Vaazha 2 Review In Telugu - వాలా 2 రివ్యూ: మలయాళంలో 200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా - ఎలా ఉందంటే?
Malayalam Movie Vaazha 2 Telugu Review: సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'తో విజయం అందుకున్న నిర్మాత సాహు గారపాటి. తర్వాత మలయాళంలో 'వాలా 2'తో మరో హిట్ అందుకున్నారు. ఆ సినిమా ఎలా ఉందంటే?
సావిన్ ఎస్ఏ
హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వి, వేద శంకర్, అల్ఫోన్స్ పుత్రన్ తదితరులు
మలయాళ సినిమా మార్కెట్ తక్కువ. సరైన సినిమా తీయాలే కానీ వంద కోట్లు వసూలు చేస్తాయని 'మంజుమ్మేల్ బాయ్స్', 'కొత్త లోక' వంటి సినిమాలు ప్రూవ్ చేశాయి. మలయాళంలో 200 కోట్ల రూపాయల క్లబ్బులో చేరిన తాజా సినిమా 'వాలా 2'. ఈ చిత్ర నిర్మాతలలో షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి ఒకరు. సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు'తో విజయం అందుకున్న ఆయన... మలయాళంలో మరో హిట్ అందుకున్నారు. కేరళలో ఏప్రిల్ 2న విడుదలైన ఈ సినిమాను తెలుగులో ఏప్రిల్ 24న విడుదల చేశారు. ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ (Vaazha 2 Story In Telugu): ఇరుగు పొరుగు ఇళ్లల్లో నివసించే రెండు కుటుంబాల్లోని ఇద్దరు పిల్లలు (హాషిర్, అలన్).... చిన్నతనం నుంచే ప్రాణ స్నేహితులుగా ఉంటారు. అందులో ఒకరికి మళ్లీ తమ్ముడు పుడతాడు... ఇంకొకరికి చెల్లి పుడుతుంది. చెల్లి, తమ్ముడ్ని వాళ్లిద్దరూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అయితే స్కూల్‌లో హాషిర్, అలన్ వల్ల జరిగే గొడవలు, వాళ్ళు చేసే అల్లరితో అజిన్, వినాయక్ అనే మరో ఇద్దరు స్నేహితులు అవుతారు. ఈ నలుగురు కలిసి స్కూల్‌లో బీభత్సమే సృష్టిస్తారు.
ఓసారి గంజాయి కొట్టి స్కూల్లో సార్, పిల్లల తలలు పగలగొడతారు. ఆ కేసులో అరెస్ట్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ నలుగురు పిల్లల మీద సమాజం ఎలాంటి ముద్రను వేసింది? మత్తులో చేసిన తప్పు వల్ల నలుగురికి ఎటువంటి శిక్ష పడింది?వాళ్లకు జీవితం నేర్పిన గుణపాఠం ఏంటి? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Vaazha 2 Telugu Review): సందేశాన్ని చేదు గుళికలా కాకుండా షుగర్ కోటింగ్ ఇచ్చి చెప్పిన సినిమాలు అన్నీ దాదాపుగా విజయాలు సాధించాయి. ఈ 'వాలా 2' కూడా ఆ కోవలోకి వస్తుంది. కథగా చూస్తే ఇదేమీ కొత్త కాదు. కానీ, ప్రతి స్టూడెంట్ కనెక్ట్ అయ్యేలా ఉంది. మలయాళంలో 200 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి కారణం అదే అయ్యి ఉంటుంది. నేటివిటీని పక్కన పెడితే... తెలుగు యువత సైతం కనెక్ట్ అయ్యే అంశాలు 'వాలా 2'లో పుష్కలంగా ఉన్నాయ్.
'వాలా 2' స్పెషాలిటీ ఏమిటంటే... నేటివిటీకి, సహజత్వానికి దగ్గరగా సినిమా తీశారు. ఎక్కడా గీత దాటలేదు. ఇందులో యువతకు స్కూల్, కాలేజ్ లైఫ్ గుర్తు చేసే నోస్టాల్జియా మూమెంట్స్ చాలా ఉన్నాయి. సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ చాలా కీలకం. ఇండియా నుంచి విదేశాలకు చదువు (అమెరికా) లేదా ఉద్యోగం (దుబాయ్) కోసం వెళ్లిన యువత సినిమాలు చూడటం వల్ల ఓవర్సీస్ కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే విదేశాల్లో వాళ్ళు పడే కష్టాలను వినోదాత్మకంగా చూపించారు దర్శక రచయితలు శివన్ ఎస్ఏ, విపిన్ దాస్. పరోక్షంగా సందేశం కూడా ఇచ్చారు.
