Vishnu Vinyasam Review - 'విష్ణు విన్యాసం' రివ్యూ: శ్రీవిష్ణు సినిమా హిట్టేనా? కామెడీ బావుందా? లేదా?
Vishnu Vinyasam Review In Telugu: శ్రీవిష్ణు, నయన్ సారిక జంటగా నటించిన సినిమా 'విష్ణు విన్యాసం'. హీరో సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేసేలా ఉందా? లేదా? రివ్యూలో తెలుసుకోండి.
యదునాథ్ మారుతీ రావు
శ్రీవిష్ణు, నయన్ సారిక, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, 'సత్యం' రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ తదితరులు
Sree Vishnu Latest Movie Vishnu Vinyasam Telugu Review: 'సామజవరగమన', 'ఓం భీమ్ బుష్', 'స్వాగ్', 'సింగిల్'... వరుసగా నాలుగు విజయాలు అందుకున్నారు శ్రీ విష్ణు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'విష్ణు విన్యాసం'. నయన్ సారిక హీరోయిన్. ఇవాళ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? శ్రీ విష్ణు సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేసేలా ఉందా? లేదా?
కథ (Vishnu Vinyasam Story): విష్ణు (శ్రీ విష్ణు)కు జాతకాల పిచ్చి. రాశి ఫలాలు చూసుకోనిదే, ఏం చేయాలని పురోహితుడిని అడగనిదే ఆయన రోజు గడవదు. ఓ కాలేజీలో జూనియర్ లెక్చరర్ ఉద్యోగం చేస్తున్న విష్ణుకు వయసు 30 దాటేసింది. పెళ్లి కాలేదు. తనకంటే వయసులో మూడేళ్లు చిన్నదైన లెక్చరర్ మనీషా (నయన్ సారిక)తో ప్రేమలో పడతాడు. అయితే ఆ అమ్మాయి జాతకంలో దోషం ఉందని తెలుస్తుంది. ఆ దోషం ఏమిటి? అది తెలిశాక మనీషాతో పెళ్లికి విష్ణు ఓకే చెప్పాడా? లేదా? విష్ణుకు ఎదురైన ప్రమాదం ఏమిటి? చివరకు ఏమైంది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Vishnu Vinyasam Review Telugu): కామెడీలో శ్రీ విష్ణుది సపరేట్ స్టైల్. కథతో సంబంధం లేకుండా ప్రేక్షకులను నవ్వించగల ట్యాలెంట్ ఆయనకు ఉంది. మినిమమ్ కంటెంట్ ఉంటే చాలు... కామెడీతో సినిమాను ముందుకు తీసుకు వెళతారు. అటువంటి శ్రీ విష్ణు సైతం కొన్ని సన్నివేశాల్లో కాస్త సైలెంట్ అయ్యారు.
శ్రీ విష్ణు రీసెంట్ హిట్స్ గమనిస్తే... ఆయా సినిమాల్లో కథ కంటే కామెడీకి ప్రేక్షకులు పట్టం కట్టారు. ఓ పాయింట్ తీసుకుని దాని చుట్టూ మంచి కామెడీ జనరేట్ చేస్తే చాలు... ఆడియన్స్ హిట్ ఇచ్చారు. ఆయా సినిమాలతో పోల్చినప్పుడు 'విష్ణు విన్యాసం'లో పాయింట్ ఉంది. జాతకాల పిచ్చి, పెళ్లి సమస్యల నేపథ్యంలో మాంచి కామెడీ సినిమాకు అవసరమైన సెటప్ అయితే రెడీ చేశారు. కానీ, కొత్త కామెడీని రాసుకోవడంలో దర్శకుడు తడబడ్డారు. హీరోకి జాతకాల పిచ్చి అనేది ఎలివేట్ చేయడానికి 'వెంకీ' సినిమాలో జేసీ ట్రాక్ తరహాలో ఒక ట్రాక్ క్రియేట్ చేశారు. అయినా నవ్వించారు. ఇక హీరోయిన్ జాతకంలో దోషాన్ని చూపించిన తీరు, దానికి ఇచ్చిన ముగింపు కూడా శాటిస్ఫై చేసేలా లేదు. అందువల్ల, పార్టులు పార్టులుగా కామెడీ నవ్విస్తుంది తప్ప ఓవరాల్ సినిమా చూస్తే నిరాశ కలుగుతుంది.
కామెడీ సినిమాకు అవసరమైన పాయింట్ తీసుకున్న దర్శకుడు యదునాథ్ మారుతీ రావు... కొన్ని సన్నివేశాల్లో మాత్రమే నవ్వించారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రధన్ పాటలు గుర్తు ఉండవు. ఆయన మ్యూజిక్ సినిమాకు మైనస్. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలను ఎలివేట్ చేసింది. ముఖ్యంగా యాక్సిడెంట్ సీన్. కెమెరా వర్క్ ఓకే. నిర్మాణ విలువలు పర్వాలేదు.
శ్రీవిష్ణు మరోసారి తనదైన శైలిలో నటించారు. ఆయన స్టైల్ ఆఫ్ మ్యానరిజమ్స్, వన్ లైనర్ డైలాగ్స్ ఈ సినిమాలోనూ కనిపిస్తాయి. నయన్ సారిక అందంగా ఉన్నారు. ఆ పాత్రకు అవసరం మేరకు నటించారు. ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. ఎందుకో... ఈ సినిమాలో సత్య క్యారెక్టర్ వర్కవుట్ కాలేదు. ఆయనకు సరైన సన్నివేశాలు పడలేదు. మెజారిటీ సినిమాను తన భుజాల మీద లాగే ప్రయత్నం చేశారు శ్రీ విష్ణు. అందువల్ల, మిగతా నటీనటులకు పెద్దగా స్కోప్ దక్కలేదు. శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, వడ్లమాని శ్రీనివాస్, బ్రహ్మాజీ, ప్రవీణ్ తదితరులు తమ తమ పాత్రలకు తగ్గట్టు చేశారు. వాళ్ళ కామెడీ ఓకే.
'కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్' ట్యాగ్‌కు న్యాయం చేస్తూ... తన మార్క్ కామెడీని శ్రీ విష్ణు అందించారు. ఆయన టిపికల్ డైలాగ్ డెలివరీ, వన్ లైనర్ పంచ్ డైలాగ్స్ నవ్విస్తాయి. అయితే... శ్రీ విష్ణు నుంచి ఆడియన్స్ ఆశించే ఫుల్ లెంగ్త్ కామెడీ & మంచి కథ రాయడంలో దర్శకుడు యదునాథ్ మారుతీ రావు ఫెయిలయ్యారు. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే శ్రీ విష్ణు కామెడీని ఎంజాయ్ చేసి రావచ్చు. శ్రీ విష్ణు కోసం 'విష్ణు విన్యాసం'.























