రివ్యూ: 'రొమాంటిక్'


రేటింగ్: 2/5



ప్రధాన తారాగణం: ఆకాశ్ పూరి, కేతికా శర్మ, రమ్యకృష్ణ, ఉత్తేజ్, మకరంద్ దేశ్‌పాండే, రమాప్రభ, సునైనా, ఖయ్యూమ్ తదితరులు 
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
కెమెరా: నరేష్

సాహిత్యం: భాస్కరభట్ల
సంగీతం: సునీల్ కశ్యప్
సమర్పణ: లావణ్య 
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్

కథ, స్క్రీన్ ప్లే, మాటలు: పూరి జగన్నాథ్
దర్శకత్వం: అనిల్ పాదూరి
విడుదల: 29-10-2021


కథాబలం మీద కొన్ని సినిమాలు విజయం సాధిస్తాయి. స్టార్ ఇమేజ్ వల్ల కొన్ని విజయం సాధిస్తాయి. కథకు స్టార్ ఇమేజ్ తోడయితే... సినిమా వేరే లెవ‌ల్‌లో ఉంటుంది. ఈ విషయం పూరి జ‌గ‌న్నాథ్‌కు తెలియనిది కాదు. కానీ, కుమారుడి మీద ప్రేమతో స్టార్ హీరోతో తీయాల్సిన కథతో 'రొమాంటిక్' తీశారేమో!? ప్రేక్షకుడిలో ఈ సందేహం కలిగితే... సినిమా కనెక్ట్ కావడం కష్టం. లేదంటే హిట్. 'రొమాంటిక్'లో ఏముంది? సినిమా కథేంటి?

 

కథ: రమ్యా గోవారికర్ (రమ్యకృష్ణ) ఓ ఏసీపీ. గోవాలో ఒక పోలీస్ అధికారిని మాఫియా ముఠా చంపడంతో ఆ సంగతి చూడమని ఆమెను పంపిస్తారు. గ్యాంగ్‌స్ట‌ర్‌ల‌ను షూట్ చేయడంలో ర‌మ్యా గోవారిక‌ర్‌కు రికార్డు ఉంటుంది. ఎంతోమందిని షూట్ చేసిన రికార్డు ఉంటుంది. అయితే... గోవాలో నూనూగు మీసాల ఓ యువకుడు వాస్కోడిగామా (ఆకాశ్ పూరి)ను షూట్ చేసిన తర్వాత కన్నీరు పట్టుకుంటుంది. ఎందుకు? ఆకాశ్ పూరి అంత చిన్న వయసులో గ్యాంగ్‌స్ట‌ర్‌ ఎలా అయ్యాడు? ఓ గ్యాంగ్‌కు నాయ‌కుడు ఎలా అయ్యాడు? మేరీ ఫౌండేషన్ పెట్టి పేదలకు ఎందుకు ఇళ్లు కట్టిస్తున్నాడు? మౌనిక (కేతికా శర్మ)కు, వాస్కోడిగామాకు మధ్య ఉన్నది ప్రేమా? మొహమా? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో లభిస్తాయి.

 

విశ్లేషణ: ప్రేమ గొప్పదా? మోహం గొప్పదా? అంటే... మోహమే గొప్పదని పూరి జగన్నాథ్ చెబుతారు. ప్రేమలో ఉన్న హీరో హీరోయిన్లు తమది మోహం అని అనుకుంటారని... అదే 'రొమాంటిక్'కు ఫ్రెష్‌గా ఉంటుందని పూరి జగన్నాథ్ చెప్పారు. 'రొమాంటిక్'లో హీరో హీరోయిన్లది ప్రేమా? మోహమా? అనేది తెలుసుకునే ముందు... వాళ్లిద్దరి మధ్య సన్నివేశాలు ఎన్ని ఉన్నాయి? అనేది ఆలోచిస్తే? చాలా చాలా తక్కువ.

