Nilave Movie Review - 'నిలవే' రివ్యూ: ప్రెగ్నెంట్ అయినా పెళ్లికి 'నో'... పొయెటిక్ ప్రేమకథలో ట్విస్ట్ - సినిమా ఎలా ఉందంటే?
Nilave Review In Telugu: సౌమిత్ రావు పోలాడి హీరోగా నటిస్తూ సాయి కె వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన సినిమా 'నిలవే'. కళ్యాణ్ నాయక్ సంగీతం అందించిన ఈ సినిమా ఎలా ఉందంటే?
సౌమిత్ రావు పోలాడి, సాయి కే వెన్నం
సౌమిత్ రావు పోలాడి, శ్రేయాసి సేన్, వైవా హర్ష, సుప్రియా ఐసోల తదితరులు
సౌమిత్ రావు పోలాడి (Sowmith Rao Poladi), డాక్టర్ శ్రేయాసి సేన్ (Shreyasi Sen) జంటగా నటించిన సినిమా 'నిలవే' (Nilave Movie). హీరో హీరోయిన్లకు తొలి చిత్రమిది. 'మేం ఫేమస్', 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ఫేమ్ కళ్యాణ్ నాయక్ (Kalyan Nayak Music Director) సంగీతం అందించారు. ఇందులో కథానాయకుడిగా నటించడంతో పాటు సాయి కె వెన్నంతో కలిసి దర్శకత్వం వహించారు సౌమిత్ పోలాడి. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 13న థియేటర్లలోకి వచ్చిందీ సినిమా. పదకొండు పాటలు ఉన్న ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Nilave Movie Story): అర్జున్ (సౌమిత్ రావు పోలాడి) సినిమాటోగ్రాఫర్. యాడ్ ఏజెన్సీలో ఉద్యోగం చేస్తున్నాడు. అనాథ అయినటువంటి తన జీవితంలో తోడు లేని వెలితి. జీవితాన్ని వద్దనుకుని ఆత్మహత్యాయత్నం చేస్తాడు. ఉరి వేసుకున్న తర్వాత అపార్ట్‌మెంట్‌లో తన ఎదురు ఫ్లాట్‌లో ఉన్న అతిథి (డాక్టర్ శ్రేయాసి సేన్) కనిపిస్తుంది. అదృష్టం కొలదీ బతుకుతాడు.
అతిథిని ఫాలో అవుతాడు అర్జున్. ఆమెకు తెలియకుండా ఫోటోలు తీస్తాడు. ఆమెతో పరిచయం పెంచువాలని ప్రయత్నిస్తాడు. అర్జున్ తీసిన ఫోటోలు చూసి... అతనికి ఓ మ్యూజికల్ వీడియో చేసే అవకాశం ఇప్పిస్తుంది అతిథి. ఇద్దరూ దగ్గర అవుతారు. ప్రేమలో పడతారు. పెళ్లి కాకముందు గర్భవతి అవుతుంది. కానీ, పెళ్లికి మాత్రం 'నో' అంటుంది అతిథి. ఎందుకు? అతిథి గతంలో ఏం జరిగింది? 'వెళ్ళిపో అర్జున్' అని ఎందుకు ఇంటి నుంచి గెంటేసింది? గతంలో అతిథి ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేసింది? చివరకు ఇద్దరూ ఒక్కటయ్యారా? లేదా? అనేది సినిమా.
విశ్లేషణ (Nilave Review Telugu): పెదవులపై పలకని భాష ఒకటి ఉంటుంది... అది సంగీతం! ప్రతి కథను ప్రేక్షకుడికి చేరవేసే ప్రయత్నం చేస్తుంది. ప్రతి సినిమాలోనూ ప్రేక్షకుడికి కథలో కనిపించని భావాన్ని చెబుతుంది. ప్రేక్షకుడితో మాట్లాడుతుంది. 'నిలవే'లో ఆ సంగీతం కథ, సంభాషణలు, నటీనటుల ప్రతిభను మించి మాట్లాడింది. ఇందులో 11 పాటలు ఉన్నాయి. ప్రతి పాట వినసొంపుగా, కనువిందుగా ఉంది. థియేటర్లలో జనాలను కూర్చోబెడుతుంది.
