రేటింగ్: 2.75/5


ప్రధాన తారాగణం: నాగశౌర్య, రీతూ వర్మ, నదియా, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, సప్తగిరి తదితరులు
ఎడిటర్: నవీన్ నూలి
కెమెరా: వంశీ పచ్చిపులుసు
సంగీతం: థమన్, విశాల్ చంద్రశేఖర్
నిర్మాణ సంస్థ: సితార ఎంటర్‌టైన్ మెంట్స్
దర్శకత్వం: లక్ష్మీ సౌజన్య
విడుదల: 29-10-2021


నాగశౌర్య, రీతూ వర్మ హీరో, హీరోయిన్లుగా.. నూతన దర్శకురాలు లక్ష్మీ సౌజన్య రూపొందించిన సినిమా వరుడు కావలెను. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఛలో తర్వాత ఆ స్థాయి హిట్ కోసం నాగశౌర్య కష్టపడుతూనే ఉన్నాడు. అశ్వద్ధామ ఎంతో కష్టపడి చేసినా ఆశించిన ఫలితం రాలేదు. ఆ తర్వాత విడుదలైన సినిమా కావడంతో దీనిపై శౌర్య ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. మరి వరుడు అంచనాలను అందుకున్నాడా.. హిట్టు కోసం నాగశౌర్య పడిన కష్టం ఫలించిందా?


కథ: ఆకాష్ (నాగశౌర్య) ఒక ఎన్నారై. ప్రాజెక్ట్ పనిమీద ఇండియాకు వచ్చినప్పుడు భూమి (రీతూ వర్మ) కనిపిస్తుంది. కొన్నాళ్లకి తన ప్రవర్తన నచ్చి భూమిని ఇష్టపడటం ప్రారంభిస్తాడు. అయితే భూమి మాత్రం ఆకాష్‌ను అస్సలు పట్టించుకోదు. తనకు పెళ్లి మీద కూడా ఆసక్తి ఉండదు. భూమికి పెళ్లి మీద ఆసక్తి లేకపోవడానికి కారణం ఏంటి? భూమి, ఆకాష్‌లకి అంతకుముందే పరిచయం ఉందా? అసలు వీరిద్దరూ కలిశారా? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..


విశ్లేషణ: దర్శకురాలు లక్ష్మీ సౌజన్య తీసుకున్న పాయింట్ చిన్నదే అయినా.. కథనాన్ని బోర్ కొట్టకుండా నడిపించింది. సినిమా డౌన్ అవుతుంది అనుకున్నప్పుడల్లా కామెడీ సీన్లతో గ్రాఫ్ డౌన్ అవ్వకుండా చూసింది. అయితే లైన్ మరీ చిన్నది కావడం, లవ్.. హేట్.. లవ్ కాన్సెప్ట్ మీద ఇప్పటికే ఎన్నో సినిమాలు రావడంతో సినిమాలో కథ ఎటువైపు సాగుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. మనం అనుకున్నట్లుగానే కథ నడవడం సినిమాకు మైనస్. అయితే క్లీన్ కామెడీ కావడం, ఫ్యామిలీస్‌ను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ వరుడు పాస్ మార్కులతో గట్టెక్కే అవకాశం ఉంది.


నాగశౌర్యకు ఇలాంటి పాత్రలు పోషించడం కష్టమేమీ కాదు. కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే దగ్గర నుంచి శౌర్య లవర్ బాయ్ పాత్రలు పోషిస్తూనే ఉన్నాడు. అయితే గతంలో కంటే తన నటనలో ఈసారి కాస్త మెచ్యూరిటీ కనిపించింది. ఈ మెచ్యూరిటీని ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ-క్లైమ్యాక్స్ సన్నివేశాల్లో తెరమీద చూడవచ్చు. దీంతోపాటు గతంలో ఏ సినిమాలోనూ లేనంత అందంగా నాగశౌర్యను ఈ సినిమాలో చూడవచ్చు. ప్రీరిలీజ్ ఈవెంట్ స్టేజ్ మీద శౌర్య కూడా తన స్టైలిస్ట్‌కు థ్యాంక్స్ చెప్పాడు.


ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ హీరోకి దీటుగా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే కథంతా హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది. అంత కీలకమైన పాత్రలో రీతూవర్మ చాలా చక్కగా నటించింది. భూమి పాత్రలో ఒదిగిపోయింది. వెన్నెల కిషోర్, ప్రవీణ్, సప్తగిరిల కామెడీ సినిమాలో పెద్ద రిలీఫ్. ముఖ్యంగా సప్తగిరి ‘ల్యాగ్’ కామెడీ అయితే కడుపుబ్బ నవ్విస్తుంది. హీరోయిన్ తల్లిదండ్రుల పాత్రలో చేసిన నదియా, మురళీ శర్మ కూడా చక్కగా నటించారు. కూతురు పెళ్లి కోసం తపించిపోయే తల్లి పాత్రలో నదియా మెప్పిస్తుంది. తన గత చిత్రాల్లోని క్యారెక్టర్ల కంటే ఇది కాస్త డిఫరెంట్ పాత్ర.


థమన్, విశాల్ చంద్రశేఖర్‌ల సంగీతం ఆకట్టుకుంటుంది. దిగు దిగు దిగు నాగ పాట ఇప్పటికే పెద్ద హిట్ అయింది. కోల కళ్లే ఇలా, మనసులోనే నిలిచిపోకే పాటలు కూడా బాగున్నాయి. నేపథ్య సంగీతం సోసోగానే ఉంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఖర్చుకు వెనకాడకుండా సినిమా తీసినట్లు ఫ్రేమ్‌లు చూసి చెప్పేయవచ్చు. ఉన్నవి ఒకటి, రెండు చిన్న యాక్షన్ సీన్లే అయినా వాటిని చక్కగా తెరకెక్కించారు. కెమెరామెన్ వంశీ పచ్చిపులుసు పనితనం కూడా చాలా బాగుంది.


ఓవరాల్‌గా చెప్పాలంటే.. దర్శకురాలు తీసుకున్న కథ చిన్నది కావడం, తెలిసిన కథే కావడంతో సినిమాలో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడం కష్టమేమీ కాదు. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే విధంగా రూపొందించడం ఈ పండగ సీజన్‌లో సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.