రేటింగ్: 3/5
స్క్విడ్ గేమ్ తర్వాత కొరియన్ సిరీస్‌లకు విపరీతమైన డిమాండ్ వచ్చేసింది. ఎక్కడెక్కడో పాత కొరియన్ థ్రిల్లర్లను వెతుక్కుని మరీ చూస్తున్నారు థ్రిల్లర్ లవర్స్. సరిగ్గా ఇదే టైంలో నెట్‌ఫ్లిక్స్ హెల్ బౌండ్ అనే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌ను విడుదల చేసింది. ట్రైన్ టు బుసాన్ దర్శకుడు యోన్ సాంగ్-హో దర్శకత్వం వహించడంతో దీనిపై అంచనాలు బాగా ఎక్కువ అయిపోయాయి. స్క్విడ్ గేమ్‌ను మించే సిరీస్ అని ఇంటర్నెట్‌లో విపరీతంగా ప్రచారం జరిగింది. మరి ఇది అంచనాలను అందుకుందా? స్క్విడ్ గేమ్‌ను మించే స్థాయిలో ఉందా?
కథ: 2022, 2027 రెండు వేర్వేరు కాలాల్లో జరిగే కథ ఇది. కథ ప్రారంభంలో ఒక వ్యక్తి భయపడుతూ రెస్టారెంట్‌లో కూర్చుని టైమ్ చూసుకుంటూ ఉంటాడు. మధ్యాహ్నం 1:20 అవ్వగానే అతని మూడు భారీ వింత ఆకారాలు దాడి చేసి చంపేస్తాయి. తర్వాత కూడా అలా చాలా మందికి జరుగుతుంది. అసలు ఎందుకు అలా జరుగుతుంది? దీన్ని ఆపడం సాధ్యం కాదా?
విశ్లేషణ: కథ పరంగా చూసుకుంటే.. ఇది నిజంగా చాలా కొత్త ఆలోచన. భూమి మీద పాపాలు చేసే వాళ్లకు బతికుండగానే శిక్ష విధించి నరకానికి పంపడం అనే ఆలోచన అప్పట్లో శంకర్‌కి, ఇప్పుడు యోన్ సాంగ్-హోకి మాత్రమే వచ్చిందనుకోవాలి. శంకర్ అపరిచితుడుని గరుడ పురాణం ఆధారంగా తీస్తే.. ఇది మాత్రం పూర్తిగా యోన్ ఫాంటసీలో నుంచి వచ్చిన కథ. ట్రీట్‌మెంట్ మాత్రం పూర్తిగా మారిపోయింది. అక్కడ హీరో శిక్షిస్తాడు. ఇక్కడ ఏవో మూడు వింత ఆకారాలు ఆ బాధ్యతను తీసుకుంటాయి.
ప్రారంభం ఎంతో ఆసక్తిగా మొదలైనా.. తర్వాత టెంపో మిస్ అవుతుంది. మొదటి మూడు ఎపిసోడ్లు 2022లో జరుగుతాయి. మిగతా మూడూ 2027లో జరుగుతాయి. ఈ రెండు టైమ్‌లైన్స్ మధ్యలో ఎటువంటి కనెక్షన్ లేకపోవడం, మొదటి మూడు ఎపిసోడ్లలో కనిపించిన పాత్రల్లో తక్కువ పాత్రలు చివరి మూడు ఎపిసోడ్లలో కనిపించడం వంటికి కాస్త అసంతృప్తి కలిగిస్తాయి. దీంతోపాటు అసలు ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో క్లారిటీ ఇవ్వకపోవడం కూడా మైనస్ పాయింట్. చివర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అని చెప్పవచ్చు. తర్వాతి సీజన్ మీద మరింత ఆసక్తిని పెంచేలా ఆ ట్విస్ట్‌ను రివీల్ చేశారు.
దేశంలో ప్రభుత్వం బదులు ఒక మతం అధికారం చెలాయిస్తే.. ఎంత అరాచక పరిస్థితులు నెలకొంటాయో కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. అయితే ప్రస్తుతం మనుగడలో ఉన్న మతాలు కాకుండా ఒక కొత్త మతాన్ని చూపించడం ద్వారా దర్శకుడు సేఫ్ ప్లే చేశాడు. యువత మీద మతోన్మాదం ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఆ మాయలో పడినవాళ్లు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారు? వంటి అంశాలను చాలా బాగా చూపించారు.
సిరీస్ చూడబుల్‌గానే ఉన్నప్పటికీ కొన్ని ప్రశ్నలకు అయినా క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేది. సిరీస్ ప్రారంభమైన రెండు ఎపిసోడ్లకే ఇది ఒక్క సీజన్‌లో, ఆరు ఎపిసోడ్లలో ముగిసే కథ కాదని అర్థం అవుతుంది. కానీ ఏం జరుగుతుంది? తర్వాతి ఎపిసోడ్లలో ఏం చూడబోతున్నాం? అనే అంశాలను కనీసం గెస్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు.
ఓవరాల్‌గా చూసుకుంటే.. ఎన్నో ప్రశ్నలను మిగిల్చే మంచి థ్రిల్లింగ్ రైడ్ ఈ ‘హెల్ బౌండ్’. అయితే స్క్విడ్ గేమ్‌ను మనసులో పెట్టుకుని ఆ అంచనాలతో చూస్తే మాత్రం కాస్త నిరాశ తప్పదు.