టెక్నికల్ టీం నుంచి ఫెంటాస్టిక్ అవుట్ పుట్ తీసుకోవడంలో దర్శక రచయితలు సౌమిత్ రావు పోలాడి, సాయి కె వెన్నం సక్సెస్ అయ్యారు. కానీ రైటింగ్ పరంగా డిజప్పాయింట్ చేశారు. కళ్యాణ్ నాయక్ ముందు సినిమాలు 'మేం ఫేమస్', 'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో పాటలతో పోలిస్తే... 'నిలవే'లో పాటలకు చాలా వ్యత్యాసం ఉంది. సౌండింగ్ నుంచి ట్యూనింగ్ వరకు వేరియేషన్ చూపించారు. తనలో ఆల్ రౌండర్ ఉన్నాడని నిరూపించుకున్నాడు. కళ్యాణ్ నాయక్ (Kalyan Nayak)కు 'నిలవే' విజిటింగ్ కార్డు అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. బాణీలకు భరద్వాజ చక్కటి సాహిత్యం అందించారు. సినిమాటోగ్రఫీ బావుంది. కొన్ని సన్నివేశాల్లో ఆశించినట్టు విజువల్స్ లేవు. కానీ, కొన్ని సన్నివేశాలను పెయింటింగ్ తరహాలో చూపించారు. చిన్న చిన్న వీఎఫ్ఎక్స్ కూడా బాలేదు. లో బడ్జెట్ సినిమా కనుక క్షమించవచ్చు.
సంగీతం, సినిమాటోగ్రఫీలో కొత్త వాళ్ళు అయినా కళ్యాణ్ నాయక్, దిలీప్ కుమార్ 'బెస్ట్' ఇచ్చారు. అయితే రైటింగ్ పరంగా సౌమిత్ రావు పోలాడి, సాయి కె వెన్నం తమ ఆలోచనలను సరిగ్గా ఆవిష్కరించడంలో తడబడ్డారు. బ్రేకప్ కథల్లో అయితే హీరో లేదా హీరోయిన్‌ను విలన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎవరో ఒకర్ని కారణంగా చూపిస్తారు. కానీ, ఈ కథను రొటీన్‌కు భిన్నంగా ప్రజెంట్ చేశారు.
ఈతరం యువత ఎదుర్కొనే రెండు సమస్యలను 'నిలవే'లో స్పృశించారు. ఒకటి... తోడు. రెండు... నమ్మకం. టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రపంచం అరచేతిలోకి వచ్చింది. అయినా కొంత మంది ఒంటరితనాన్ని ఫీలవుతున్నారు. తోడు లేదని బాధ పడుతున్నారు. హీరోని అనాథ చేయడం ద్వారా ఆ ఒంటరితనాన్ని చూపించారు. మరొకటి... ప్రేమలో మోసపోయి పెళ్లిపై నమ్మకం కోల్పోవడం. దర్శక రచయితల ఆలోచనలు చాలా బావున్నాయి. కానీ తెరపై ఆవిష్కరించే క్రమంలో తప్పటడుగులు పడ్డాయి. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు టెంపో మైంటైన్ చేయడంలో ఫెయిలయ్యారు. లెంగ్త్ ఎక్కువైన ఫీలింగ్ వస్తుంది. పొయెటిక్‌గా ప్రజెంట్ చేసే క్రమంలో కథను చెప్పేందుకు ఎక్కువ సమయం తీసుకున్నారు. జీవన్ సన్నివేశాలు, వైవా హర్ష - సుప్రియ సన్నివేశాలు నిడివి పెంచాయి. ఫ్లాష్ బ్యాక్‌లో విషయం ఉంది. ఆ ఎమోషన్ తెరపైకి సరిగా రాలేదు.
అర్జున్ పాత్రలో సౌమిత్ రావు పోలాడి నటన ఓకే. హుషారైన పాటల్లో డ్యాన్స్ బాగా చేశారు. అయితే ఎమోషనల్ సన్నివేశాలకు వచ్చేసరికి ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అతిథి పాత్రకు శ్రేయాసి సేన్ సహజత్వం తీసుకు వచ్చింది. స్వతహాగా బెంగాలీ కావడం, సినిమాలో పాత్ర నేపథ్యం అదే కావడంతో లుక్స్ పరంగా యాప్ట్ అనిపించింది. నటిగానూ ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. 'నిలవే' సినిమాకు స్టార్ అంటే హర్ష చెముడు. ఆయన కామెడీ చేయలేదు. కథలో కీలకమైన పాత్ర చేశారు. హీరోయిన్ మ్యూజిక్ బ్యాండ్‌లో యువకుడిగా సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్ కనిపించారు.
పొయెటిక్ ప్రేమ కథలు కోరుకునే ప్రేక్షకులకు 'నిలవే' మంచి ఆప్షన్. సౌమిత్ రావు పోలాడి, శ్రేయాసి సేన్... హీరో హీరోయిన్లు కొత్తవాళ్ళు అయినప్పటికీ కథకు తగ్గట్టు నటించారు. కళ్యాణ్ నాయక్ ఫెంటాస్టిక్ ఆల్బమ్ ఇచ్చారు. ఆ పాటలు, విజువల్స్ కోసం ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా ఒక లుక్ వేసే ప్రయత్నం చేయవచ్చు.























