Premante Review - 'ప్రేమంటే' సినిమా రివ్యూ: ప్రియదర్శికి హిట్ వచ్చిందా? సుమ కనకాల కామెడీ ఎలా ఉంది?
Premante Review Telugu: ప్రియదర్శి, ఆనంది జంటగా... సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ప్రేమంటే'. 'మిత్రమండలి' ఫ్లాప్ నుంచి హీరోను ఈ సినిమా బయట పడేసిందా?
నవనీత్ రామ్
ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల, వెన్నెల కిశోర్, అభయ్ బేతిగంటి, సురభి ప్రభావతి తదితరులు
Priyadarshi's Premante Movie Review In Telugu: ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన సినిమా 'ప్రేమంటే'. నవనీత్ రామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ యాంకర్ సుమ కనకాల, 'వెన్నెల' కిశోర్ కీలక పాత్రల్లో నటించారు. 'మిత్ర మండలి' ఫ్లాప్ తర్వాత వస్తున్న ఈ సినిమా ప్రియదర్శికి హిట్ ఇస్తుందా? సుమ కనకాల కామెడీ ఎలా ఉంది?
కథ (Premante Movie Story): మది (ప్రియదర్శి) దొంగ. ఆ సంగతి దాచి రమ్య (ఆనంది) ని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని రోజులకు భర్త చేసే పని భార్యకు తెలుస్తుంది. దొంగతనాలు మానేసి ఉద్యోగం చేయమని చెబుతుంది. సరేనని చెప్పినట్టు చేస్తాడు.
భర్తను దొంగతనాలు మానేయమని చెప్పిన భార్యే... మళ్ళీ భర్తను దొంగతనాలు చేయమని ఎందుకు ప్రోత్సహించింది? ఈ కేసును పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఆశా మేరీ (సుమ కనకాల) ఎలా సాల్వ్ చేసింది? సిటీలో జరిగిన దొంగతనాల్లో బిర్యానీ ఎటువంటి పాత్ర పోషించింది? మది, రమ్య గురించి ప్రపంచానికి తెలిసిందా? లేదా? అనేది సినిమా.
విశ్లేషణ (Premante Review Telugu): కామెడీ సినిమాలకు స్టోరీ, కాన్సెప్ట్ ఒక్కటే ఉంటే సరిపోదు. కాన్సెప్ట్, అందులో అందరినీ నవ్వించే కామెడీ కూడా ఉండాలి. తమ కథలో క్యారెక్టర్లకు మంచి కమెడియన్లను తీసుకుంటే సరిపోదు. ఆ కమెడియన్స్ ప్రతిభకు తగ్గట్టు సన్నివేశాలు, డైలాగులు రాయాలి. ఈ 'ప్రేమంటే' సినిమాలో కాన్సెప్ట్ ఉంది. కానీ కామెడీ లేదు.
ఒక్కటంటే ఒక్క జోక్ పేలకుండా, ఒక్కటంటే ఒక్క కామెడీ సీన్ కూడా వర్కవుట్ కాకుండా సినిమా తీయడం 'ప్రేమంటే' దర్శక రచయితలకు మాత్రమే సాధ్యమైంది. ప్రియదర్శిలో నటుడు మాత్రమే కాదు... అంతకు మించి కమెడియన్ ఉన్నాడు. అతడిని సరిగా వాడుకోలేదు. కథ, సన్నివేశంతో సంబంధం లేకుండా తన డైలాగ్ డెలివరీ, నటనతో నవ్వించగల ట్యాలెంట్ వెన్నెల కిశోర్ సొంతం. ఫర్ ద ఫస్ట్ టైమ్... ఆయన కూడా నవ్వించలేక సైలెంట్‌గా ఉన్నాయి. టీవీ షో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో సుమ కనకాల చేసే సందడికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సినిమాలో సుమ క్యారెక్టర్ చూస్తే వాళ్లందరూ డిజప్పాయింట్ అవుతారు. అంత పేలవంగా ఉంది ఆమె క్యారెక్టర్. ఇక డైలాగ్స్, సీన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
'థ్రిల్ ప్రాప్తిరస్తు...' పేరుతో దర్శకుడిగా పరిచయమైన నవనీత్ శ్రీరామ్ ఒక కాన్సెప్ట్ రాసుకున్నాడు. అయితే... అందులో లాజిక్ ఉందా? లేదా? అనేది అసలు ఆలోచించలేదు. కామెడీకి లాజిక్కులు అవసరం లేదనుకోండి. అయితే దొంగతనం చేయమని భార్య చెప్పే థియరీ / ఫిలాసఫీ వింటే ఆవాక్కు అవుతారు. దర్శకుడితో పాటు మరొక ఇద్దరు సినిమాకు డైలాగ్స్ రాశారు. విచిత్రం ఏమిటంటే ఒక్క డైలాగ్ కూడా బాలేదు. ఎగ్జిక్యూషన్ పరంగా దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. లియోన్ జేమ్స్ పాటల్లో 'దోచావే నన్ను...' ఒక్కటే బావుంది. కథలో ఆత్మను ఆవిష్కరించేలా 'రాధ కూడా దొంగ అయితే ఎలా' అనే లైన్ రాసిన శ్రీమణిని మెచ్చుకోవాలి. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. కానీ కథలో విషయం ఎంత ఉంది? అనేది ఆలోచించకుండా గట్టిగా ఖర్చు చేశారు.
Also Read: 'లవ్ ఓటీపీ' రివ్యూ: 'గర్ల్ ఫ్రెండ్'కు రివర్స్ కాన్సెప్ట్... అబ్బాయి భయపడి బ్రేకప్ చెప్పలేకపోతే?
ప్రియదర్శి ఎప్పటిలా నటించారు. అయితే ఆయనకు రాసిన సీన్లు గానీ, డైలాగులు గానీ వర్కవుట్ అవ్వలేదు. సినిమాలో సర్‌ప్రైజ్ ప్యాకేజ్ ఆనంది. ఆ పాత్రకు తగ్గట్టు చక్కగా నటించారు. ముఖ్యంగా ఎమోషన్స్ బాగా చూపించారు. ఒక సన్నివేశంలో 'ఇప్పుడు ఎందుకు అతి చేస్తున్నావ్' అని ఆనందితో ప్రియదర్శి అంటారు. అది నిజమే... కమెడియన్స్ / ఆర్టిస్టులు చాలామంది అతి చేశారు. యాక్షన్ బదులు ఓవరాక్షన్ చేశారు. ఒక్కరి నుంచి కూడా సరైన నటన రాబట్టుకోలేదు దర్శకుడు. 'జబర్దస్త్' షోలో 'హైపర్' ఆది, 'ఆటో' రామ్ ప్రసాద్ కామెడీ బావుంటుంది. ఇందులో ఇంట్రెస్ట్ లేనట్టు చేశారు.
ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల... సినిమాలో మంచి క్యాస్టింగ్ ఉంది. కానీ, వాళ్ళ ప్రతిభకు తగ్గ సన్నివేశాలు అయితే పడలేదు. కాన్సెప్ట్ ఓకే గానీ కామెడీని ఎగ్జిక్యూట్ చేయడంలో దర్శకుడు ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా నవ్వించలేదు. ప్రేమంటే... నవ్వులు అస్సలు లేవంతే! థ్రిల్ సంగతి మర్చిపోండి.
Also Read: 'కాంత' రివ్యూ: దుల్కర్ vs సముద్రఖని... మధ్యలో భాగ్యశ్రీ, రానా - మహానటి రేంజ్‌లో ఉందా?