Mrithyunjay Review - 'మృత్యుంజయ్' రివ్యూ: శ్రీవిష్ణు థ్రిల్లర్ ఎలా ఉంది? కామెడీ కాదు, కంటెంట్‌తో హిట్ కొట్టాడా?
Mrithyunjay Review In Telugu: శ్రీవిష్ణు హీరోగా నటించిన థ్రిల్లర్ 'మృత్యుంజయ్'. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ సినిమా ఎలా ఉంది?
హుస్సేన్ షా కిరణ్
శ్రీవిష్ణు, రెబ్బా మోనికా జాన్, వీర్ ఆర్యన్, సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప శర్మ, బాలాదిత్య తదితరులు
Sree Vishnu Mrithyunjay Movie Review Telugu: కథ కంటే తన కామెడీతో వరుసగా సినిమాలను హిట్ ట్రాక్ ఎక్కించారు శ్రీవిష్ణు. అందుకే ఆయనకు 'కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్' అని బిరుదు ఇచ్చారు. అయితే... 'మృత్యుంజయ్'లో శ్రీవిష్ణు పేరు ముందు 'కింగ్ ఆఫ్ కంటెంట్' అని వేశారు. కథలో కామెడీ ఉండదని, కంటెంట్ ఉంటుందని ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. టైటిల్ కార్డులో కూడా ఆ విషయాన్ని చెప్పారు. మరి సినిమా ఎలా ఉంది? ఏమిటి? అనేది చూస్తే...
కథ (Mrithyunjay Story): ఓ వార్తాపత్రికలో జయ్ అలియాస్ మృత్యుంజయ్ (శ్రీ విష్ణు) యాడ్ సేల్స్ ఏజెంట్. ఎవరైనా మృతి చెందారని తెలిస్తే అక్కడ చేరి, వాళ్ళను కన్వీన్స్ చేసి యాడ్ (శ్రద్ధాంజలి ప్రకటన) తీసుకోవడంలో సిద్ధహస్తుడు. ఎప్పటికైనా క్రైమ్ రిపోర్టర్ కావాలనేది అతని లక్ష్యం. ఒక రోజు యాడ్ తీసుకోవడానికి వెళ్లిన సమయంలో సరిగ్గా వారం క్రితం అదే రీతిలో మరొకరు మరణించారని గురిస్తాడు.
సహజ మరణాలు కాదని, హత్యలు అని ఐపీఎస్ సీత (రెబ్బా మోనికా జాన్)కు చెబుతాడు. అయితే... జయ్ మాటలు ఎవరూ నమ్మరు. స్నేహితుడు అంజి (సుదర్శన్) సాయం, తన తెలివితేటలతో హంతకుడి ఆచూకీ తెలుసుకోవడం కోసం జయ్ ప్రయత్నిస్తాడు. అది తెలిసి హంతకుడు ఏం చేశాడు? అతడి నుంచి జయ్ ఎలా తప్పించుకున్నాడు? ఆ విలన్ ఎవరు? ఎందుకు హత్యలు చేశాడు? అనేది సినిమా.
విశ్లేషణ (Mrithyunjay Review Telugu): కంటికి కనిపించని శత్రువుతో కథానాయకుడు చేసే యుద్ధం ఎప్పుడూ ఆసక్తిగా సాగుతుంది. 'మృత్యుంజయ్' కోసం అటువంటి కథ ఎంపిక చేసుకున్నారు దర్శకుడు హుస్సేన్ షా కిరణ్. ఆ కథకు ఎటువంటి కమర్షియల్ హంగులు లేకుండా చక్కగా క్యాట్ & మౌస్ గేమ్ తరహాలో ముందుకు నడిపించారు.
'మృత్యుంజయ్'కు మెయిన్ పిల్లర్... కంటెంట్, ఆ కంటెంట్‌కు తగ్గట్టు హీరో & దర్శక నిర్మాతల సిన్సియర్ అటెంప్ట్. ఇటువంటి కథకు కమర్షియల్ అంశాలు యాడ్ చేయవచ్చు. హీరో హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ ట్రాక్ రన్ చేయవచ్చు. కానీ, అటువంటి పనులు చేయలేదు హుస్సేన్ షా కిరణ్. కథతో పాటు క్యారెక్టర్లు ట్రావెల్ చేశాయి. సస్పెన్స్, థ్రిల్లర్... రెండిటిని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ స్టార్టింగ్ టు ఎండ్ ఎంగేజ్ చేశారు. అయితే మధ్య మధ్యలో కొంత సాగదీయడం మైనస్. అందుకు తగ్గట్టు టెక్నికల్ టీం నుంచి అవుట్ పుట్ తీసుకున్నారు.
ఎటువంటి ఎలివేషన్లు లేకుండా హీరోని పరిచయం చేశారు హుస్సేన్ షా కిరణ్. ఆ తర్వాత వెంటనే కథలోకి, మర్డర్ మిస్టరీలోకి వెళ్లారు. అయితే ఇంటర్వెల్ ముందు వరకు కాస్త నిదానంగా వెళుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఆసక్తి పెరుగుతుంది. ఆ తర్వాత సెకండాఫ్ క్యూరియాసిటీని మైంటైన్ చేస్తూ చివరి వరకు వెళ్ళింది. దీనికి కాల భైరవ సంగీతం బలంగా నిలిచింది. టెన్షన్ క్రియేట్ చేయడంలో ఆర్ఆర్ కీ రోల్ పోషించింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంది. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదు.
కామెడీ... కామెడీ... కామెడీ... నాలుగైదేళ్లుగా శ్రీవిష్ణును వినోదాత్మక క్యారెక్టర్లలో ప్రేక్షకులు చూస్తున్నారు. బట్, ఫర్ ఏ ఛేంజ్... ఇందులో కామెడీని పక్కనపెట్టి సిన్సియర్ రోల్ చేశారు. నటనలో నిజాయతీ కనిపించింది. ఎమోషనల్ సీన్స్ బాగా చేశారు. చిన్న పాపతో ఆయన సన్నివేశాలు బావున్నాయి. విలన్ రోల్ చేసిన వీర్ ఆర్యన్, ఆ పాత్రకు అవసరమైన నటన కనబరిచారు. రెబ్బా మోనికా జాన్ పాత్ర పరిధి తక్కువ. ఉన్నంతలో బాగా చేశారు. అయ్యప్ప శర్మ, రచ్చ రవి, సుదర్శన్ తమ పాత్రలకు తగ్గట్టు చేశారు. కథకు అవసరమైన ఎమోషన్ రన్ అయ్యే పాత్రలో బాలాదిత్య నటన ఇంపాక్ట్ చూపిస్తుంది. హర్షవర్ధన్, అనీష్ కురువిల్లా తదితరులు చిన్న చిన్న పాత్రలో తళుక్కున మెరిశారు.
మృత్యుంజయ్... డీసెంట్ థిల్లర్. హీరో శ్రీ విష్ణు, దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ సిన్సియర్ ఎఫర్ట్స్ మొదటి నుంచి చివరి వరకు కనిపిస్తాయి. మైండ్ గేమ్, హీరో & విలన్ మధ్య ఇంటిలిజెంట్ ప్లే నేపథ్యంలో నడిచే కథలను బాగా ఇష్టపడే ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు



