 

మాఫియా, గ్యాంగ్‌స్ట‌ర్‌ నేపథ్యం అంటే దర్శకుడు పూరి జ‌గ‌న్నాథ్‌కు ఎంతో ప్రేమ. 'పోకిరి' నుంచి 'ఇస్మార్ట్ శంకర్' వరకూ పలు చిత్రాలు తీశారు. 'రొమాంటిక్'లో ఆయా సినిమాలు, వాటిలో సన్నివేశాల ఛాయలు చాలా కనిపిస్తాయి. పూరి జగన్నాథ్ చెప్పినట్టు ఆకాశ్ పూరి క్యారెక్టరైజేషన్‌లో 'ఇడియట్' ఛాయలున్నాయి. అందువల్ల, సినిమాలో కొత్తదనం లోపించింది. సినిమాలో ప్రేమకథ కంటే హీరో గ్యాంగ్‌స్ట‌ర్‌గా ఎదిగిన తీరు మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఆకాశ్ పూరికి మాస్ ఇమేజ్ తీసుకు రావాలనే ప్రయత్నం కనిపించింది. బహుశా... ప్రేక్షకుల్లో ఇమేజ్ ఉన్న స్టార్ హీరోతో ఈ సినిమా తీసుంటే మరో స్థాయిలో ఉండేదేమో? ఆకాశ్ పూరి టీనేజ్ లుక్స్, అతడి ఎటువంటి ఇమేజ్ లేకపోవడం మైనస్ అయ్యింది. పాత కథనైనా కొత్తగా చెబితే... ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చు. దర్శకుడు అనిల్ పాదూరి కొత్తగా చెప్పలేదు. పూరి జగన్నాథ్ శైలిని అనుసరించాడు. దాంతో పూరి గత చిత్రాలు చూసినట్టు ఉంటుంది. పాటలు, నేపథ్య సంగీతం, ఎడిటింగ్, ఫిల్మ్ మేకింగ్... ప్రతి విభాగంలో పూరి మార్క్ కనిపించింది.

 

గ్యాంగ్‌స్ట‌ర్‌ డ్రామా ముందు హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు చిన్నబోయాయి. ఎక్కువ శాతం పాటలకు పరిమితం అయ్యాయి. ఓ పాటలో పూరి ఫిలాసఫీ వినిపించింది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... పాటలను చాలా రొమాంటిక్‌గా చిత్రీకరించారు. అందాల ప్రదర్శనకు కేతికా శర్మ ఏమాత్రం సంకోచించలేదు. మాస్, యూత్ ప్రేక్షకులను పాటలు ఆకట్టుకోవచ్చు. పతాక సన్నివేశాలను రొటీన్‌గా కాకుండా డిఫ‌రెంట్‌గా ప్లాన్ చేశారు. అది ఆడియ‌న్స్‌కు షాక్. హీరో హీరోయిన్ల మధ్య ఉన్నది మొహం కాదు... ప్రేమ అని చెప్పడానికి అలా ప్లాన్ చేశారనుకుంట! అయితే... అక్కడి వరకూ చూపించిన సన్నివేశాల్లో ఆ ప్రేమను, ప్రేమలో గాఢతను చూపించి ఉంటే క్లైమాక్స్ మరింత ఎఫెక్టివ్‌గా ఉండేది.

 

ఆకాశ్ పూరిలో మంచి నటుడు ఉన్నాడు. సరైన పాత్ర పడితే... భావోద్వేగాలను బాగా పండిస్తాడు. వాస్కోడిగామా పాత్రకు తన పరంగా న్యాయం చేశాడు. డైలాగులు బాగా చెప్పాడు. పతాక సన్నివేశాల్లో కంటతడి పెట్టిస్తాడు. అయితే... ఆకాశ్ పూరి వయసుకు మించిన పాత్ర వాస్కోడిగామా అని చెప్పాలి. అతడు మరో ఐదేళ్లు, పదేళ్లు తర్వాత చేయాల్సిన పాత్ర. కేతికా శర్మ అందాల ప్రదర్శనపై పెట్టిన దృష్టి, నటన మీద పెట్టలేదు. రమ్యకృష్ణ వల్ల ఏసీపీ రమ్యా గోవారికర్ పాత్రకు వెయిట్ పెరిగింది. ఉత్తేజ్, సునైనా, రమాప్రభ, మకరంద్ దేశ్‌పాండే తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.

 

కథ కొత్తగా ఉంటే సరిపోదు. కథకు ఎంచుకున్న నేపథ్యం కూడా కొత్తగా ఉండాలి. అప్పుడే ప్రేక్షకులకు కొత్త సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. ఇప్పటికే చాలాసార్లు చూసేసిన నేపథ్యంలో 'రొమాంటిక్' తీయడం, సినిమాకు మైనస్. అయితే... రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసే ప్రేక్షకులు, పూరి జగన్నాథ్ అభిమానులకు సినిమా నచ్చే అవకాశం ఉండొచ్చు. సగటు ప్రేక్షకులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని థియేటర్ల వైపు చూడటం మంచిది.