బాలీవుడ్ సింగర్‌ అరిజిత్ సింగ్‌తో పాటు మ్యూజిక్ డైరెక్టర్‌ అజయ్ అతుల్ , దిల్జిత్ దోసాంజ్ లాంటి భారతీయ సంగీతకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, రజినీకాంత్,అక్షయ్ కుమార్‌కీ ఆహ్వానం అందింది. 


అంబానీ కుటుంబానికి కాబోయే కోడలు రాధిక మర్చంట్‌కు, ప్రి-వెడ్డింగ్ వేడుకలకు ముందే, అంబానీ కుటుంబం నుంచి అతి ఖరీదైన బహుమతులు అందాయి. వాటి విలువ లక్షల్లో కాదు, కోట్ల రూపాయల్లో ఉంది. రాధిక మర్చంట్, కాబోయే అత్తమామలు ముకేష్‌-నీతా అంబానీ నుంచి రూ.4.5 కోట్ల విలువైన కారును గిఫ్ట్‌గా అందుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం, కాబోయే అత్త నీతా అంబానీ నుంచి ఒక వెలకట్టలేని డైమండ్ చోకర్‌ను (నెక్లెస్ లాంటిది) రాధిక మర్చంట్‌ అందుకున్నారు. లక్ష్మీ-గణపతి గిఫ్ట్ హ్యాంపర్‌ను కూడా నీతా అంబానీ ఇచ్చారు. అందులో వెండి తులసి కుండతో పాటు లక్ష్మీదేవి, గణపతుల విగ్రహాలు ఉన్నాయి. ఒక సిల్వర్ స్టాండ్ కూడా ఉంది.అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌కు ఒక అందమైన బెంట్లీ కాంటినెంటల్ GTC స్పీడ్‌ను, తన వంతు గిఫ్ట్‌గా ముకేశ్ అంబానీ అందించారు. దేశంలోని అతి కొద్దిమంది సెలబ్రిటీల గ్యారేజ్‌లో మాత్రమే ఈ కారు ఉంది.