Pallichattambi Movie Review - పళ్లిచట్టంబి రివ్యూ: కేరళ చరిత్రతో టోవినో థామస్ సినిమా... పృథ్వీరాజ్ సుకుమారన్ రోల్ ఎలా ఉందంటే?
Pallichattambi Review In Telugu: తెలుగులోనూ గుర్తింపు పొందుతున్న మలయాళ హీరో టోవినో థామస్. ఆయన సరసన కయాదు లోహర్ నటించిన 'పళ్లిచట్టంబి' ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?
డిజో జోస్ ఆంటోనీ
టోవినో థామస్, కయాదు లోహర్, శత్రు తదితరులతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్.
Tovino Thomas Pallichattambi Movie Review: 'మిన్నల్ మురళి'తో ఓటీటీ మంచి విజయం సాధించారు మలయాళీ కథానాయకుడు టోవినో థామస్. తెలుగు ఓటీటీ వేదికల్లో ఆయన సినిమాలకు తర్వాత మంచి ఆదరణ లభించింది. 'ఏఆర్ఎమ్'ను తెలుగులోనూ విడుదల చేశారు టోవినో థామస్. ఇప్పుడు 'పళ్లిచట్టంబి' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్', విశ్వక్ సేన్ 'ఫంకీ' ఫేమ్ కయాదు లోహర్ కథానాయికగా నటించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మాతలు. డిజో జోస్ ఆంటోనీ దర్శకుడు. మలయాళంలో ఏప్రిల్ 15న విడుదలైన ఈ సినిమాను తెలుగులో ఏప్రిల్ 17న థియేటర్లలోకి తీసుకు వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ (Pallichattambi Movie Story): కేరళ, కర్ణాటక సరిహద్దుల్లోని కణియార్ పేరుతో ఓ ఊరు ఉంది. అక్కడ క్రిస్టియన్లు ఎక్కువ. కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం నుంచి తమను రక్షించుకునేందుకు చర్చి ఫాదర్ ఓ రక్షకుడు కృష్ణ పిళ్ళై అలియాస్ పోతన్ క్రిస్టోఫర్ (టోవినో థామస్)ను తెచ్చుకుంటారు.
కణియార్ గ్రామానికి క్రిస్టోఫర్ వచ్చాక ఏం జరిగింది? ఆ ఊరిలో కమ్యూనిస్టు కార్యకర్త రెబెకా (కయాదు లోహర్)తో కృష్ణకు ఏర్పడిన పరిచయం ఎటువంటి మలుపులు తీసుకు వచ్చింది? బ్రిటీషర్లను సైతం భయపెట్టే నంబియార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఎవరు? అక్కడ కొండపై పిశాచి ఉందనే వార్తలు నిజమేనా? ఆ ప్రాంతంలో అల్లర్లకు కారణం ఎవరు? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Pallichattambi Review Telugu): 'పళ్లిచట్టంబి' పేరులో మాత్రమే కాదు... ఈ కథ, సినిమాలోనూ మలయాళ నేటివిటీ ఎక్కువ. సాధారణంగా పాన్ ఇండియా సినిమా అంటే ఇతర భాషల ప్రేక్షకులకు సైతం అర్ధమయ్యే యూనివర్సల్ కథలు అయితే బావుంటుందనేది గతంలో ఉండేది. అటువంటి అపోహలను 'కాంతార' పోగొట్టింది. నేటివిటీతో కూడిన కథలను ఇతర భాషల ప్రేక్షకుల ముందుకు హీరోలు, దర్శక నిర్మాతలు తీసుకు వెళుతున్నారు. ఆ కోవలో వచ్చిన సినిమా 'పళ్లిచట్టంబి'.
