రివ్యూ: నాట్యం
ప్రధాన తారాగణం: సంధ్యా రాజు, కమల్ కామరాజు, రోహిత్ బెహల్, భానుప్రియ, ఆదిత్య మీనన్, బేబీ దీవెన తదితరులు3
సాహిత్యం: కరుణాకర్ అడిగర్ల
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
నిర్మాత: సంధ్యా రాజు (నిశృంఖల ఫిలిమ్స్)
స్టోరీ, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, దర్శకత్వం: రేవంత్ కోరుకొండ
విడుదల: 22-10-2022
సంధ్యా రాజు 'రామ్ కో' చైర్మన్ వెంకట్రామరాజా కుమార్తె. సత్యం రామలింగరాజు కోడలు. కుటుంబ నేపథ్యాన్ని పక్కన పెట్టి.. కూచిపూడి నృత్యకారిణిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నాట్యం’ సినిమాతో కథానాయికగా, నిర్మాతగా పరిచయమవుతున్నారు. తెలుగులో డాన్స్ బేస్డ్ సినిమాలు కొన్ని వచ్చాయి. అయితే, ఈమధ్య కాలంలో అలాంటి చిత్రాలు దాదాపు కనుమరుగైపోయాయి. క్లాసికల్ డ్యాన్స్ బేస్డ్ సినిమా వచ్చి చాలా రోజులైంది. మరి, నాట్యం ఎలా ఉంది? ఇందులో సంప్రదాయ నృత్యంతో పాటు కథ ఎలా ఉంది?
కథ: రోహిత్ (రోహిత్ బెహల్) అమెరికన్ డాన్స్ కాంపిటీషన్స్ కి ఆడిషన్ ఇస్తాడు. అతడి డాన్స్ లో ఎనర్జీ ఉంది కానీ కాన్సెప్ట్ ఏమీ లేదని జడ్జ్ అంటుంది. ఆమెను రోహిత్ రిక్వెస్ట్ చేస్తే... నాట్యం అనే ఒక ఊరు గురించి చెబుతుంది. ఆ ఊరిలో అందరూ క్లాసికల్ డాన్సర్స్ అని, వాళ్లు కథను నాట్యం రూపంలో చెబుతారని, అక్కడికి వెళ్లి కాన్సెప్ట్ తో రమ్మని సలహా ఇస్తుంది. నాట్యం ఊరికి వెళ్లిన రోహిత్ కు సితార (సంధ్యా రాజు) పరిచయం అవుతుంది. ఆ ఊరిలో గురువు గారు (ఆదిత్య మీనన్) దగ్గర సితార నాట్యం నేర్చుకుంది. కాదంబరి కథతో రంగప్రవేశం చేయాలని చిన్నతనం నుంచి కలలు కంటుంది. కానీ, ఆ కథను చేయవద్దని గురువుగారు చెబుతుంటారు. ఆయన ఎందుకు కాదంబరి కథను వద్దన్నారు? ఆయనే ఆ కథతో రంగప్రవేశం చేయమని అనుమతి ఇచ్చిన తర్వాత ఎందుకు బ్రేక్ పడింది? అసలు, కాదంబరి ఎవరు? ఆమె కథేంటి? రోహిత్ అమెరికన్ డాన్స్ కాంపిటీషన్ కు వెళ్లాడా? లేదా? సితార రంగప్రవేశం ఏమైంది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ: 'నాట్యం' చిత్రంలో సంప్రదాయ నృత్యం ఉంది. బావుంది. సంప్రదాయ నృత్యం నేపథ్యంలో కథ రాసి, సినిమా తీసినందుకు చిత్రబృందాన్ని అభినందించాలి. అయితే, రేవంత్ కోరుకొండ అందరూ అభినందించేలా సినిమా తీశారా? అంటే కొంత ఆలోచించాలి. కథ, కూర్పు, ఛాయాగ్రహణం, దర్శకత్వం... నాలుగు బాధ్యతలను ఆయన భుజాన వేసుకున్నారు. ఛాయాగ్రాహకుడిగా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఇచ్చారు. ప్రొడక్షన్ వేల్యూస్ విషయంలో సంధ్యా రాజు కాంప్రమైజ్ కాకపోవడంతో ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనిపించింది. దర్శకుడిగా కూడా రేవంత్ కోరుకొండ బాగా తీశారు. కానీ, కథ - కూర్పు విషయంలో కొంత తడబడ్డారు. సినిమా ఫస్టాఫ్‌లో హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే సన్నివేశాలు, కథ రొటీన్‌గా ఉన్నాయి. సెకండాఫ్‌లో కాదంబరి కథను నాట్యం రూపంలో ఎప్పుడైతే చెప్పడం ప్రారంభించారో... అప్పటి నుండి సినిమా ఆసక్తికరంగా మారింది. వరుసపెట్టి పాటలు వస్తున్నప్పటికీ ప్రేక్షకులు అలా చూసేలా గ్రిప్పింగ్ గా తీశారు.
శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించిన పాటలు, నేపథ్య సంగీతం లేకుండా 'నాట్యం' సినిమాను ఊహించలేం. సంగీత దర్శకుడిగా శ్రవణ్ వైవిధ్యం చూపించారు. భిన్నమైన పాటలు ఇచ్చారు. నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోసింది. సినిమాలో పాటలన్నీ కరుణాకర్ అడిగర్ల రాశారు. చిన్న పాత్రలో కూడా నటించారు. ఎడిటర్‌గా రేవంత్ కోరుకొండ ఫస్టాఫ్‌లో కొంత ట్రిమ్ చేసి ఉంటే బావుండేది.
కథానాయికగా సంధ్యా రాజుకు తొలి చిత్రమిది. కూచిపూడి నృత్యంలో పదేళ్లకు పైగా అనుభవం ఉండడంతో సంప్రదాయ నృత్యం చేసే సన్నివేశాల్లో అలవోకగా నటించారు. క్లాసికల్ డాన్స్ చేసిన ప్రతి పాట, సన్నివేశంలో సంధ్యా రాజు చాలా కంఫర్ట్ గా కనిపించారు. లవ్, రొమాంటిక్ సీన్స్ లో అసౌకర్యవంతంగా ఫీలయ్యారు. గురువుగారికి ఆదిత్య మీనన్, దేవాలయం ట్రస్టీగా శుభలేఖ సుధాకర్ చక్కగా నటించారు. ఆ పాత్రలకు సరిపోయారు. కమల్ కామరాజు తన పాత్రలో రెండు వేరియేషన్స్ లో బాగా చూపించారు. రోహిత్ బదులు తెలుసు తెలిసిన నటుడిని తీసుకుని ఉంటే పాత్రను అర్థం చేసుకుని ఇంకా బాగా నటించేవారు ఏమో! అతడు అందంగా ఉన్నాడు. కానీ, అందంగా నటించలేకపోయాడు. కథానాయిక తల్లిగా భానుప్రియ అతిథి పాత్రలో కనిపించారు. ఆమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు.
'నాట్యం అంటే కథను అందంగా చెప్పడం' అని సినిమా చివర్లో దర్శకుడు రేవంత్ కోరుకొండ ఓ మాట చెప్పారు. మరి, సినిమా అంటే? ఎటువంటి కథను తీసుకున్నా ప్రేక్షకులు ఆసక్తికరంగా చూసేలా చెప్పడం! సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఆసక్తి కొనసాగించడంలో కొంత తడబడ్డారు. అయితే, కొత్త ప్రయత్నం చేశారు. క్లాసికల్ డాన్స్ ఇష్టపడేవాళ్లు సినిమాకు వెళ్లొచ్చు. చివరి అరగంట ఆసక్తిగా ఉంటుంది.
Also Read: 'హెడ్స్ అండ్ టేల్స్' సమీక్ష: సీరియస్ ఇష్యూకు సొల్యూషన్ అంత ఈజీనా?