సాధారణంగా సినిమాల్లో ప్రేమికులు (హీరో హీరోయిన్లు) మధ్య రొమాన్స్ గురించి ఎక్కువ మాట్లాడతారు. కానీ, 'వాలా 2'లో స్నేహితుల మధ్య బ్రోమాన్స్ హైలైట్ అయ్యింది. ఇందులోని లవ్ ట్రాక్స్ అంత బలంగా లేవు. కానీ, ఫ్రెండ్షిప్ ట్రాక్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. స్నేహితులు చేసే తప్పులు, వాటి వల్ల ఎదురయ్యే పరిణామాలను చక్కగా చూపించారు. ఫస్టాఫ్ అంతా కూడా 'వాలా' తరహాలో ఉంటుంది. ఆ సినిమాతో పోలిస్తే కామెడీ అసలు తగ్గలేదు. కానీ, సెకండాఫ్ మాత్రం డిఫరెంట్‌గా ఉంది. నలుగురు స్నేహితుల్లో ముగ్గురు విదేశాలకు వెళ్లడం, ఒకడు ఊరిలో ఉండటం వంటివి జరిగాయి. ఎమోషనల్ సీన్స్ బావున్నాయి. అయితే కొంత సాగదీత వ్యవహారం కూడా ఉంది. స్కూల్ లైఫ్ & జాబ్ లైఫ్... వీటి మధ్య పేరెంటింగ్ - కథలో ఎక్కువ విషయాలు చెప్పాలని అనుకోవడం వల్ల కొన్నిటికి పూర్తి న్యాయం చేయలేదు.
తెలుగు డబ్బింగ్ విషయంలో కేర్ తీసుకోవడం హెల్ప్ అవుతుంది. యూత్ కనెక్ట్ అయ్యేలా ఉంది. తెలుగు డైలాగ్స్ చాలా చోట్ల నవ్వులు పూయిస్తాయి. లెజెండ్ బాలయ్య నుంచి అనిల్ రావిపూడి క్యాష్ అనుదీప్, కేఏ పాల్ ఇలా అందరినీ డైలాగ్స్‌లో వాడుకున్నారు. నిర్మాతలు బాగా ఖర్చు చేశారు. విజువల్స్, ఆర్ఆర్ బావున్నాయి. పాటలు ఓకే. క్యాచీ ట్యూన్స్ ఉండటం ప్లస్.
'వాలా 2'లో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ఆర్టిస్టులు ఒక్కరంటే ఒక్కరు లేరు. ఆ విషయంలో కొందరు డిజప్పాయింట్ కావచ్చు. కానీ, సినిమా మొదలైన కాసేపటికి నటీనటులను మరిచిపోయి పాత్రల్లోకి తీసుకు వెళ్లేలా ప్రతి ఆర్టిస్ట్ నటించారు. ఈ మూవీ మెయిన్ లీడ్స్ నుంచి స్కూల్‌లో టీచర్ల వరకు... అందరూ బాగా నటించారు. ప్రతి పాత్ర ప్రేక్షకుడి మీద ఇంపాక్ట్ చూపిస్తుంది.
'వాలా' చూడని ప్రేక్షకులకు 'వాలా 2' చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆ సినిమా చూసిన ప్రేక్షకులకు మరోసారి నోస్టాల్జియా మూమెంట్స్ గుర్తు చేస్తుంది. అక్కడక్కడా కాస్త డౌన్ అయినట్టు అనిపించినా... యూత్‌కి మాత్రం తప్పకుండా కనెక్ట్ అవుతుంది. వినోదంతో పాటు చక్కటి సందేశం ఇస్తుంది. యువతకు తమను తాము తెరపై చూసుకున్నట్టు అనిపిస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















