Om Shanti Shanti Shantihi Review Telugu - 'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ: మొగుడ్ని పెళ్ళాం కొడితే... తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా సినిమా ఎలా ఉందంటే?
Om Shanti Shanti Shantihi Review In Telugu: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన సినిమా 'ఓం శాంతి శాంతి శాంతిః'. జనవరి 30న థియేటర్లలో విడుదల. ఈ సినిమా ఎలా ఉందంటే?
ఏఆర్ సజీవ్
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, బ్రహ్మజీ, సురభి ప్రభావతి, శివన్నారాయణ తదితరులు
Tharun Bhascker's Om Shanti Shanti Shantihi Telugu Review: యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన సినిమా 'ఓం శాంతి శాంతి శాంతిః'. ఇందులో ఈషా రెబ్బా హీరోయిన్. మలయాళ హిట్ 'జయ జయ జయ జయహే'కు రీమేక్. ఏఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఎలా ఉంది? అనేది చూస్తే...
కథ (Om Shanti Shanti Shantihi Story): శాంతి... కొండవీటి ప్రశాంతి (ఈషా రెబ్బా)ది గోదావరి జిల్లా. చదువుకుని ఉద్యోగం చేయాలని అనుకుంటుంది. కానీ అమ్మాయి కావడంతో పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు తల్లిదండ్రులు. పెళ్ళైన తర్వాత డిగ్రీ చదువుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని అమ్మాయిని చూసుకోవడానికి వచ్చినప్పుడు చెబుతాడు అంబటి ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్). అయితే పెళ్ళైన తర్వాత భార్య మీద చెయ్యి చేసుకుంటాడు. ఒకట్రెండు సార్లు కాదు... పదే పదే అదే తీరు.
భర్త కొడుతున్నాడని పుట్టింట్లో శాంతి చెప్పినా ప్రయోజం ఉండదు. సహనం నశించి ఓరోజు భర్తను కొడుతుంది. ఆ తర్వాత ఏమైంది? భార్య భర్తల మధ్య కొట్లాటలో విజయం ఎవరిది? ఇంట్లో తెలిసిన తర్వాత అబ్బాయి తల్లి (సురభి ప్రభావతి), అమ్మాయి తల్లిదండ్రులు (శివన్నారాయణ, బిందు చంద్రమౌళి) రియాక్షన్ ఏమిటి? చివరకు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన శాంతి, నాయుడు ఏం చేశారు? అనేది సినిమా.
విశ్లేషణ (Om Shanti Shanti Shantihi Review Telugu): బసిల్ జోసెఫ్, దర్శనా రాజేంద్రన్ జంటగా నటించిన 'జయ జయ జయ జయహే' తెలుగు వెర్షన్ జియో హాట్‌స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది. అయినా రీమేక్ చేయడం ఏమిటి? అని కొందరికి సందేహాలు వచ్చాయి. అయితే తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కువ మంది చూడలేదు కనుక రీమేక్ చేయడం సబబు అనుకోవచ్చు. రీమేక్ అనేది పక్కన పెట్టి... 'ఓం శాంతి శాంతి శాంతిః' ఎలా ఉందనేది చూస్తే?
Jaya Jaya Jaya Jaya Hey Telugu Remake Review: ప్రతి సినిమాకు మంచి కథ, ఆయా పాత్రలకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడం అంతే ముఖ్యం. ఆ కోణంలో 'ఓం శాంతి శాంతి శాంతిః' దర్శక రచయితలు వర్క్ చేయాల్సింది. ఈషా రెబ్బా మంచి నటి. అందులో సందేహం లేదు. అయితే 'దర్శకుడు', 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలతో పాటు '3 రోజెస్' వెబ్ సిరీస్ కారణంగా 'గడుసు పిల్ల' టైపు ఇమేజ్ వచ్చింది. ఈషా రెబ్బాను చూస్తే పవర్ ఫుల్ లేడీ అన్నట్టు ఉంటారు. భర్త చేతిలో అటువంటి అమ్మాయి దెబ్బలు తింటుంటే 'అయ్యో...' అని జాలి కలగదు. తప్పకుండా తిరగబడుతుందని ముందు నుంచి ప్రేక్షకులు బలంగా నిర్ణయించుకుంటారు. అందువల్ల, కథ - సన్నివేశాలు తీసుకు రావాల్సిన ఫీలింగ్ ఇంటర్వెల్ వరకు రాలేదు. అందుకు ఈషా రెబ్బా ఇమేజ్ అడ్డు వచ్చింది. ఇక, ఇంటర్వెల్ తర్వాత నుంచి ఈషా రెబ్బాకు సూటయ్యే సీన్స్, ఫైట్స్ పడ్డాయి.
తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేయడంలో దర్శకుడు ఏఆర్ సజీవ్ సక్సెస్ అయ్యారు. కానీ, కథలో సోల్ యాజిటీజ్ కన్వే చేయడంలో చాలా తడబడ్డారు. కథానాయిక పాత్రలో అమాయకత్వం, సున్నితత్వం తెరపైకి సరిగా రాలేదు. ఎమోషన్స్ చూపించే విషయంలో హడావిడి పడ్డారు. దాంతో కనెక్ట్ కావడం కష్టం అవుతుంది. ఫస్టాఫ్ ఫ్లాట్‌గా సాగుతుంది. సెకండాఫ్ కొన్ని ఫన్ మూమెంట్స్‌తో ముందుకు వెళ్ళింది. ఎమోషన్స్ పరంగా ఇంపాక్ట్ చూపించడంలో ఫెయిల్ అయ్యింది. సంసార జీవితం, భర్త నుంచి భార్య కోరుకునేది కోర్టులో చెప్పించడం బావుంది. కానీ, అప్పటికే ప్రేక్షకుల మనసులో చోటు దక్కించుకోవడం ఆలస్యం అయ్యింది. ప్రయత్నంలో నిజాయతీ ఉంది కానీ సినిమాలో ఆకట్టుకునే అంశాలు తక్కువ.
'జయ జయ జయ జయహే'లో హీరోది కోళ్ల వ్యాపారం అయితే 'ఓం శాంతి శాంతి శాంతిః'లో చేపల వ్యాపారం. అక్కడ హీరోకి పుట్టు (కేరళ వంటకం) ఇష్టం అయితే ఇక్కడ ఇడ్లీ ఇష్టం. అందుకు తగ్గట్టుగా 'రోట్లో రుబ్బితే గానీ నోట్లో పెట్టడు' వంటి మాటలు రాశారు. డైలాగుల్లో ప్రాస కోసం ప్రయత్నించారు. కొన్ని బావుంటే మరికొన్ని పంటికింద రాయిలా తగిలాయి. పాటలు, నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గుర్తుండేవి తక్కువ. నిర్మాణ విలువలు యావరేజ్. సినిమాటోగ్రఫీ పర్వాలేదు.
గోదావరి యువకుడిగా తరుణ్ భాస్కర్ ఒదిగిపోయారు. నటనలో ఈషా రెబ్బాను తప్పు పట్టలేం. కానీ, శాంతి పాత్రకు ఆవిడ మిస్ మ్యాచ్. సెకండాఫ్ నుంచి తన ఇమేజ్ మ్యాచ్ చేసే రోల్ కావడంతో ఆయా సన్నివేశాల్లో బాగా చేశారు. బ్రహ్మజీ కనిపించేది కొన్ని సన్నివేశాలే. కానీ, బాగా చేశారు. ముఖ్యంగా రెండు కుటుంబాల నడుమ భార్య భర్తలకు పంచాయతీ చేసే సన్నివేశంలో నవ్వులు పూయించారు. సురభి ప్రభావతి, శివన్నారాయణ, బిందు చంద్రమౌళి తదితరులు ఓకే.
పెళ్ళైన తర్వాత భర్త నుంచి భార్యలు ఏం కోరుకుంటున్నారు? సంసార జీవితం ఎలా ఉండాలని ఆశిస్తున్నారు? అనేది చెప్పే సినిమా 'ఓం శాంతి శాంతి శాంతిః'. సందేశానికి సున్నితమైన హాస్యం మేళవించి చెప్పాలని ప్రయత్నించారు. అటు సందేశం, ఇటు వినోదం... రెండింటిలోనూ ప్రేక్షకులకు చేరాల్సినంత మోతాదు లేదు. చేపల పులుసు చప్పగా సాగింది. ఒరిజినల్ చూడని ప్రేక్షకులు అసలు అంచనాలు పెట్టుకోకుండా వెళితే కాస్త ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది.






















