వెబ్ సిరీస్ రివ్యూ : 1899
రేటింగ్ : 3.5/5
నటీనటులు : ఎమిలీ బీచామ్, ఆండ్రియాస్ పీచ్‌మన్, అనేఊరిన్ బర్నార్డ్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే : జాంజే ఫ్రీస్, బరాన్ బూ ఊదార్‌
ఛాయాగ్రహణం : నికోలాస్ సమ్మరర్ 
సంగీతం : బెన్ ఫ్రాస్ట్
నిర్మాణ సంస్థ : నెట్‌ఫ్లిక్స్
దర్శకత్వం : బరాన్ బూ ఊదార్‌
విడుదల తేదీ: నవంబర్ 17, 2022
ఓటీటీ వేదిక : నెట్‌ఫ్లిక్స్
ఎపిసోడ్స్ సంఖ్య : 8


ప్రపంచ టీవీ, వెబ్ సిరీస్ చరిత్రలో ‘DARK’ ఒక సంచలనం. ఆల్ టైం బెస్ట్ వెబ్ సిరీస్‌ల్లో ఒకటిగా దీన్ని చెప్పుకుంటూ ఉంటారు. టైం ట్రావెల్ జోనర్‌కు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి సంక్లిష్టమైన కథను అర్థమయ్యేలా చెప్పడంతో ‘డార్క్’కు అంత మంచి పేరు వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించిన జాంజే ఫ్రీస్, బరాన్ బూ ఊదార్‌లు ‘1899’ అనే కొత్త వెబ్ సిరీస్‌ను ప్రకటించగానే దానిపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సిరీస్ ఇప్పుడు నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. మరి ఆ అంచనాలను ‘1899’ అందుకుందా?


కథ: ‘కెర్బెరోస్’ అనే నౌక లండన్ నుంచి న్యూయార్క్ బయలుదేరుతుంది. ఆ షిప్‌లో కెప్టెన్, నౌక సిబ్బంది సహా మొత్తం 1612 మంది ఉంటారు. కెర్బెరోస్ బయలుదేరడానికి నాలుగు నెలల కిందట అదే దారిలో ‘ప్రొమిథియస్’ అనే నౌక అదృశ్యం అవుతుంది. కొన్నాళ్లు ప్రయాణం చేశాక కెర్బెరోస్ నౌకకు గుర్తు తెలియని నౌక నుంచి సిగ్నల్ వస్తుంది. దగ్గరకి వెళ్లి చూస్తే అది ప్రొమిథియస్ అని తెలుస్తుంది. అయితే ప్రొమిథియస్ దగ్గరకు కెర్బెరోస్ వెళ్లగానే సిగ్నల్స్ ఆగిపోతాయి. కెప్టెన్ (ఆండ్రియాస్ పీచ్‌మన్) కొందరు ప్రొమిథియస్‌లోకి వెళ్తారు. అక్కడ వారికి ఒక చిన్న బాలుడు మాత్రమే కనిపిస్తాడు. ఆ బాలుడి దగ్గర ఒక ట్రయాంగిల్ ఉంటుంది. తనని కెర్బెరోస్‌కి తీసుకువస్తారు. ‘ప్రొమిథియస్’ను ముంచేయమని కెప్టెన్‌కు తన కంపెనీ నుంచి ఆదేశాలు వస్తాయి. కానీ వాటిని పట్టించుకోకుండా తిరిగి ప్రొమిథియస్‌ను లండన్ తీసుకెళ్లాలని కెప్టెన్ నిర్ణయిస్తాడు. అప్పట్నుంచి నౌకలో విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. అవెందుకు జరుగుతున్నాయి? వాటి వెనక ఎవరున్నారు? తెలుసుకోవాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ చూడాల్సిందే.


విశ్లేషణ: ఒక సులువైన కథను కాంప్లికేటెడ్‌గా చెప్పడం అనేది చాలా పెద్ద ఆర్ట్. ఈ సిరీస్‌లో ఉన్న ఎనిమిది ఎపిసోడ్లు పూర్తయ్యాక టీవీ ఆపేసి ప్రశాంతంగా కుర్చీలో కూర్చుని ‘అసలు ఇందులో కథేంటి?’ అని ఆలోచిస్తే మనకు తట్టేది చాలా చిన్న సింగిల్ లైన్ స్టోరీ. దాన్ని కాంప్లికేట్ చేయడంతో పాటు ప్రేక్షకులను కూడా పూర్తిగా ఎంగేజ్ చేయడంలో దీని రచయతలు జాంజే ఫ్రేస్, బరాన్ బూ ఊదార్‌లు 100 శాతం సక్సెస్ అయ్యారు. ఈ సిరీస్‌లోని ఎనిమిది ఎపిపోడ్లకు బరాన్ బూ ఊదారే దర్శకుడు కూడా. టీవీలో ఏదో ఒక సిరీస్ స్టార్ట్ చేసి మన పాటికి మనం ఫోన్ చూసుకుంటూ, వేరే పనులు చేసుకుంటూ మధ్యలో ఎప్పుడు చూసినా సులభంగా అర్థం అయ్యే సిరీస్ కాదు ఇది. ఈ సిరీస్ చూడాలనుకున్నప్పుడు ఫోన్ పక్కనపెట్టి పూర్తి స్థాయి అటెన్షన్ ఇస్తేనే దీన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. పైన చెప్పినట్లు మధ్యమధ్యలో చూస్తే ఏం అర్థం కావట్లేదు అని సగంలోనే ఆపేస్తాం.


ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ చాలా సాదాసీదాగా మొదలవుతుంది. ఒక నౌక, అందులోని ప్రయాణికులు, వారి వేర్వేరు నేపథ్యాలను పరిచయం చేస్తూ తెరను మెల్లగా తీస్తారు. అయితే తప్పిపోయిన నౌక తిరిగి కనిపించడం, అందులో ఒక బాలుడు మాత్రమే దొరకడంతో మెల్లగా సిరీస్‌పై ఆసక్తి మొదలవుతుంది. మొదటి నాలుగు ఎపిసోడ్లు మెల్లగా పెరిగిన సిరీస్ గ్రాఫ్, ఐదో ఎపిసోడ్ నుంచి ఒక్కసారిగా పైకి చేరిపోతుంది. అక్కడ నుంచి అస్సలు ఊహించలేని ట్విస్ట్‌లు, టర్న్‌లు, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్‌తో ఊపిరి సలపకుండా చేస్తారు. హీరో, హీరోయిన్, విలన్ అన్న స్టాండర్డ్ టెంప్లేట్ ఏమీ లేకుండా రాసుకున్న సందర్భాలకు, సన్నివేశాలకు అనుగుణంగా పాత్రలు ప్రవర్తిస్తూ ఉంటాయి.


అయితే మొదటి నాలుగు ఎపిసోడ్లలో అక్కడక్కడా కథనం కొంచెం నెమ్మదిగా సాగుతుంది. కొన్ని అవసరం లేని పాత్రలకు కూడా ఎక్కువ సన్నివేశాలు, స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. ఇక సిరీస్ ముగింపు రెండో సీజన్‌కు పర్ఫెక్ట్ లీడ్ అయినప్పటికీ, కీలక పాత్రల స్వభావాన్ని ఇంతవరకు రివీల్ చేయకపోవడం కాస్త అసంతృప్తిగా అనిపిస్తుంది. ఏడు ఎపిసోడ్లు అయిపోయాక సీజన్ ముగింపు ఇలా ఉండవచ్చు అనుకునే ప్రేక్షకుల ఊహకు తగ్గట్టుగా ఉంటూనే, మళ్లీ షాకిచ్చేలా చివరి సన్నివేశం ఉండటం హైలెట్.


టెక్నికల్‌గా కూడా ఈ సిరీస్‌ను అద్భుతం అని చెప్పవచ్చు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యూనిక్‌గా ఉంటుంది. డార్క్ ఛాయలు అక్కడక్కడా కనిపించినా చాల ఫ్రెష్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సంగీతంలో పాటు సినిమాటోగ్రఫీ, సెట్ వర్క్ కూడా అద్భుతంగా ఉంది. 1899 నాటి షిప్‌ను అద్భుతంగా సెట్ వేశారు. దాన్ని అంతే నేచురల్‌గా చూపించారు.


ఇక నటీనటుల విషయానికి వస్తే... ఈ సీజన్‌కు ఎమిలీ బీచమ్ పోషించిన మారా ఫ్రాంక్లిన్‌దే ప్రధాన పాత్ర. ఆ పాత్రకు తను చక్కగా సరిపోయింది. వేర్వేరు సన్నివేశాల్లో అక్కడ అవసరమైన ఎమోషన్స్‌ను చక్కగా పండించింది. తన తర్వాత అంతటి కీలక పాత్ర నౌకలో దొరికిన బాలుడిదే. ఆ పాత్రను ఫ్లిన్ ఎడ్వర్డ్స్ చక్కగా పోషించాడు. డార్క్‌లో మధ్యవయస్కుడైన జోనాస్ కాన్‌వాల్డ్ పాత్రలో కనిపించిన ఆండ్రియాస్ పీచ్‌మన్ ఇందులో షిప్ కెప్టెన్‌గా ఆకట్టుకుంటాడు. మిగతా వారందరూ తమ పాత్రలకు తగ్గ న్యాయం చేశారు.


ఓవరాల్‌గా చెప్పాలంటే... టైంపాస్‌కు కాకుండా టైమ్ ఇచ్చి చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది. ఒక ఎనిమిది ఎపిసోడ్ల సమయం మీరు దీనికి ఇస్తే, మీకు బోలెడన్ని సర్‌ప్రైజ్‌లను 1899 ఇస్తుంది.


ఎపిసోడ్‌ల వారీగా రేటింగ్:
1. ది షిప్ - 3.5/5
2. ది బాయ్ - 3/5
3. ది ఫాగ్ - 2.75/5
4. ది ఫైట్ - 3/5
5. ది కాలింగ్ - 3.5/5
6. ది పిరమిడ్ - 3.5/5
7. ది స్టార్మ్ - 3.75/5
8. ది కీ - 3.25/5


Also Read : 'ఊర్వశివో రాక్షసివో' రివ్యూ : ఆరు ముద్దులు, ఆ తర్వాత అర్థమైందిగా -  అల్లు శిరీష్ సినిమా ఎలా ఉందంటే?


Also Read : 'ఝాన్సీ' వెబ్ సిరీస్ రివ్యూ : లేడీ గజినీలా మారిన అంజలి - సిరీస్ ఎలా ఉందంటే?