Sasivadane Review Telugu - 'శశివదనే' రివ్యూ: గోదావరి నేపథ్యంలో రక్షిత్, కోమలీ ప్రేమకథ - సినిమా ఎలా ఉందంటే?
Sasivadane Review In Telugu: రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా నటించిన ప్రేమకథ 'శశివదనే'. గోదావరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. మరి ఎలా ఉందో సినిమాలో చూడండి.
సాయి మోహన్ ఉబ్బన
రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్, శ్రీమాన్, దీపక్ ప్రిన్స్ తదితరులు
Rakshit Atluri and Komalee Prasad's Sasivadane Review In Telugu: రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'శశివదనే'. ఇందులో కోమలీ ప్రసాద్ కథానాయిక. సాయి మోహన్ ఉబ్బన దర్శకుడిగా పరిచయమయ్యారు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.
కథ (Sasivadane Story): రాఘవ (రక్షిత్ అట్లూరి)ది గోదావరి. డిగ్రీ పూర్తి చేశాడు. పీజీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఓ రోజు శశి (కోమలీ ప్రసాద్) కనిపిస్తుంది. మొదటి చూపులో ప్రేమలో పడతాడు. అప్పట్నుంచి ఆమె కోసం వెతకడం మొదలు పెడతాడు. అతని అన్వేషణ ఫలించి శశి కనిపిస్తుంది. రాఘవ పట్ల ఆకర్షితురాలు అవుతుంది. ప్రేమలో పడుతుంది. వీళ్లిద్దరి ప్రేమకు అడ్డుగా వచ్చింది ఎవరు? రాఘవ తండ్రి (శ్రీమాన్) ఏం చేశారు? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Sasivadane Telugu Review): ప్రేమ కథలపై వినిపించే విమర్శ... కొత్తగా లేదని! ఎందుకంటే... ప్రేమ జంటకు ఎవరో ఒకరి నుంచి అడ్డంకి రావడం, ఎన్ని అడ్డంకులు ఎదురైనా యుద్ధం చేసి ఒక్కటిగా నిలవడం - మ్యాగ్జిమమ్ సినిమాల్లో కథ ఇంచుమించు ఇలా ఉంటుంది. అయితే... కథను నడిపించిన విధానం, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, పాటలు ప్రేక్షకులకు నచ్చితే సినిమా హిట్టే. ఆ విధంగా 'శశివదనే' ఉందా? అనేది చూస్తే...
'శశివదనే' కథలో కొత్తదనం లేదు. కానీ క్లైమాక్స్ మాత్రం ఇప్పటి వరకు తెలుగు తెరపై సినిమాల్లో చూడలేదు. కథ పరంగా మాత్రమే కాదు, భావోద్వేగాల పరంగా 'శశివదనే' క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది. దర్శక రచయిత సాయి మోహన్ ఉబ్బన, నిర్మాత అహితేజ సైతం ఆ క్లైమాక్స్ మీద నమ్మకం పెట్టుకుని సినిమా చేసినట్టు ఉన్నారు. అందువల్ల, ఇంటర్వెల్ వరకు కథ అసలు ముందుకు సాగలేదు. ప్రేమ జంట పరిచయం, వాళ్ళ ప్రేమకు విలన్ ఎవరనేది చెప్పడంతో సరిపోయింది. సాధారణంగా కనిపించే ప్రేమ కథకు శరవణ వాసుదేవన్ అందించిన పాటలు, అనుదీప్ దేవ్ నేపథ్య సంగీతం, శ్రీ సాయి కుమార్ దారా విజువల్స్ కాస్త ఊపిరి పోశాయి. ఇంటర్వెల్ తర్వాత నిదానంగా సాగినప్పటికీ... క్లైమాక్స్ ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది.
అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల నిర్మాణ విలువలు బావున్నాయ్. ఈ చిత్రానికి సంగీతం, విజువల్స్ ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా కాస్ట్యూమ్స్. కోమలీ ప్రసాద్ కట్టుకున్న ప్రతి డ్రస్ (లంగా ఓణీ) కలర్ ఫుల్ గా కనిపించడమే కాదు... స్క్రీన్‌కు అందాన్ని తీసుకొచ్చాయి. దర్శక రచయిత సాయి మోహన్ లవ్ సీన్స్ మీద మరింత శ్రద్ధ వహించాల్సింది. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ వర్కవుట్ అయినంత హీరో అండ్ విలన్ ట్రాక్ వర్కవుట్ కాలేదు. దాంతో నిదానంగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది.
Also Read: 'అరి' రివ్యూ: అరిషడ్వర్గాలపై కథతో... ఎండింగ్‌లో శ్రీకృష్ణుడు... సినిమా ఎలా ఉందంటే?
రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్... ఇద్దరి జంట బావుంది. పాత్రలకు తగ్గట్టు చక్కగా నటించారు. వాళ్ళిద్దరి సెటిల్డ్ పెర్ఫార్మన్స్ వల్ల పలు సన్నివేశాలు నిలబడ్డాయి. లేదంటే రొటీన్ కథ మరింత బోరింగ్‌గా మారేది. తండ్రిగా శ్రీమాన్ కనిపించేది తక్కువ సీన్స్ అయినప్పటికీ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. హీరో స్నేహితుడిగా నటించిన అబ్బాయి బాగా చేశారు. విలన్ దీపక్ ప్రిన్స్ ఓకే.
డిఫరెంట్ క్లైమాక్స్‌తో కూడిన ప్రేమ కథ 'శశివదనే'. హీరో హీరోయిన్లు రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంట చూడముచ్చటగా ఉంది. వాళ్లిద్దరూ చక్కగా చేశారు. అయితే దర్శకుడు సాయి మోహన్ ఉబ్బన క్లైమాక్స్ మీద పెట్టిన శ్రద్ధ ప్రేమ సన్నివేశాలపై పెట్టలేదు. అందువల్ల ప్రేక్షకులపై స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో 'శశివదనే' ఫెయిల్ అయ్యింది. క్లైమాక్స్, కొన్ని మూమెంట్స్, సాంగ్స్ కోసం ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్ళండి.