తెలంగాణలో సాయుధ పోరాటం కావచ్చు లేదంటే రజాకార్లకు ప్రజలు వ్యతిరేకంగా చేసిన పోరాటాలు కావచ్చు... అవి మన మట్టి కథలు. కేరళలోనూ అటువంటి మట్టి కథల్లో 'చట్టంబి' వ్యవస్థ ఒకటి. చర్చిలను కాపాడుకోవడం కోసం 1930లలో రక్షకులను నియమించే వ్యవస్థ ఉండేది. ఆ నేపథ్యంలో తీసిన చిత్రమే 'పళ్లిచట్టంబి'. దీనికి 'కేజీఎఫ్' తరహా బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఒకటి రాసుకున్నారు. అయితే ఆ రేంజ్ యాక్షన్, మైనింగ్ కథను సెకండ్ పార్ట్ కోసం దాచినట్టు ఉన్నారు.
భూమి కోసం జరిగే పోరాటమే 'పళ్లిచట్టంబి'లో ప్రధాన కథాంశం. ఇంటర్వెల్ వరకు అసలు ఏం జరుగుతుంది? అనే కన్‌ఫ్యూజన్ కొంత మంది ప్రేక్షకులకు క్రియేట్ అయినా సరే ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే... ఆ ప్రశ్నలకు సమాధానాలు సెకండాఫ్‌లో ఇచ్చారు. ఇంటర్వెల్ తర్వాత సినిమా పికప్ అందుకుంది. టోవినో థామస్ సినిమాను తన భుజాలపై మోశారు. ప్రీ క్లైమాక్స్ నుంచి ఆసక్తి మరింత ఎక్కువ అవుతుంది. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ ఇస్తుంది. భూమి నేపథ్యంలో రాసిన కొన్ని సన్నివేశాలు, కులం లేదా మతం రాసిన డైలాగులు బావున్నాయి. మలయాళీ నేటివిటీ ఎక్కువ కావడం కొంత మైనస్ అని చెప్పాలి. అలాగే, బలమైన విలన్ సినిమా ప్రారంభం నుంచి లేకపోవడం.
సాంకేతికంగా చూస్తే... 'పళ్లిచట్టంబి'లో జేక్స్ బిజాయ్ ఆర్ఆర్, టిజో టోమి కెమెరా వర్క్ ఉన్నత స్థాయిలో ఉన్నాయి. తెలుగు సాహిత్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే పాటలు రిజిస్టర్ అయ్యేవి ఏమో! థియేటర్ నుంచి బయటకు వస్తే గుర్తు ఉంచుకునేలా సాంగ్స్ లేవు. నిర్మాతలు పెట్టిన ఖర్చు తెరపై కనబడుతోంది.
'పళ్లిచట్టంబి'కి మెయిన్ ఎట్రాక్షన్ టోవినో థామస్. ప్రతి సినిమాకూ తన నటనలో వ్యతాసం చూపించడానికి ప్రయత్నిస్తారు. ఈ సినిమాలోనూ లుక్స్, బాడీ లాంగ్వేజ్ పరంగా కొత్త టోవినో థామస్ కనిపిస్తారు. నటనలోనూ అదరగొట్టేశారు. 'రెబెక్కా'గా కయాదు లోహర్ పాత్ర పరిధి తక్కువ. కమ్యూనిస్ట్ కార్యకర్తగా, స్టేజ్ ఆర్టిస్టుగా తన నటనలో వైవిధ్యం చూపించడానికి ప్రయత్నించారు. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ చివరిలో సర్‌ప్రైజ్ ఇచ్చారు. సెకండ్ పార్ట్ లీడ్ కోసం ఆయన్ను వాడుకున్నారు. ఫిరోషియస్ రోల్ అని అర్థం అవుతోంది. తెలుగు నటుడు శత్రుకు మంచి పాత్ర దక్కింది.
చట్టంబి అంటే రౌడీ అని అర్థం అట. కేరళలో కమ్యూనిస్టులు తొలిసారి అధికారం చేపట్టిన తర్వాత చర్చిలను కాపాడుకోవడం కోసం చట్టంబిలను ఆశ్రయించారట కొందరు. ఆ చరిత్ర, వ్యవస్థ తెలుసుకోవడం తెలుగు ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది. కథలో మంచి విషయం ఉంది. కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. టోవినో థామస్ నటన బావుంది. అందరికీ నచ్చుతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ స్పెషల్ సర్‌ప్రైజ్. ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















